
సొంఠి జయప్రకాష్ మడకశిరలో సొంఠి మెట్టు బండి రాయుడు,చిన్నామణి దంపతులకు 1. 5.1952 న జన్మించారు .వీరి ప్రాథమిక విద్యాభ్యాసం మడకశిర లోనూ, 6 నుండి 12 వ తరగతి వరకు అనంతపురంలోని ప్రభుత్వ మల్టీపర్పస్ స్కూల్లో లోనూ పూర్తయింది. డిగ్రీలో బీకాం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో, ఎం కామ్ చదువును అనంతపురం లోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ లో దూరవిద్య ద్వారా1996 లో పూర్తి చేశారు. 1977 లో గుంతకల్ సిండికేట్ బ్యాంక్ లో క్లర్కుగా చేరి అంచెలంచెలుగా పదోన్నతి పొంది మేనేజర్ గా అనంతపురంలో లో 2012లో పదవీ విరమణ పొందారు. ఉద్యోగంలో చేరక ముందే1976లో శారదతో వివాహమైన పిమ్మట వీరికి ఇద్దరు కుమారులు వంశీకృష్ణ, విజయకృష్ణ ఒక కుమార్తె ప్రత్యూష జన్మించారు. వీరందరూ ఉద్యోగాలు చేసుకుంటూ వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు.
6 నుండి 12 వ తరగతి చదువుతున్న సందర్భంలో అనంతపురంలోని కేశవ విద్యానికేతన్ హాస్టల్ లో ఉండేవాడు.అక్కడ ఆశావాది ప్రకాశరావు సీనియర్ సహచరుడు ఆయన చాలా రచనలు చేసేవాడు అప్పటికే ఆయన బాల కవిగా పేరు పొందాడు .ఆయన్ను ఆదర్శంగా తీసుకుని తాను మంచి రచయిత కావాలన్న ఆకాంక్షతో 1996లో ‘కాగిత పులి కథ’ ను రాశాడు. ఆ సందర్భంలో సింగమనేని నారాయణ ,శాంతినారాయణ ఆయనను వెన్ను తట్టి ప్రోత్సహించారు. తర్వాత 2010లో ఘజియాబాద్‌లో పనిచేస్తున్నప్పుడు నాబార్డు అధికారి శిశిర్ శర్మ తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన , జయప్రకాష్ చేస్తున్న సాహితీ వ్యాసంగాన్ని గమనించి , కొన్ని ఆంగ్ల కథాసాహిత్య పుస్తకాలను వారికి అందజేశారు. అందులో స్పెయిన్ నోబుల్ రచయిత నోబెల్ బహుమతి గ్రహీత గాబ్రియామార్క్వెజ్ రాసిన కథలు ఆయనకు బాగా నచ్చాయి వాటిల్లో తనకు నచ్చిన మంచి కథను తెలుగులోకి అనువదించి ‘పంజరం’ పేరుతో విపుల మాస పత్రిక కు పంపించారు. వారు దాన్ని స్వీకరించి ప్రచురించారు. ఆ తర్వాత వెనుతిరిగిచూడకుండా ఉత్సాహంగా జర్మనీ జపాన్ రష్యా తదితర భాషల కథలను తెలుగులోకి అనువదించారు.


వాటిని ‘ఒక రాత్రి అతిథి’పేరుతో ఒక సంకలనాన్ని తెలుగు పాఠక లోకానికి అందించారు. తాను రాసినఅనేక కథలను ‘పంచమ స్వరం’ పేరుతో మరో కథా సంపుటి ని ప్రచురించారు. ఈ కథల్లో మంచి శిల్పం తో పాటు సమాజంలో జరుగుతున్న అనేక మానవ సంబంధాల విశ్లేషణ కూడా ఉంది. ఈ కథా సంపుటి యువ రచయితలకు మంచి మార్గదర్శిగా ఉంటుందనడంలో సందేహం లేదు.’నల్ల పులి’ పేరుతో మరో అనువాద కథా సంపుటిని, ‘మహావృక్షం’ నవలను, ‘ఎవరు అపరాధి ‘నాటకాన్ని రాసి ప్రచురణకు సిద్ధం చేశారు.ప్రస్తుతం వస్తున్న కథలు నిర్మాణాత్మకంగా లేవని అవి పాఠకుల్ని పరివర్తన చెందే దిశగా కథలు రాయాలని ఆయన కోరాడు. రాస్తున్న యువతరం సామాజిక స్పృహతో అన్యాయాన్ని ఎత్తి చూపే విధంగా కథలు రాయాలని ఆయన భావిస్తున్నారు. బలహీన వర్గాల అభ్యున్నతికి చేసేవిధంగా కథలు రావాల్సిన అవసరం ఉందన్నారు. వాట్సాప్, ఫేస్బుక్ మొదలైన సోషల్ మీడియాలో చదివే దానికన్నా పుస్తకాలను కొని చదివితే మనసుకు హత్తుకుని పోతుందన్నారు. వాటిని పదికాలాలపాటు ఇంట్లో ఉంచుకొని మళ్లీ అవసరమైనప్పుడు చదువుకోవడానికి వీలుగా ఉంటాయని సోషల్ మీడియా వలన అలా వీలు పడదని ఆయన చెబుతారు. పదవి విరమణ తర్వాత ఒకవైపు రచనలు చేస్తూనే మరోవైపు సామాజికంగా ఇతరులకు సహాయం చేయాలన్న తపనతో జననీ మెమోరియల్ ట్రస్ట్ ను తన తల్లి పేరిట స్థాపించి ప్రతి సంవత్సరం ప్రతిభగల విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు .భవిష్యత్తులో సాహిత్యకారులకు పురస్కారాన్ని ఇచ్చి ప్రోత్సహించాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు.
