
మూలా నారాయణస్వామి ప్రముఖ సినిమా నిర్మాత. వీరు సినీ నిర్మాణ సంస్థ వాహినీ పిక్చర్స్ లో ప్రధాన భాగస్వామి. ఆసియాలో కెల్లా అతి పెద్దదైన వాహినీ స్టుడియో సముదాయాన్ని 1940 దశాబ్దంలో నిర్మించారు.
వీరి స్వస్థలం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి గ్రామం.
నారాయణ స్వామి కి నలుగురు కొడుకులు మూలా వెంకటరంగయ్య, మూలా శంభుప్రసాద్ ,మూలా సాయికృష్ణ, మూలా రాములు నలుగురు కూతుళ్లు.అలివేలు మంగమ్మ ,సరస్వతి ,సాయిలక్ష్మీ ,సాయి లీలా .
వీరి తండ్రి గారు కల్లు వ్యాపారాన్ని నిర్వహించేవారు. చిన్న తనంలోనే ధనవంతులై తర్వాత కాలంలో రాయలసీమ టెక్స్ టైల్స్, నూనె మిల్లులు, పాల సరఫరా కేంద్రాలు మొదలైనవి స్థాపించి వ్యాపారాలు విస్తరించారు.
తాడిపత్రి లో వాహినీ, అనంతపురంలో రఘువీరా సినిమా థియేటర్లు నిర్మించారు.
నారాయణస్వామి, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బొమ్మిరెడ్డి నాగిరెడ్డి తండ్రి) తో కలిసి ఉమ్మడి వ్యాపారం చేసి రంగూన్ (బర్మా రాజధాని)కి ఉల్లిపాయలు ఎగుమతి చేసేవారు. తర్వాత ఇద్దరూ హెచ్.ఎం.రెడ్డి గారి రోహిణీ పిక్చర్స్ లో భాగస్వాములుగా చేసి గృహలక్ష్మి వంటి కొన్ని సినిమాలు నిర్మించారు.
‘గృహలక్ష్మి’ షూటింగులో వేశ్యపాత్ర ధరించిన కాంచనమాల, హీరో ముక్తేవి రామానుజాచారి మధ్య అశ్లీలమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు బి.ఎన్.రెడ్డి అభ్యంతరం తెలిపి ఆ షూటింగును బహిష్కరించారు. అంతే కాకుండా రోహిణీ సంస్థలో తన వాటా తీసేసుకొని బయటకు వచ్చి, తన మిత్రులైన మూలా నారాయణ స్వామి మరికొందరితో కలిసి 1939లో వాహినీ సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు బి.ఎన్.రెడ్డితో బాటు మూలా నారాయణస్వామి, తమ్ముడు బి.నాగిరెడ్డి, దర్శకుడు కె.వి.రెడ్డి, బ్రిజ్ మోహన్ దాస్, సముద్రాల రాఘవాచార్య, చిత్తూరు నాగయ్య మూల స్తంభాలుగా నిలిచారు. కార్తికేయ స్టూడియో మూతపడడంతో ఆ స్టూడియో అధినేతలైన రామనాథ్, ఎ.కె. శేఖర్‌లను బి.ఎన్.రెడ్డి వాహినీ సంస్థలోకి ఆహ్వానించారు. ఇలియట్స్ బీచ్‌లో అందరూ కూర్చుని చక్కని సినిమాలు నిర్మిద్దామని ప్రమాణం చేశారు. సినిమా రచన భారాన్ని సముద్రాల, ముఖ్య పాత్రతోబాటు సంగీత నిర్వహణ బాధ్యతను నాగయ్య, ఛాయాగ్రహణ బాధ్యతను రామనాథ్, కళా దర్శకత్వం మరియు శబ్దగ్రాహణ బాధ్యతలను ఎ.కె.శేఖర్ స్వీకరిస్తూ తొలిచిత్రం ‘వందేమాతరం’(1939) నిర్మాణానికి పూనుకున్నారు. బ్రిజ్ మోహన్ దాస్ కంపెనీ సెక్రెటరీగా, కె.వి.రెడ్డి ప్రొడక్షన్ మేనేజర్‌గా వ్యవహరించారు. నాగయ్య హీరోగా, కాంచనమాల హీరోయిన్గా బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ‘వందేమాతరం’ సినిమా తయారైంది.

స్వాతంత్య్ర సముపార్జన కోసం ఉద్యమాలు జరుగుతుండడంతో బి.ఎన్.రెడ్డి ముందు చూపుతో ఈ చిత్రానికి ‘మంగళసూత్రం’ అనే ట్యాగ్‌లైను జతచేశారు. ఇందులో నిరుద్యోగ, వరకట్న సమస్యలను ప్రస్తావించడం జరిగింది. వాహినీ సంస్థకు మొదటి సినిమాతోనే మంచిపేరు వచ్చింది. ఈ సినిమా పొరుగు రాష్ట్రాలలో కూడా బాగా ఆడి శతదినోత్సవం చేసుకుంది.
ఈ సంస్థ ద్వారా వందేమాతరం, సుమంగళి, దేవత స్వర్గసీమ వంటి మంచి సినిమాలు నిర్మించారు. స్వర్గసీమ నిర్మాణం సమయంలో మద్రాసు న్యూటోన్ స్టుడియోలో వారు ఎన్నో ఇబ్బందులు పడవలసి వచ్చి స్వంతంగా స్టుడియో నిర్మాణం చేపట్టారు.
రెండవ ప్రపంచ యుద్ధం మూలంగా దేశంలో పరిస్థితులు తారుమారై మద్రాసులో ముడిఫిలిం కొరత వలన ఏ సినిమా కూడా 11వేల అడుగుల నిడివి దాటరాదనే నియమం ప్రవేశపెట్టడంతో చిత్రనిర్మాణం కుంటుపడింది. అదే సమయంలో రామనాథ్, శేఖర్లు జెమినీ చిత్రనిర్మాణ సంస్థకు వెళ్ళిపోయారు. ‘భక్తపోతన’ చిత్రానికి కంపెనీలో పెట్టుబడికంటే దాదాపు పాతికవేలు అధికంగా ఖర్చు కావడంతో వాహినీ పిక్చర్స్ సంస్థను పంపిణీ వ్యవహారాలకు పరిమితంచేసి, మూలా నారాయణ స్వామి సహకారంతో రెండు లక్షల మూలధనంతో వాహినీ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించారు. నూతన బ్యానర్ మీద బి.ఎన్.రెడ్డి 1945లో ‘స్వర్గసీమ’ చిత్రాన్ని పదివేల ఆరువందల అడుగుల నిడివితోనే నిర్మించారు. ఈ చిత్రానికి జార్జ్ బెర్నార్డ్ షా నాటకం ‘ది పిగ్మాలియన్’ ఆధారం. ‘స్వర్గసీమ’ చిత్రం విజయవంతంగా ఆడి తొలిసారి భారతదేశపు ఎల్లలు దాటి వియత్నాం ఫిలిం ఉత్సవంలో పాల్గొన్న తొలి తెలుగు సినిమాగా గుర్తింపు పొందింది
వాహినీ ప్రొడక్షన్స్ ప్రఖ్యాతిచెందిన సినీ నిర్మాణ సంస్థ. ఈ సంస్థ
నిర్మించిన సినిమాలు
వందేమాతరం (1939)
సుమంగళి (1940)
దేవత (1941)
భక్త పోతన (1942)
స్వర్గసీమ (1945)
యోగి వేమన (1947)
గుణసుందరి కథ (1949)
మల్లీశ్వరి (1951)
పెద్ద మనుషులు (1954)
బంగారుపాప (1954)
రాజమకుటం (1959)
రంగుల రాట్నం (1966)
బంగారు పంజరం (1968)
కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యోగివేమన’ (1947) తరువాత బి.ఎన్.రెడ్డి వంతు వచ్చినా స్టూడియో నిర్మాణంలో తలమునకలై ఉన్నందున 1949లో ఈ నూతన స్టూడియోలోనే కె.వి.రెడ్డి దర్శకత్వంలో ‘గుణసుందరి కథ’ చిత్రనిర్మాణం జరిగింది. ఈ సినిమా ఎంత జనాదరణ పొందిందో సినీ అభిమానులకు తెలుసు. ఆ సమయంలోనే వాహినీ సంస్థలో ప్రధాన పెట్టుబడిదారు మూలా నారాయణస్వామి వ్యాపారంలో దెబ్బతిని, ఆదాయపన్ను వర్గాల నుంచి చిక్కుల్లో ఇరుక్కోవడం, దానితో ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో వాహినీ స్టూడియో అమ్మవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిని అధిగమించేందుకు స్టూడియోని విజయా సంస్థకు గుత్తకు ఇవ్వాల్సిన అగత్యమేర్పడింది.
1961లో నారాయణ స్వామి కొడుకు మూలా వెంకటరంగయ్య తన తండ్రికి మిత్రుడైన దామోదరం సంజీవయ్య సహాయం తో ఆదాయపన్ను శాఖ కేసులను పరిష్కరించుకొని బి.నాగిరెడ్డి కి విజయప్రొడక్షన్స్ ను అమ్మివేశారు .

బి.నాగిరెడ్డి దాని పేరును విజయవాహిని స్టూడియో గా మార్చుకొన్నారు.
1950 ఆగస్టు 20 వ తేదీన తాడిపత్రి లో మూలా నారాయణ స్వామి మరణించారు. ఆయన మరణించే నాటికి ఆయన వయస్సు 38 సంవత్సరాలు. పిల్లలు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఈయన చనిపోయారు. వీరి పెద్ద కుమారుడు వెంకటరంగయ్య వయస్సు 11సంవత్సరాలు. అనంతరం వెంకట రంగయ్య కూడా సినీ నిర్మాత పనిచేశారు.వెంకటరంగయ్య కదిరిలో ఓరుగంటి బసయ్య గారి చెల్లెలు సుగుణమ్మ ను వివాహం చేసుకొన్నారు.మూలా నారాయణ స్వామి మనువడు మూలావిజయభాస్కర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది గా పనిచేశారు. అనంతపురం జిల్లా కదిరి సి.ఆర్ .సి సభ్యులు.
