అమెరికా రచయిత ఆప్షన్ సింక్లెయిర్ సాహిత్యమంతా ప్రచారమేనన్నారు.అయితే ప్రచారమంతా సాహిత్యం కాదు. సాహిత్య సంఘాల పని సాహిత్యకారులను ప్రోత్సహించడమే కాదు ప్రజాసాహిత్యాన్ని అభివృద్ధి చేయటం కూడా.        సాహితీ స్రవంతి గత పదహైదు సంవత్స రాలుగా తెలుగు రాష్ట్రాలలో సాహితీ సృజన కారులను ప్రోత్సహిస్తూ సామాజిక చైతన్య సాహిత్యాన్ని ప్రోదిచేస్తూ ఉంది. అరసం, విరసంల తదనంతరం సాహిత్యోద్యమం కొనసాగించేందుకుదీక్షబూని ఉంది.“పాతది పనికిరాదు / సరికొత్త తరం కావాలి / సృజనకే జీవితానికే తేడాలేని/జీవితాన్ని సరికొత్త సృజించే తరం కావాలి’ అనంటాడు కె. శివారెడ్డి               జీవితం ఆధునికం అవుతోందని అను కోవడమేగానీ సమాజంలో ఆధునికత జాడలు కానరావడం లేదు. ముఖ్యంగా దళితులు,మహిళలు, పసిపిల్లల పట్ల గురజాడ ఎలాంటి దృక్పథాన్ని చూపించాడో అలాంటి ఆధునిక దృక్పథం ఇంకా సమాజం అందుకోలేదు. ఈ దృక్పథాన్ని నూతన తరం అందుకోవాలి. దీనికోసం వర్తమాన సాహిత్య కారులు కృషి చేయాల్సిన అవసరం ఉంది.       అనంతపురం జిల్లాలో సాహిత్య రంగంలోకి కొత్తదనం వస్తూనే ఉంది. ఈ సాహిత్యసాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించేందుకు సాహితీ స్రవంతి నిరంతరం జిల్లాలో శ్రమిస్తోంది. జనకవనాలు నిర్వహిస్తోంది. వర్తమాన సాహిత్యకారులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా సాహితీ స్రవంతి జిల్లాలోని కవులతో’అనంత కవితాస్వరాలు’ పేరుతో ఒక కవితా సంకలనాన్ని తీసుకువచ్చింది. ఈ సంకలనంలో చాలా మంది వర్తమాన కవులు ఉన్నారు. వీరంతా ప్రపంచీకరణ ప్రభావంతో ఉన్నవాళ్ళు, దాని తీవ్రతను గుర్తించినవారు.   అందువల్లనే వీరి కవిత్వం లో కరువు, మహిళల ఆక్రందనలు, అవినీతి, దళిత సామాజిక న్యాయం, లుప్తమౌతున్న మానవ సంబంధాలు, భాషా సంస్కృతులు మొదలైనవన్నీ కవితా వస్తువులయ్యాయి. ఈ అంశాలపై చర్చించుకుంటే ఈ సంకలనం గురించి కొంత అవగాహన ఏర్పడుతుంది.
మహిళావరణం:
‘స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుంది’ అన్న నానుడి ఉంది.కానీ నేడు పుట్టకముందే ఆడపిల్లలను హతమారుస్తున్నారు. ఆడపిల్ల  అనగానే ‘ఆడ’ పిల్లగా భావిస్తున్నారు. కొడుకైతే వరకట్నం వస్తుందనో, పున్నామనరకం నుండి తప్పిస్తాడనో, ఇలా ఆర్థిక సామాజిక మూఢ విశ్వాసాలవల్ల సమాజంలోఆడశిశువుల పట్ల చులకన భావం ఏర్పడింది.          గురజాడ కాలంలో కన్యాశుల్కం పేరుతో పుట్టబోయే అమ్మాయిలను అమ్మేసేవారు. నేడు అమ్మాయిలు కట్నం ఇచ్చి అబ్బాయిలను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి. రెండు సందర్భాలలో మహిళల పరిస్థితి అగమ్యగోచరం. అందుకే గురజాడ సమాజం ఆధునికం కావాలని కోరాడు. ఆధునికం అంటే మహిళలపై పీడన లేకుండా వారిని పురుషులతో పాటుగా సమానంగా చూడటం… ఎలాంటి లింగవివక్ష లేకుండా ఉండటం ఆధునికం. ఆధునికం అయిన రోజున మహిళ చరిత్రను పునర్లిఖిస్తుందని చెప్పాడు గురజాడ. లింగవవక్షతో జరిగే భ్రూణ హత్యలపై చాలా మంది కవులు స్పందించారు.            “ఆడపిల్ల భారమని భ్రూణ హత్యకు పాల్పడింది ఓ ఆడదని తెలసి/ సిగ్గుతో తలదించుకోవాలనుంది’ అని గుంటిమురళీ కృష్ణ రాయగా ‘పుట్టి పట్టుమని కొన్ని నిమిషాలకే ముళ్ళ పాన్పుకు విసిరేయబడింది’ అంటూ గండ్లూరి రాఘవేంద్రరావు ఆవేదన వెల్లిబుచ్చాడు తన కవితలో         భ్రూణ హత్యలకు పాల్పడేవిధంగా అమ్మను ప్రేరేపించిన శక్తి ఏది ? అమ్మతో అలా చేయించిన వారెవరు? మొదలైన వాటిని కవులు అధ్యయనంచేస్తే, కవితలు మరో రకంగా ఉండేవి. ధర్మపురి వెంకటేశులు మాత్రం ఒక కారణాన్ని గ్రహించి తన కవితలో ఇలా అంటాడు. ‘పుట్టబోయేది ఆడపిల్లని/ కాలయముడైన భర్త చెత్తకుండీపాలు చేస్తున్నా / ఎదిరించలేని అసహాయురాలు’ అంటూ పురుషాధిక్య సమాజాన్ని తప్పుపట్టాడు.        భ్రూణహత్యలు ఆపేందుకు తన ప్రయత్నంగా కవయిత్రి యుమునారాణి సమాజానికి ఒక సందేశాన్నిస్తోంది తన కవితలో ఇలా… ‘మీరు తుంచేసిన మొక్కే జాతి గర్వించే ఝాన్సీ కావచ్చురాజ్యాన్ని ఏలే రాణి రుద్రమదేవి కావచ్చుబ్రతుకు చిగురించకనే తుంచేసే చిగురుకు పట్టిన చీడ పురుగు మీరు కాకండి”         పెట్టుబడిదారీ విషసంస్కృతి స్త్రీలను వినియోగ వస్తువులుగానూ, వినియోగ వస్తువులుప్రకటనలకు ఆటబొమ్మలుగాను చూపిస్తూ విలువలకు వలువలు తీసేస్తోంది.ముదిగుబ్బ, మడకశిర, నల్లమాడ మొదలైన ప్రాంతాల నుంచి బెంగుళూరు, తిరుపతి, హైదరాబాదు, కేరళ ప్రాంతాలకు వలసలు వెళుతుంటారు. ఇదంతా రైతు తమ జీవన పోరాటంలో భాగంగా చేస్తున్నారు.       జిల్లాలో కరువు నిత్యం తాండవిస్తూ వుంటుంది. దేశంలో జై సల్మీర్ తరువాత అత్యధిక తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా ఇదే. ఎన్నో ఏళ్ళ నుంచికరువు రాజ్యమేలుతోంది. పదేళ్ళకొకసారి సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ కురుస్తుంది. పైగా ఎలాంటి జలవనరులు లేవు. నదులు పేరుకు మాత్రమే.బ్రతుకు జీవన ప్రమాణం కోసం, ఆకలి కేకల అవసరాల కోసం / కదలుతున్నారు కన్నీటి పర్యంతంతో’ అని కరువు కోరల్లోంచి బయటపడేందుకు రైతు చేస్తున్న ఆఖరి పోరాటాన్ని కవిత్వకరిస్తున్నాడు వర్ధమాన కవి ఆంజనేయులు.రైతులు వలస వెళ్లడానికి కారణం ఏదో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న తపనతో కాదు. కేవలం జీవనాధారం కోసం. జిల్లాలో గత పది పదైదు సంవత్సరాల క్రితం ఇలాంటి వలసలు అరుదు. ఇప్పుడు సహజమైనాయి. వలసల తరువాతఅత్యధికంగా జరిగింది రైతుల ఆత్మహత్యలు.              1991లో ప్రపంచీకరణ ప్రారంభమైనాక వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ముందు కొచ్చింది. వ్యవసాయ కార్మికులు,సన్నకారురైతులు, వ్యవసాయరంగం నుంచి మెల్లగా తొలగించబడ్డారు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల సరళీకరణ, సబ్సిడీల తొలగింపు, కార్పొరేట్ వ్యవసాయానికిప్రాధాన్యత మొదలైన ప్రభుత్వ విధానాలు రైతాంగం పై విపరీత ప్రభావం చూపాయి.అనంతపురం జిల్లాలో వేరుశెనగ ప్రధాన పంట. పామోలిన్ ఆయిల్ చౌకగా దొరకడంతో వేరుశెనగ అమ్మకపు రేటు పడిపోయింది. పంటలసాగు విస్తీర్ణం దెబ్బతిన్నది. చైనా నుంచి సిల్కు చౌకగా దిగుమతి కావడంతో మల్బరీ సాగు చతికిలబడింది. అంతేగాక చీడలు అధికమైనాయి. దానికితోడు ప్రకృతి నిరాదరణతోడయ్యి కరువు రాజ్యమేలింది. పాలకులు వ్యవసాయం మానేయమన్నారు. దాంతో రైతులు తమ పిల్లల చదువులకు, పెళ్లిళ్లలకు, ఆరోగ్యానికి అయ్యే ఖర్చులు పెరిగిపోవడంతో అప్పుల పాలయ్యాడు. దిక్కుతోచని రైతు ఈ నిర్లిప్త సమాజా నికి హెచ్చరికచేస్తూ ‘ఆత్మహత్య’ అనే పొలికేక వినిపించాడు. ‘రైతుల ఆత్మహత్యలన్ని సమాజం చేస్తున్న హత్యలే’ ఇక్కడ అ అంటే అమ్మకాదు | ఆ అంటే ఆవు కాదు / ఇక్కడ అ అంటేఅప్పు | ఆ అంటే ఆకలి కాదంటే ఆత్మహత్య ‘కవి పి.ఎల్. శ్రీనివాసరెడ్డి జిల్లాలో ఉన్న యధార్ధతత్వాన్ని ఆవిష్కరిస్తాడు. ఇదే సినిమా కవికయితే ఇలాంటివి అసలు పట్టవు. అ అంటే అమలాపురం అంటాడు. ఆ అంటే ఆహాపురం అంటాడు. జనాన్ని తమకంలో ముంచుతాడు.అందుకే సామాజిక జీవితం నుంచి సంఘర్షణ నుంచి వచ్చే కవిత్వం నిన్ను తట్టిలేపుతుంది. నను తొలిచే బాధలవులే నను మలిచే కవితా శిల్పమనిఅలిశెట్టి ప్రభాకర్ ఒక చోట అంటాడు.       రైతు దేశానికి వెన్నెముక. పల్లెలు దేశసంస్కృతికి ప్రతీకలు అని చెపుతుంటారు పాలకులు. జై కిసాన్ నినాదం కూడా ఇచ్చారు. పరిశ్రమలు ఆధునికదేవాలయాలన్నారు. కాని ఈ జిల్లాలో రైతును ఆదుకున్నదీ లేదు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించనూలేదు పాలకులు. జిల్లాలో చిత్రావతినది, పెన్నానది, కుముద్వతి నది. ఇలా ఎన్నో నదులు న్నాయి. ఇవి పేరుకు మాత్రమే నదులు. కనీసం ఒక్కటైనా పారేనది కాదు. అంతాఇసుక. విద్వాన్ విశ్వం తన పెన్నేటి పాట కావ్యంలో,ఇదే పెన్న ! ఇదే పెన్న ! విదారించనెదన్ | ‘నిదానించినడు వట్టిఎడారి తమ్ముడు’ అంటూ పెన్నానదిని వర్ణించింది అందుకే, నదుల తరువాత అంతో ఇంతో నీళ్లుండాల్సింది చెరువులు.కృష్ణదేవరాలయ కాలంలో నిర్మించిన చెరువులు తప్ప కొత్తవేమీ లేవు. అవి కూడా పూర్తిగా వట్టి పోయినవే. బుక్కపట్నం చెరువు, సింగనమల చెరువు, అనంతపురం చెరువు ఇలా కొన్ని పెద్ద చెరువులున్నాయి. నల్లచెరువు, ఓబులదేవరచెరువు లాంటి ఊర్ల పేర్లు కూడాచెరువులతో ఉన్నాయి. కానీ వాటిల్లో నీటి జాడకాన రాదు. అంతో ఇంతో వ్యవసాయానికి, పశువులకు ఉపయోగపడే విధంగా మరువపోని చెరువు, కన్నీరుఎలా పెడుతుందో రామకృష్ణ కవిత్వీకరించాడిలా.’నేనిప్పుడు / పాడుబడ్డ దేవాలయాన్ని / ఉరివేసుకున్న కోకిలమ్మను గర్భంలోనూ, సర్కారు తమ్మలో / నిలువెల్ల గాయాలతో‌రసికారోతున్న ముసలివగ్గును | వట్టిపోయిన చెరువు దృశ్యం మనకళ్ళెదుట సాక్షాత్కారమవుతుంది.‌నింగి విరిగి మీదపడుతున్నా మొక్కవోని ధైర్యంతో మొలకలా శిరసెత్తి నిలిచినవాడు, నాగలి యోధుడు. నేడు నాగలివిరిగి యోథుడు వొరిగిపోతున్నాడు.అలాంటి దైన్య స్థితిలో అర్జునునికి శ్రీకృష్ణుడు ధైర్యానిచ్చినట్లు డా॥ రేనాటి నాగేశ్వరరెడ్డి“ఆత్మనూన్యతను వదలి / ఆత్మహత్యల బాట విడిచి/ ఆత్మస్టైర్యం సమకూర్చుకో” అంటూ అప్పుల ఊబిల్లోనుంచి నిరాశ నిస్పృహల నుంచి బయటపడడానికి ధైర్యం తెచ్చుకోమని రైతులకు చెపుతున్నాడు.
చితికిపోతున్న చేతి వృత్తులు:
ప్రపంచీకరణ ప్రభావంతో యాంత్రీకరణ అన్ని రంగాల్లోకి ప్రవేశించింది. చేనేత రంగంలోకి మరమగ్గాలొచ్చాయి. ఫ్రిజ్ లు విపరీతంగారావడంతో కుమ్మరి పని చతికిలపడింది. బంగారుఆభరణాలన్ని యంత్రాలపై అందంగా మలిచేసరికి కమ్మరి పనులు మందగించాయి. ‘రెడీమేడ్’ బట్టలు రాకతో దర్జీ పనులు‌స్తంభించాయి. టి.వి.లరాకతో సంప్రదాయ కళలైన డప్పు, హరికథలు మొదలైనవి అదృశ్యమై నాయి.“ప్రకృతి ప్రకోపం / ప్రభుత్వాల అచేతనత్వం తో / కన్నీళ్లసాగు కలకాలం సాగించలేదని / తరతరాల వృత్తిని / కొత్తబతుకు తెరువు/ అన్వేషణలో వదిలేస్తున్నాడు’ అంటూ ఆకుల రఘురామయ్య వృత్తులు మాయమవుతున్న దృశ్యాన్ని పాలకుల నిర్లక్ష్యాన్ని అభివ్యక్తం చేస్తున్నాడు. జిల్లాలో అతిపెద్ద జీవనాధారం చేనేతరంగం. చేనేతలో ధర్మవరం ప్రసిద్ధి చెందిన ప్రాంతం. తరువాత హిందూపురం. ఉమ్మడి రాష్ట్రంలో వెంకటగిరి, గద్వాల్, సిరిసిల్లతోపాటు ధర్మవరం ప్రసిద్ధి చెందింది. కాని మరమగ్గాలు వచ్చాక నేతకార్మికుల వ్యథలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ‘పట్టుగూళ్ళ పచ్చదనాన్నిపరువాల పట్టుచీరగా / ఎన్నిదినాలు మగ్గం వేసినా / మారిపోని నేతన్నల జీవితాలు ఎన్నడు తీరును కడుపు మంటలు | ఎన్నడాగును చేనేత ఆత్మహత్యలు ? అంకె రామలింగమయ్య ఒక శేష ప్రశ్నను సంధిస్తాడు తన కవితలో.          సమాజంలో జరుగుతున్న భీభత్సాన్ని ఆవిష్కరించడమేనా కవి పని ?లేక పరిష్కార మార్గాన్ని సూచించాలా ? ఈ విషయంపై భిన్నా భిప్రాయాలున్నాయి.కవి పరిష్కారాన్ని సూచించడం, కవి ఆశావాహదృక్పథాన్ని సూచిస్తుంది. ఇక్కడకవి ఎవరివైపు నిలబడేది తెలుస్తుంది? ప్రజలవైపా ? ప్రభుత్వంవైపా ?‌అందుకే తిలక్ కవిత్వం అంతరాంతర జ్యోతి సీమల్ని బహిర్గతంచేయాలని ఆకాంక్షించాడు.
అవినీతిపై సమరం:
అవినీతిపై సమరం చేస్తానని, నల్లధనాన్ని గద్దెనెక్కిన మూడు నెలల్లో స్విస్ బ్యాంకుల నుంచి తెస్తానని వాగ్దానంచేసి, మాటమార్చిన మోడీ అవినీతిపరులను రక్షిస్తూ ప్రభుత్వాన్ని నడిపించడం ప్రజలను విస్మయపరుస్తోంది.అవినీతి వృక్షం ఎక్కిన మన్ మోహన్ ప్రభుత్వం ప్రజలచేతిలో మట్టికరిచింది. 2జి కుంభకోణం, బొగ్గు కుంభకోణం ఇలా ఎన్నో… ఎన్నెన్నో… మనరాష్ట్రంలో భూభకాసురుల రాజ్యమేలింది. అవినీతి అందమెక్కింది. ప్రజల ఆగ్రహానికి గురైంది.ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన ‘బాబు’ ప్రభుత్వం అవినీతికి సంకెళ్లు వేస్తానని చెప్పి అవినీతిపరులకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతోంది. నీతులు చెప్పి అవినీతికి పాల్పడడం రివాజయింది. అందుకే “ఇదేమి పరకాయ పరివర్తనమో / మేధశిఖండి రూపాన్ని తొడుక్కుని /అవినీతిని అస్త్రంగా మలుచుకొని ఆఫీసుల్లో కింద నల్లి లావెక్కి కూర్చొని / గుమ్మం లోకి అడుగుపెట్టిన అభాగ్యుని గుండె కవాటాన్ని కత్తిరించి రక్తాన్ని జుర్రుకుంటోంది‌అంటూ ఒక అవినీతి దృశ్యాన్ని మనకు ఆవిష్కరిస్తాడు కవి ఆవుల వెంకటేశులు.అవినీతికి మూలాలు ఆఫీసుల్లో కాదు.దానికి మూలం ప్రభుత్వంలోని మంత్రులవద్దే వుంది. అక్కడ ఆగితే కింది స్థాయిలో ఆగుతుంది. ఇది అంచెలంచెలవ్యవస్థ. కింది నుంచి పైదాకా పర్సెంటేజీల వ్యవహారం.
దళిత స్వరం:
స్వతంత్ర్య భారతావనికి మరో షష్టిపూర్తి జరిగినా / ఆకలి చిరునామా నేనే / ఆలన మరచిన అరవై ఏళ్ళ అమ్మఒడిలో / అంటరాని బిడ్డగా… ఇంకానా?అంటూ దళితుల ఆవేదనా పూర్వక ప్రశ్నను కవి కృష్ణమూర్తి సంధించాడు. నిజమే కదా ! అరవై ఏళ్లు నిండినా రిజర్వేషన్లు కల్పించామని చెప్పినాదళితుల దీనస్థితిలో మెరుగురాలేదు. ఎన్నో అభివృద్ధి పథకాలు, ఎన్నో 20 సూత్రాలపథకాలు చేపట్టినా వెలివాడలు మురికి కూపాలు గానే ఉన్నాయి. గాంధీ హరిజనులని పిలిచి సజీవ స్రవంతిలో కలిపేందుకు ప్రయత్నించాడు. కాని సమాజంలో మెరుగురాలేదు. రాజకీయ పార్టీలు వారిని తమ ఓటు బ్యాంకుగా భావిస్తున్నారేగానిఅభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం లేదు.దళితులకు ఇంకా చాలా దేవాలయాల్లో ప్రవేశం లేదు. అద్దెకు ఇళ్లు దొరకవు. వారికి భూముల్లేవు. ఇలాంటి పరిస్థితి సమాజంలో ఎందుకుంది ?హిందువులంతా సమానమని చెప్పే ఆర్ఎస్ఎస్, విహెచ్ పి లాంటి సంస్థలు వారిని ఇంకా అంటరానివారిగా ఎందుకు చూస్తున్నాయి ?’కసరిబుసకొట్టు నాల్గుపడగల హైందవ నాగరాజు’ అన్నది జాషువా ఇందువల్లనే ‘నా ముందు నీళ్ళు నిండిన గాజు గ్లాసులు పెట్టినపుడు  మోకాళ్ళపై వంగి నీళ్లు త్రాగిన ఎడారి దృశ్యాలు వేడిగా తగులుతాయి’అన్న కవి వాక్యం ఎంతో ఆలోచించదగినది.‌దళితుల్లో అభివృద్ధి చెందిన మేధావులు దళితుల గురించి ఆలోచించడంలేదు. ఎందుకని ? అందువల్లనేమో ‘మేధావి దళితుడా మేలుకో ! కళ్లు తెరిచి ఒక్కమారు నీవారిని చూసుకో’ అంటూ మన్నీల ముత్యాలప్ప దళిత మేధావులకు విన్నపం చేస్తున్నాడు తన కవిత ద్వారా.
విద్యారంగం:
‘పల్లెటూళ్లలో ప్రభుత్వగుళ్ళు / ఆదరణ లేక మూసిన బళ్ళుపిల్లలులేని చోట ఉపాధ్యాయులు /గురువు లున్నచోట రాని పిల్లలు పాఠశాల విద్యంటే పట్టని ప్రభుత్వం ‘ ఈ కవిత నేటి విద్యారంగం దుస్థితిని పాలకుల నిర్లక్ష్య వైఖరిని తేటతెల్లం చేస్తోంది.క్రమబద్ధీకరణ పేరుతో పాఠశాలలను మూసివేయడం ఒకవైపు, కార్పొరేట్ కళాశాలలను, పాఠశాలలను పెంచి పోషిస్తూ ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూఉంది ప్రభుత్వం. విద్యారంగం, ఆరోగ్యరంగం వంటి మౌలిక అంశాల్లోంచి‌ప్రభుత్వం మెల్లమెల్లగా తప్పుకుంటోంది.‌కృష్ణ ప్రసాదు తన కవితలో విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాడు. దీన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాతృభాషా మాధ్యమంగా ఉన్న పాఠశాలలు కనుమరుగైపోతాయి. తెలుగు భాషాసంస్కృతులకు పెనుముప్పు వాటిల్లుతుంది. ఇటీవల మునిసిపల్ పాఠశాలల్లోఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం ప్రమాదానికి పరాకాష్ట.
ప్రపంచీకరణపై:
‘యాంత్రీకరణ, కంప్యూటీకరణ / ప్రపంచీకర ణంటూ / సహజత్వాన్నిసమాధి చేస్తూ / ప్రకృతిని నికరంగా కృత్రిమం చేసేస్తోంది ‘ అంటూ సుదర్శన రాజు కృత్రిమత్వాన్ని ఈసడిస్తాడు.“ఈ పేపర్లతో మొదలైన జీవితం | టి.వి. సీరియళ్ళతో ముగుస్తుంది | ఒళ్లు బద్ధకించి | అజీర్తి రోగంతో సతమతమవుతుంది అని మధ్యతరగతిస్వప్నలోకాన్ని ఆవిష్కరిస్తాడు పోకూరి చంద్రశేఖర్,పర్యావరణ కాలుష్యం / ప్రకృతి విధ్వంసాన్ని తొడిగట్టి / మేధావులు శాస్త్రజ్ఞులు ఆలసించక | అవని రక్షణకు అంకితం కావాలి’ నని పిలుపు నిస్తున్నాడు జయరామిరెడ్డి తన కవితా గీతంలో.ప్రపంచీకరణ జీవితాల్లోకి ప్రవేశించాక మానవ సంబంధాలు దెబ్బతినడమేగాక, పర్యావరణ విధ్వంసం కూడా పెరిగిపోతోంది. కొండల్ని మెల్లగాకరిగించేస్తున్నారు. చెట్లను విచ్చలవిడిగా రోడ్ల వెడల్పు పేరుతో కొట్టేస్తున్నారు. ఈ జీవితం మనుషుల మధ్య సంబంధాలను తగ్గించి సెల్ ఫోనులో మునిగిపోయేటట్లు చేస్తోంది.సామాజికవేత్తలు, పర్యావరణ ఉద్యమకారులు, సాహిత్యోద్యమ కారులందరూ ప్రపంచీకరణను ప్రతిఘటిం చాల్సిన అవసరం నేడు ఎంతో ఉంది.
వర్తమాన భారతం:
‘భారతం కిష్కింద కాండగా మారిపోయింది కాదిది సుందరకాండయేనని ప్రభుత్వం భ్రమింపజేస్తోంది | అసలు సీతను దాచి, డూప్లికేటు స్వర్ణ సీతనుచూసి / మహాత్ముల “ఆశయమేధ’ యజ్ఞాన్ని నిర్వహించబోతూ ఉంది’ అంటూపాళ్యం వసుంధర తన కవితలో అమరవీరుల ఆశయాలను యజ్ఞంలో సమిధలుగా ఎలా చేస్తున్నారో తన కవిత ద్వారా తెలియజేస్తున్నారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేయడానికి మత ఛాందసవాదాన్ని ప్రోత్సహిస్తూ చరిత్రను వక్రీకరిస్తూపునరిభించాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. సైన్సు కాంగ్రెస్ లో అనేక పురాణాల కథలను సైన్సు విషయాలుగా ప్రచారం చేశారు. అందుకే ప్రగతిశీల ఆశయాలను, హేతువాద భావాలను యజ్ఞంలో నరమేధంలా అశ్వమేధంలా ఆశయమేధజరుపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది వసుంధర.ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రేక్షక పాత్రలో ఉండరు. సమాజ చలనానికి సంఘర్షణే మూలకారణం. అదే చోదకశక్తి, మార్పుకు కారణం. ‘ఎవరో ఒకరుఎపుడో అపుడు వేయరా ముందుకు / అటో, ఇటో, ఎటో వైపు” అని సినిమాకవి అన్నట్లుగా ‘ఎవరో ఒకరు వస్తారు | అంతకు ముందు వారిని స్ఫురింపజేసినా / మరపించినా మరోతరానికి చరిత్రగా, మిగిల్చిన దాఖలాలు కోకొల్లలు’ అనితోట నాగరాజు సమాజగమనానికి కృషిచేసిన వారు చరిత్రలో మైలురాళ్లుగా మిగిలిపోతారని అభివ్యక్తం చేశాడు తన కవితలో.         సామాజిక చైతన్యం పెంపొందించటంలో ఎందరో సాహిత్యకారుల పాత్ర ఉంది. అందుకే కవి, ప్రవక్తా ఎల్లప్పుడు కాలంకంటే ముందు ఉంటాడని గురజాడ ఏనాడో చెప్పినాడు. ఈ సమాజాన్ని నడిపించే రాజకీయ, ఆర్థిక, సామాజిక శక్తులేమిటి ? సమాజాన్ని పురోగమనం వైపు నడిపించేందుకు మనమేం చేయాలి? అన్న ప్రశ్నలకు కవి తన సమాధానాలను, సూచించి ఉంటే ఎంతో బాగుండేది. అందుకే త్రిపురనేని శ్రీనివాస్ ఇలా అంటాడు “ప్రజల మీదే రాయి / అలా ఒకవాక్యం చదవగానే / శత్రువు రారెత్తి పోవాలి / అమాయకుడు ఆయుధమై హోరెత్తాలి’ .         ఇలా అనంత చైతన్య స్వరం ‘అనంత కవితా స్వరాలు’ కవితా సంకలనంలో వినిపిస్తోంది. సాహితీ స్రవంతితో అనుసంధానమై ఎడారిలోఒయాసిస్సులా అనంతపురం జిల్లాలో కవితా స్రవంతి పరుగులు తీస్తోంది.

Written by Pillaa Kumaraswaamy 9490122229

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s