
తోలుబొమ్మలాటలు ,బయలు నాటకాలు, రంగస్థల నాటకాలు (డ్రామాలు )ఒక నాడు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను ఉర్రూతలూగించాయి. సినిమాలు రావడం ,సాంకేతిక విప్లవం రావడంతో ఆనాటి గ్రామీణ కళలన్నీ నేడు కనుమరుగయ్యాయి.
ఇప్పటిలా సినిమాలు , వీడియో లు లేని రోజుల్లో జనాలని తన ప్రతిభతో ఒక ఊపు ఊపేది నాటకం. రాజుల కాలక్షేపానికి, వినోదానికి ప్రదర్శించబడ్డ ఈ నాటకాలు కాలక్రమేణా ఎక్కడ జాతరలు జరిగినా లేదా ఉత్సవాలు జరిగినా అక్కడ ప్రదర్శించబడటం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో వీటికి విశేష ఆదరణ ఉండేది. స్వాతంత్ర పోరాటంలో ప్రజలను చైతన్యవంతం చేయడంలో నాటకాలు కూడా ప్రధాన పాత్ర పోషించాయి.
ఆంధ్ర నాటక పితామహడు బిరుదు గ్రహీత.. నాటకరంగంలో ముఖ్యులు…. బహుభాషా కోవిదులు….నాటక రచయిత…. ప్రజ్ఞాశాలి ధర్మవరం రామకృష్ణ చార్యులు
ధర్మవరం రామకృష్ణమాచార్యులు
1853 లో అనంతపురం జిల్లా ధర్మవరం అగ్రహారం గ్రామంలో జన్మించారు.ధర్మవరం గోపాలాచార్యులు ఇతని పెద్దతమ్ముడు. తండ్రి
కొమాండూరు కృష్ణమాచార్యులు
తల్లి లక్ష్మీదేవమ్మ.బళ్లారి రాఘవ వీరికి అల్లుడు.
తండ్రివద్దనే ఆంధ్ర, సంస్కృత, కన్నడ భాషలు నేర్చుకున్నాడు.1870లో మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. తాతగారి వద్ద రఘువంశము, చంపూరామాయణము, ప్రతాపరుద్రీయము చదివాడు. 1874లో ఎఫ్.ఏ. పరీక్షలోను, సెకండరీగ్రేడ్ ప్లీడర్షిప్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.
కృష్ణమాచార్యులవారి తండ్రిగారు మంచి పండితులు. తాత ముత్తాతలుకూడ విఖ్యాత విద్వాంసులు. తండ్రి బళ్ళారి “వార్థ లా కాలేజి లోతెలుగు పండితులుగా పనిచేశారు.
కృష్ణమాచార్యులు విద్య పూర్తి కాగానే మొదట ఆదోని ‘తాలూకాకచేరీ’ లో పనిచేశారు. కొద్ది కాలం తర్వాత బళ్ళారి కంటోన్మెంటు మేజస్ట్రేటు కోర్టు లో వకీలు ‘ గా పనిచేశారు. వీరికి ,వీరి తమ్మునికి విపరీతంగా నాటకాల పిచ్చి. ఈయన వకీలే కాదు మంచి పడితులు అష్టావధానం, శతావధానం చేసేవారు. కొక్కొండ వేంకటరత్న మహా మహోపాధ్యాయుని వంటి వారి మన్ననలు పొందారు.
ఆధునిక యుగంలో వెలసి, ప్రఖ్యాతి గడిచిన ధర్మవరం రామకృష్ణమాచార్యులవారివి ముప్ఫై నాటకాలున్నా, వాటన్నింటిలోను వారి విషాద సారంగధర నాటకం ప్రసిద్ధి చెందింది. కన్నడంలో స్వప్నావిరుద్ధమనే ఉషాపరిణయ నాటకం రచించి ప్రదర్శించారు. ఇది వీరి ప్రదమ నాటకం.
నాటకకర్తగా, నటుడుగా, ప్రయోక్తగా, సరస వినోదినీ సభాధ్యక్షులుగా ప్రసిద్ధి పొందారు.ఆధునిక యుగంలో మాత్రమే తెలుగు నాటకాలు రచింపబడి, ప్రదర్శింపబడుతూ వచ్చాయి. ఆంగ్ల పార్శీ నాటక రంగాలవల్ల, ధార్వాడ, పార్శీ సంచార నాటక కంపెనీలవల్ల తెలుగులోను నాటకాలు ప్రారంభమయ్యాయి.
ధర్మవరం వారి మొట్టమొదటి తెలుగు నాటకం చిత్రనళీయం అయినా వారికి ప్రసిద్ధి తెచ్చి పెట్టిన నాటకం విషాద సారంగధర నాటకమే.
నాటకాల్లో చిత్రనళీయం, విషాద సారంగధర, పాదుకా పట్ట్భాషేకం మొదలైన నాటకాలు రంగస్థలంపై విజయాన్ని సాధించి ప్రేక్షకుల మన్ననలందుకొన్నాయి.
1860లోనే మంజరీ మదుకరీయంతో తెలుగు నాటక రచన, 1880లో కందుకూరి వారి నాటక ప్రదర్శన ప్రారంభమైనా ధర్మవరం వారి గద్య పద్య గేయాత్మకమైన స్వతంత్ర నాటకాల రచనా ప్రదర్శనలతో విశిష్ట కీర్తి గడించారు. వీరికి ఆంధ్ర నాటక పితామహ బిరుదు సార్థకమైంది.
1886లో బళ్లారిలో సరసవినోదిని సభ అనే నాటకసభను నెలకొల్పాడు. మొదట స్వప్నానిరుద్ధ అనే కన్నడ నాటకాన్ని ప్రదర్శించాడు. 1887లో చిత్రనళీయము అనే తెలుగునాటకాన్ని బళ్లారి పట్టణంలో మొదటిసారిగా ప్రదర్శించాడు. ఇతడు నాటకకర్తనే కాదు. నటుడు, దర్శకుడు కూడా. ఇతనికి సంగీతంలో ప్రవేశం ఉంది.
పాటలు, పద్యాలకు రాగాలు తనే నిర్ణయించేవాడు. మోహన, జంఝాటి, కేదారగౌళ, కమాజు రాగాలంటే ధర్మవరం రామకృష్ణమాచార్యులకు ఇష్టం. రంగస్థలం మీద రాగయుక్తంగా పద్యాలను పాడే పద్దతి తెచ్చింది రామకృష్ణమాచార్యులు. ఇతడు దశరథ, బాహుళ, రాజరాజనరేంద్రుడు, చిరకారి, అజామిళ పాత్రలు నట్టించడం లో దిట్ట.
ఈయన చిత్రనళీయములో బాహుకుడు, విషాదసారంగధరములో రాజనరేంద్రుడు, పాదుకాపట్టాభిషేకములో దశరథుడు, అభిజ్ఞానమణిమంతములో దుష్టబుద్ధి, పాత్రలు వెసేవారు. దశరధ పాత్ర నటనలో కృష్ణమాచార్యులకు సాటి లేరు.ఆయనకు ఆయనే సాటి.
ఈయనకు చిత్రరంగం తో కూడా అనుబంధం ఉంది.
పూర్తి స్థాయిలో తొలి తెలుగు టాకీ చిత్రం 1931లో వచ్చిన సినిమా ‘భక్త ప్రహ్లాద’ . తొలి టాకీ సినిమా రాయలసీమ వారితోనే ఆరంభమైంది.
అప్పట్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన “భక్త ప్రహ్లాద” నాటకాన్ని సురభి నాటక సమాజం వారు వేస్తుండేవారు. ఆ నాటకసమాజంవారిని బొంబాయి పిలిపించి, వారితో చర్చించి, సినిమా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని బొంబాయిలోని కృష్ణామూవీటోన్ స్టూడియోలో తీశారు.
ఈయన గురించి కల్లూరి రాఘవేంద్ర రావు తెలుగు వెలుగు లో ఇలా పేర్కొన్నారు. పందొమ్మిదో శతాబ్దపు రాయలసీమ నాటకకర్తలైన ధర్మవరం రామకృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావులు దేశ చరిత్రలోని సంఘటనల ఆధారంగా కొన్ని నాటకాలు రచించారు. వాటిద్వారా ప్రేక్షకుల్లో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని కలిగించారు.
రామకృష్ణమాచార్యులు తన ‘చిత్రనళీయం’ నాటకం ద్వారా ‘ప్రజాబలం’ అజేయమని ప్రబోధించారు. ప్రజాబలంతో ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేసి వాళ్లని వెళ్లగొట్టాలనే సందేశాన్ని ఇందులో పరోక్షంగా వ్యక్తపరిచారు. నలచక్రవర్తిని మోసగించిన పుష్కరుణ్ని ప్రజాబలంతో బంధించి కారాగారంలో పడేసే విధంగా కథను మార్చి దేశభక్తిని చాటిచెప్పారు.
కోలాచలం శ్రీనివాసరావు తన చారిత్రాత్మక నాటకాలలో దేశభక్తి, త్యాగనిరతి, స్వామిభక్తికి ప్రాధాన్యమిచ్చారు. ఈయన ‘రామరాజు’ నాటకాన్ని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది కూడా! 1905లో బళ్లారిలో కోలాచలం నెలకొల్పిన ‘వాణీ విలాస నాటకశాల’కు ‘లోకమాన్య’ బాలగంగాధర తిలక్ ప్రారంభోత్సవం చేయడం ఓ మరపురాని సంఘటన.
ధర్మవరం గోపాలచార్యులు కూడా అన్నగారి మాదిరిగానే నాటకకర్త అయ్యారు. 1933లో ‘అస్పృశ్యతా విజయం’ అనే నాటకాన్ని రచించి ప్రదర్శించారు. అప్పట్లో ఇది గాంధీజీ హరిజనోద్ధరణకు మంచి ఊపునిచ్చింది. రామకృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావులు మరికొందరికీ ఆదర్శవంతులై, వాళ్లతో నాటకాలు రాయించారు. అలాంటి రచయితల్లో ముఖ్యులు రాప్తాటి సుబ్బదాసు.
ధర్మవరం రామకృష్ణమాచార్యులు సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత, బహుభాషా పండితుడు. ఇతడు “ఆంధ్ర నాటక పితామహుడు”గా ప్రసిద్ధిగాంచాడు.1891లో మద్రాసు లో సంస్కృత పండితుడు ఓపర్ట్ ఇతని నాటకాన్ని చూసి మెచ్చి రత్నఖచిత బంగారు పతకం బహూకరించాడు.
1910లో గద్వాల మహారాజు ఇతడిని ఆంధ్ర నాటక పితామహుడు అనే బిరుదుతో సత్కరించాడు. బళ్లారి పురప్రముఖులు ఇతడిని రత్నఖచిత కిరీటంతో సన్మానించారు.
ఇతనికి సంగీతంలో, ఆయుర్వేదంలో, నాడీశాస్త్రంలో,జ్యోతిశ్శాస్త్రంలో,చదరంగంలో ప్రావీణ్యం ఉంది. కవితాశక్తిని అలవరచుకుని అష్టావధానాలు, శతావధానాలు చేశాడు.
ఒంటిమిట్టలో వావిలికొలను సుబ్బారావుగారి ‘ఆంధ్ర వాల్మీకి రామాయణ ‘ కృతిసమర్పణోత్సవమునకు వీరు అధ్యక్షులు.అప్పుడు వీరి ‘పాదుకా పట్టాభిషేకము ప్రదర్శింపగా రూ. 1500 వచ్చినవి. అవి కోదండ రాముని కైంకర్యమునకే అందించారు.
వీరు రచించిన రచనలు
గాధినందను చరిత్రము (పద్యకావ్యము) ,ఉన్మాదరాహు ప్రేక్షణికము, మదనవిలాసము, చిత్రనళీయము,పాదుకా పట్టాభిషేకము,భక్త ప్రహ్లాద,
సావిత్రీ చిత్రాశ్వము,మోహినీ రుక్మాంగద,విషాదసారంగధర,
బృహన్నల, ప్రమీళార్జునీయము,
పాంచాలీస్వయంవరము, చిరకారి,ముక్తావళి,
రోషనారా శివాజీ,
వరూధినీ నాటకము,
అభిజ్ఞానమణిమంతము(చంద్రహాస),ఉషాపరిణయము,
సుశీలాజయపాలీయము,
అజామిళ,యుధిష్ఠిర యౌవరాజ్యము,సీతా స్వయంవరము,ఘోషయాత్ర,
రాజ్యాభిషేకము,సుగ్రీవ పట్టాభిషేకము,విభీషణ పట్టాభిషేకము,హరిశ్చంద్ర,
గిరిజాకళ్యాణము,
ఉదాస కళ్యాణము,
ఉపేంద్ర విజయ (కన్నడ),
స్వప్నానిరుద్ధ (కన్నడ),
హరిశ్చంద్ర (ఇంగ్లీష్),
ఆంధ్రనాటకములలోని యుత్తరరంగములు
ఈ రచనలలో మొదటిది మినహా మిగిలినవన్నీ నాటకరచనలే.
తెలుగులో తొలి స్వతంత్ర నాటకంగా చిత్రనళీయం నాటకాన్ని 1887 జనవరి 29న బళ్ళారి పట్టణంలో తొలిసారిగా ప్రదర్శించాడు.
అంటే ఈ నాటకాన్ని రాసినదెప్పుడైనా తొలి ప్రదర్శన నాటి నుండే చూసినా నేటికి సుమారు 133 యేళ్ళ కాలం నాటిదని తెలుస్తుంది.
ధర్మవరం రామకృష్ణమాచాత్యులు
“ఆంధ్రభాష నాటకమున కర్హమైనభాష” కాదనే ఆపోహను తొలగించడానికి నాటకరచనకు పూనుకొన్న మహనీయుడు
ధర్మవంవారు జాతీయవాది సంఘసంస్కరణాభిలాషి. తన కాలంలో విజృంభించిన జాతీయొద్యమాలకు, సంఘసంస్కరణోద్యమాలకు చలించి, సందర్బశుద్ధి ఉన్నా లేకపోయినా ఆయా ఉద్యమాల స్వరూపాలను తమ నాటకాలతో ప్రజల్లో చైతన్యం నింపారు.
తన మరణము నాటక ప్రదర్శన లోనో , న్యాయస్థానమునో జరగాలని కోరుకనే వారు. అలాగే జరిగింది.1912, నవంబర్ 30
కర్నూలు జిల్లా ఆలూరు లో న్యాయస్థానమునందు ఆకస్మికంగా కాలు జారిపడి ‘రామచంద్రా’ అంటూ మరణించారని చెబుతున్నారు. వీరి అంత్యక్రియలు బళ్ళారి లో జరిపారు.
