Padmanabham

పద్మనాభం
ప్రముఖ తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినీనిర్మాత, దర్శకుడు. ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు. ఈయన 1931లో ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా (ఇప్పటి వై యస్సార్ జిల్లా) పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించాడు. తల్లి శాంతమ్మ. తండ్రి బసవరాజు వెంకటశేషయ్య కడపజిల్లా వేంపల్లెకి సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవాడు.ఈయన తాత సుబ్బయ్య కూడా కరణమే. ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. మూడవయేటి నుంచి పద్యాలుపాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆ ఊరి టెంటు హాలులో “ద్రౌపదీ వస్త్రాపహరణం”, “వందేమాతరం”, “సుమంగళి”, శోభనావారి “భక్త ప్రహ్లాద” మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు, అనుకరిస్తుండేవాడు.
ఐదేళ్ళ వయసులో (1936లో) “చింతామణి” నాటకంలో కృష్ణుడివేషం వేసి వన్స్ మోరులతోబాటు ఒక వెండికప్పు బహుమతిగా పొందాడు. స్త్రీపాత్రలకు ప్రసిద్ధిపొందిన కొండపేట కమాల్ ఈ నాటకంలో చింతామణి కాగా పద్మనాభం తండ్రి శ్రీహరి పాత్రధారి.

తర్వాత చిన్నాన సుదర్శనంతో కలిసి ప్రొద్దుటూరులో వారాలు చేసుకుని, యాయవరం చేసుకుని చదువుకున్నా చదువు వంటబట్టలేదు. థియేటర్ మేనేజర్ ను మంచిచేసుకుని వచ్చిన సినిమాలన్నీ చూసేవాళ్ళు. అప్పుడే సైకిల్ తొక్కడం నేర్చుకున్న పద్మనాభం తమ్ముడితో కలిసి సైకిల్ కొనడానికి డబ్బు సంపాదించడానికి ఎవరికీ చెప్పకుండా రైల్లో టికెట్ లేకుండా ముందు బెంగుళూరు వెళ్ళి అక్కడేం చెయ్యాలో తోచక మద్రాసు వెళ్ళారు. అక్కడ నటి కన్నాంబ ఇంటికి వెళ్ళి ఆమెతో విషయం మొత్తం చెప్పేశారు. తమ గానకళతో ఆమెను మెప్పించి రాజరాజేశ్వరీ వారి కంపెనీలో కుదురుకున్నారు.

Pic source wikipedia

ఆ తర్వాత ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఇంకొకవైపు సి.ఎస్.ఆర్. లాంటివాళ్లతో కలిసి భక్త తుకారాం లాంటి నాటకాల్లో 50, 60 ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. ఋష్యేంద్రమణి వాళ్ళ ట్రూపులో పాదుకాపట్టాభిషేకం, సతీ సక్కుబాయి, హరిశ్చంద్ర, రంగూన్ రౌడీ, శ్రీకృష్ణలీలలు, మొదలైన నాటకాల్లో నటించాడు.
నటగాయకుడిగా సవరించు
వాళ్ళు తీసిన “పాదుకాపట్టాభిషేకం” సినిమాలో కోరస్ లో పాడే అవకాశం వచ్చింది. పద్మనాభం సినిమాల్లో చేరగానే తమ్ముడు ఇంటికి తిరిగివచ్చేశాడు. తర్వాత పద్మనాభం మాయలోకం సినిమాలో కోరస్ లో పాడడమేగాక ఒక పాత్ర కూడా వేశాడు. ఇది నటుడిగా ఆయన తొలి సినిమా. రెండవ సినిమా త్యాగయ్య. మూడవ సినిమా ముగ్గురు మరాఠీలు. ఇక ఆ తర్వాత నారద నారది, యోగి వేమన,…ఇలా అవకాశాలు వరసగా వచ్చాయి. రాధిక(1947)లో కృష్ణ పాత్ర వెయ్యడమే గాక ఒక గోపబాలునికి ప్లేబ్యాక్ పాడాడు. తర్వాత భక్త శిరియాళలో చిన్న చిరుతొండడి పాత్ర, వింధ్యరాణిలో ఇటు నటన-అటు గానం.

1948లో జెమిని వారి వీరకుమార్ చిత్రానికి ఒప్పుకుని కొంత అడ్వాన్స్ తీసుకున్నాడు. ఈలోగా యోగివేమన తీసిన కె.వి.రెడ్డి గుణసుందరి కథ తీస్తూండడంతో ఆయన్ను వాహినీ స్టుడియో లో కలవగా ఆయన పాట పాడించుకుని విని, గొంతు బాగాలేకపోయేసరికి చికాకు పడ్డాడు: “బాగా పాడేవాడివే! ఏమైంది? గొంతు ఇలా ఉంటే కప్పులు కడగడానికి కూడా పనికిరావు” అన్నాడు. దాంతో నిరాశపడ్డ పద్మనాభం సింహాద్రిపురం వెళ్ళిపోయాడు.

అప్పుడే తేలు కాటుతో తమ్ముడు ప్రభాకరం, జబ్బుచేసి చెల్లెలు రాజేశ్వరి మరణించడంతో విరక్తి కలిగి సినిమాలకు దూరంగా ఉన్నాడు. గుంతకల్ దగ్గరున్న కొనకొండ్లలో చిన్నాన్న శ్రీనివాసరావు దగ్గర కరణీకం నేర్చుకుంటూ ఉండగా వీరకుమార్ షూటింగుకు రమ్మని కబురు వచ్చింది. ఆ షూటింగు జరుగుతున్నరోజుల్లో విజయాసంస్థతో ఏర్పడిన పరిచయం ఆయన కెరీర్ ను మలుపుతిప్పింది.

షావుకారులో నౌకరు పోలయ్య వేషానికి ముందు బాలకృష్ణను అనుకున్నారు. ఐతే చక్రపాణి “వీడు ముదురుగా ఉన్నాడు. ఇంకెవరూ లేరా?” అని అడగడంతో దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ వెంటనే “రాధికలో కృష్ణుడిగా వేసిన పద్మనాభం ఉన్నాడు.” అని పిలిపించి వేషం ఇప్పించారు. పాతాళభైరవి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు కె.వి.రెడ్డి తోటరాముడిగా రాజారెడ్డి, మాంత్రికుడిగా ముక్కామల అనుకున్నాడు. షావుకారు రషెస్ చూసిన వెంటనే మనసు మార్చుకుని హీరోగా ఎన్.టి.ఆర్., మాంత్రికుడిగా ఎస్.వి.ఆర్., అంజిగా బాలకృష్ణ (పాతాళభైరవితో ఇతడి అసలు పేరు మరుగునపడిపోయి అంజి(గాడు)గానే ప్రసిద్ధి పొందాడు), సదాజపుడిగా పద్మనాభం లను ఖరారు చేసుకుని విజయావారి పర్మనెంటు ఆర్టిస్టులుగా మూడేళ్ళ అగ్రిమెంటు తీసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పాతాళభైరవితో బాటు విజయావారి తర్వాతి చిత్రాలైన పెళ్లిచేసిచూడు, చంద్రహారం లలో నటించాడు. అదే సమయంలో గుబ్బి ప్రొడక్షన్స్ శ్రీకాళహస్తి మహాత్మ్యం లో కాశి వేషం వేశాడు. 1954లో వచ్చిన సతి అనసూయతో మొదలుపెట్టి కృష్ణప్రేమ,సతీ సుకన్య, కృష్ణలీలలు, శ్రీరామకథ, సతీ తులసి, ప్రమీలార్జునీయం లలో నారదుడిగా వేశాడు.

నిర్మాతగా 1964 సంవత్సరంలో రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి దేవత, పొట్టి ప్లీడర్, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న నిర్మించారు. మర్యాద రామన్నతోనే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగా తొలిసారి పరిచయం చేశారు. 1968లో శ్రీరామకథ నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. 1970లో కథానాయిక మొల్ల తీసి బంగారు నంది అవార్డు పొందారు. పద్మనాభంగారు.
శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రాన్ని “రేఖ & మురళీ ఆర్ట్స్ ” బ్యానర్ పై పద్మనాభం నిర్మించారు.ఆ సినిమాలో పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, ఈలపాట రఘురామయ్య లతో కలిసి బాలసుబ్రమణ్యం ఈ పాటను పాడారు.1966 డిసెంబరు 15న మద్రాస్ లోని విజయాగార్దేన్ లో ఈ పాట రికార్డింగ్ జరిగింది.ఎస్.పి.కోదండపాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేశారు.

ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన బసవరాజు పద్మనాభం తన జ్ఞాపకాల దొంతరలను మా ముందు ఆవిష్కరించారు. ఆ జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే…
మా ఊరు సింహాద్రిపురం. కడప జిల్లాలోని పులివెందుల తాలూకాలో వున్న మా ఊరిలో 15వేల పైచిలుకు జనాభా ఉంటుందేమో! ఈ మధ్యే మా ఊరిని మండలంగా కూడా చేశారు. మానాన్నగారిది యర్రగుజిపాడు. మా అమ్మగారిది వీరన్నగట్టుపల్లె. వారి వివాహమైన తరువాత మా నాన్నగారికి సింహాద్రిపురం కరణంగా పని (ఉద్యోగం) రావడంతో వారు అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు. ఆక్కడే నేను పుట్టాను. మా ఊరి వాతావరణం, పరిసరాల విషయానికొస్తే అక్కడ అన్నీ కొండలు. కొండల కింద బావులుండేవి. ఒకసారి నేను మిత్రబృందంతో కలిసి ఈత కొట్టేందుకు ఊరికి సమీపంలో ఉన్న బావికి వెళ్ళాము. అప్పటికి నాకు ఈతరాదు. మునగబెండ్లు కట్టుకుని బావిలోకి దూకాను. అంతే ఒక్కసారిగా మునగబెండ్లు నా నడుము నుండి తెగిపోయాయి. అప్పటికి బావిలో ఎవరూ లేరు. నేను అరవడంతో నా వెంట వచ్చిన స్నేహితుడు ప్రభాకరరెడ్డి రక్షించాడు.
ఎర్రగుంట్ల స్టేషన్‌లో రైలు దిగి పక్కనే ఉన్న మరో రైలెక్కి టికెట్‌ లేకుండా మద్రాసు చేరుకున్నాం. రైలు దిగుతూనే గబగబా స్టేషన్‌ బయటకు వచ్చి ట్రాం ఎక్కి మౌంట్‌రోడ్డులోని వెల్లింగ్టన్‌ థియేటర్‌ (ఇప్పుడు లేదు) దగ్గర దిగి హాలు మేనేజర్‌ను పరిచయం చేసుకుని ఫ్రీగా ‘కృష్ణప్రేమ’ సినిమా సెకండ్‌ షో చూశాం. అప్పటికి మా దగ్గర ఆరు అణాలు మాత్రమున్నాయి. ఆ రాత్రి థియేటర్‌ సమీపంలో ఒక షాపు వరండాలో తల కింద సామానులు పెట్టుకుని పడుకున్న మమ్మల్ని తెల్లవారుజామున పోలీసులు వచ్చి నిద్ర లేపి ‘యారుడా నీంగా?’ (ఎవర్రా మీరు) అని అడిగారు. అంతే భయపడుతూ మేము కన్నాంబగారిని కలవడానికి వచ్చామని చెప్పాం. ‘ఇంగె పడుక్క కూడాదు, పోంగా’ (ఇక్కడ పడుకోకూడదు పోండి) అంటూ వెళ్ళిపోయారు. తరువాత జెమినీ స్టూడియోకు వెళ్లి అక్కడ కన్నాంబ గారి అడ్రసు తీసుకుని, టి.నగర్‌లోని మలాని వీధిలో ఉన్న వారి ఇంటి దగ్గరకు వెళ్లాం. అక్కడ వరండాలో కూర్చొని ఉండగా కన్నాంబ గారు వచ్చి మమ్ములను విచారించారు. మా మాటలను ఓపిగ్గా విన్న కన్నాంబగారు ‘భోంచేశారా బాబూ’ అని అడిగారు. ‘ఓ రోజైంది భోంచేసి’ అనగానే ఆకులు వేసి భోజనం పెట్టారు.

భోజనం అయిన తరువాత మా పాటలు విన్న కన్నాంబగారు కృష్ణారావు వీధిలో ఉన్న వారి సొంత నిర్మాణ సంస్థ రాజరాజేశ్వరి ఆఫీసుకు రమ్మనడంతో అక్కడకు పోయాము. పాదుకా పట్టాభిషేకంలో నటించిన తారలంతా అక్కడ ఉన్నారు. కన్నాంబగారి మాట మేరకు వారందరి ముందు పాటలు పాడాము. మా పాటలను వారంతా మెచ్చుకున్నారు. ఆ తరువాత కన్నాంబగారు మమ్ములను రాజరాజేశ్వరి కంపెనీలో ఆర్టిస్టులుగా చేర్చుకున్నారు.

60 వేల అప్పు – కోల్పోయిన సినిమా హక్కులు
నిర్మాతగా కొన్ని బాకీలు తీర్చాల్సి వచ్చింది ఒక ఫైనాన్షియర్ వద్ద అరవై వేల రూపాయలు రుణం తీసుకుంటూ అతడు పెట్టమన్నచోట సంతకాలు పెట్టేశారు. అనుకున్న సమయానికి అప్పు తీర్చలేకపోయారు. తరువాత తీర్చేశారు కాని అబద్దపు లెక్కలు చూపి రుణం తీరలేదని చెప్పి, సంతకాలు పెట్టిన పత్రాలు చూపి పద్మనాభం నిర్మించిన ఎనిమిది సినిమాల నెగెటివ్ హక్కులను అతడు స్వాధీనపరచుకున్నాడు కోర్టు ద్వారా. ఆ బాధ, బెంగతో కాశీ వెళ్లిపోయి కొంతకాలం తర్వాత తిరిగొచ్చారు. ఎవరినైనా నమ్మితే ఇలాగే బాధపడాల్సి వస్తోంది అని చెప్పారు .

1948లో కొంతకాలం గ్యాప్‌ రావడంతో మా ఊరు వెళ్ళాను. అప్పుడు అక్కడ టెంటు హాలులో నేను నటించిన సినిమాలు ఆడుతున్నాయి. మా ఇంట్లో వాళ్ళతో పాటు సినిమా చూసిన వాళ్ళందరూ నన్ను మెచ్చుకున్నారు. ఆ తరువాత జరిగిన కొన్ని ఘటనల కారణంగా సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నాను. అయితే సి.పుల్లయ్యగారి పిలుపుతో మళ్ళీ మద్రాసు రావాల్సి వచ్చింది. ఆ తరువాత కొద్ది రోజులకు ‘షావుకారు’ సినిమాలో వేషం కోసమని ఆర్కాటు మొదలియారు వీధిలో ఉన్న విజయా ఆఫీసుకు వెళ్ళాను. అక్కడ నాగిరెడ్డి, చక్రపాణి, రజనీకాంత్‌ మొదలైన వారు ఉన్నారు. నేను పాడిన పాటలు విన్న చక్రపాణి నన్ను నాగిరెడ్డి గారికి పరిచయం చేశారు. ‘మా ప్రాంతం వాడివా?’ అంటూ నాగిరెడ్డి ఆనందపడ్డారు. నాగిరెడ్డి ఊరు ఎద్దులయ్యగారిపల్లె. సింహాద్రిపురానికి కిలోమీటరు దూరంలో ఉంది.

నాగిరెడ్డిగారు నన్ను విజయా- వాహినీ సంస్థ ఆర్టిస్టుగా (జీతానికి) ఉండమన్నారు. తరువాత మూడు సంవత్సరాలు విజయా – వాహినీ సంస్థలో పర్మినెంట్‌ ఆర్టిస్టుగా పనిచేశాను. ఈ సమయంలో విజయా -వాహినీ స్టూడియో సమీపంలో కోడంబాక్కంలో నేను, కమెడియన్‌ బాలకృష్ణ ఒక రూము అద్దెకు తీసుకుని ఉండేవాళ్ళం. అప్పట్లో నాకు నెలకు 150 రూపాయల జీతం, సినిమాకు 500 రూపాయల బోనస్‌ ఇచ్చేవారు. తరువాత చాలారోజుల వరకు కోడంబాక్కంలోనే ఉన్నాను. ఆ రోజుల్లో కోడంబాక్కం స్టేషన్‌ నుండి ఎవిఎం స్టూడియోకు రావాలంటే గుర్రపుబండిలోనే రావాలి. అలా గుర్రపు బండిలో వెళుతూ హాయిగా నిద్రపోయేవాడిని.
1957 నా మకాంను టి.నగర్‌కు మార్చాను. అక్కడ అబ్దుల్‌ అజీజ్‌ వీధిలో నేను, కోదండపాణి కలిసి అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో షూటింగ్‌ లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు టి.నగర్‌ వీధుల్లో కలియ తిరిగేవాళ్లం.1958లో టి.నగర్‌లోని నాగార్జున నగర్‌లో స్థలం కొని స్వంత ఇల్లు కట్టుకున్నాను. అక్కడ నుండి పలు సినిమాల్లో వేషాలు వేసి ఆంధ్ర ప్రేక్షకులకు దగ్గరయ్యాను. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ఇంతకాలం నా సినీరంగంలో నా ప్రస్థానాన్ని కొనసాగించాను. ఇప్పుడు ఉంటున్న ఈ ఇల్లు 1958లో నేను నిర్మించుకున్నదే. ఇప్పటికీ అప్పుడప్పుడూ నా జన్మస్థలమైన సింహాద్రిపురానికి వెళ్ళి వస్తుంటాను.
డాక్టర్‌ అల్లు రామలింగయ్య కళాపీఠం ఏటా ప్రసిద్ధ హాస్యనటుడికి అందించే జాతీయ పురస్కారాన్ని 2009 సంవత్సరానికిగాను హాస్యనటుడు పద్మనాభానికి ప్రదానం చేశారు.
పద్మనాభం స్పందిస్తూ, ” నాకెంతో ఆప్తుడు అల్లు రామలింగయ్య పేరిట ఏర్పాటు చేసిన ఈ అవార్డును నాకు అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.తెలుగు ప్రజల హృదయాలో అల్లు రామలింగయ్య చిరస్థాయిగా ఉంటారు. సంగీతం, హాస్యం నాకు రెండు ప్రాణాలు. ఆ ప్రాణాలతోనే నేనిప్పుడు జీవిస్తున్నాను” అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని పాటలను పాడి వినిపించారు. నటి గీతాంజలి ఆయనతో గొంతు కలిపారు.
బీహార్లో తుపాను వచ్చినప్పుడు శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న కథ చిత్రం నుంచి వచ్చిన లాభాలతో అప్పట్లో 15 వేలు విరాళం ఇచ్చారు. దివిసీమ తుపాను వచ్చినప్పుడు ఆ సమయంలో పేరిగాడు రాజంట నాటక ప్రదర్శనల వలన వచ్చిన ఆదాయం అంతా బాధితులకు లాంతర్లు వగైరా కొనుగోలు చేయడానికి వెచ్చించి వారందరికీ అందే ఏర్పాటు చేశారు. తెలుగు సినిమా వజ్రోత్సవాలు జనవరి 2007లో జరిగినప్పుడు ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు వంటి పాటలు పాడి తన స్టామినా తగ్గలేదని నిరూపించుకున్నారు. కన్నాంబతల్లి పెట్టిన అన్నం, నాగయ్య చూపిన అభిమానం, గూడవల్లి రామబ్రహ్మం వాత్సల్యం, కె.వి.రెడ్డి ఆశీస్సులే రూపాయి లేకుండా మద్రాసు చేరిన తనను ఇంత వాడిని చేశాయని తరచు తలుచుకుంటూ సన్నిహితులకు చెబుతూ వుండేవారు
చెన్నై లో ఫిబ్రవరి 20, 2010 ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు.

✍️రచన:―చందమూరి నరసింహారెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s