tumaati donappa

ఆయన మన విజ్ఞాన గని. తెలుగు ,ఇంగ్లీష్ కన్నడ , సంస్కృత భాషలో మంచి పట్టుంది .పువు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు ఈయన చిన్న వయసులోనే కవితలు ,పద్యాలు రాసి వినిపించేవారు.

గ్రామీణ జీవన విధానం పై ,జానపదుల పై ఈయన విస్తృతమైన పరిశోధనలు జరిపారు .మంచి రంగస్థల నటుడు .ఉత్తమ అధ్యాపకులు.., ఆదర్శ పరిశోధకులు…., ప్రసిద్ధ భాషావేత్త…., పరిపాలనా దక్షులు…, జానపద సాహిత్య సంగ్రాహకుడు….
తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి పేరొందిన ఆచార్య తూమాటి దొణప్ప

దొణప్ప అనంతపురం జిల్లా రాకెట్లలో 1926, జూలై 1న జన్మించాడు. ఇతడి మొదటి పేరు దొణతిమ్మారాయ చౌదరి.
తండ్రి సంజీవప్ప, తల్లి తిమ్మక్క . తిమ్మరాయస్వామి వేంకటేశ్వరునికి స్థానిక నామధేయం . ఆపేరే వీరికి పెట్టారు.

చిన్ననాటి విద్యాభ్యాసం సార్లాపురంలోని వారి పినతాత తూమాటి భీమప్ప వద్ద జరిగింది. భీమప్ప సంస్కృతాంధ్రములందు మహా విద్వాం సులు. ఆయన వద్ద అమరం, శబ్దాలు, మేఘ దేశం, రకు రంగం, మున్నగు కావ్యాలను దొణప్ప పదేండ్ల పాటు చదివారు. ఆ విద్య కూడా ఆయన వెంటే వుంటూ ఆయన చెప్పిన పొలం పనులు చేస్తూ. “పనికి వని, పాతానికి పాఠం” అన్నట్లుగా ఆడుతూ, పాడుతూ నేర్చుకొన్నారు. ఇలా ఆయన యోగా శిష్టం.

వివేకచూడామణి, భాగవతం, మున్నగు సంస్కృతాంధ్ర గ్రంథాలన్నీ ఆయన వద్దనే నేర్చుకొన్నారు. సాయంకాలం ఊరి రచ్చబండ మీదో, ఇంటి అరుగుమీద కూర్చుని భీమప్పగారు భారత, భాగవత, రామాయణాలను ప్రవచనం చేసేవారు. వాటిని శ్రద్ధగా వినడం, ఒకొక్కసారి తాను కూడా ప్రవచనం చేయడం, అర్థం చెప్పడం అలవాటు చేసుకొన్నారు దొణప్ప ఇలా చిన్నతనంలోనే పురాణాల పై అతనికి మక్కువ జనించింది

ఈ విద్యలో పడిన దొణప్పకు’ పదేండ్ల వరకు ఎ. బి ,సి. డి లు కూడా రాలేదు తరువాత ఆయన వజ్రకరూరు లోని
మేనత్త భర్త చిన్న బొబ్బూరితిమ్మప్ప. వజ్రకరూరులో పెద్ద ఆసామి. వజ్రకరూరు తీసుకువెళ్ళి స్కూల్లో చేర్పించారు. వారి
ఇంట్లో ఉంటూ ఆంగ్లం నేర్చుకున్నారని కల్లూరి అహోబలరావు తన రాయలసీమ రచయితల చరిత్ర 4 భాగంలో పేర్కొన్నారు.

వజ్రకరూరులోని హయ్యర్ ఎలిమెంటరీ స్కూలులో ఎనిమిదవ తరగతి వరకు చదివాడు 1942-46 సం. ల మధ్య కాలంలో ఉరవకొండలో కరిబసవ స్వామి జిల్లా బోర్డు ఉన్నతపాఠశాలలో చదివాడు.
ఈ సమయంలో నూతలపాటి పేరరాజు అనే తెలుగు పండితులు వీరికి గురువు.

శ్రీ నూతలపాటి పేర రాజు ఒకసారి విహారయాత్ర కు పిలుచుకొని వెళ్లారు. విద్యార్థులను సాహిత్యంలో బాగుగా ప్రోత్సహించేవారు. అప్పుడప్పుడు వారి మధ్య కవిత పోటీలు నిర్వహించేవారు. ఆ విహారయాత్రలో వారు విద్యార్థులను సాయం సంధ్య గూర్చి వర్ణించమన్నారు.
దోణప్ప ఆసువు గా ఇలా చెప్పారు.

సాంధ్యలలనా లలామంబు సంతసమున కట్టుకొన్నట్టి హొంబట్టు పుట్టమనగ
సంకె కెంజాయ లెల్లే .ఇలా ఆసువుగా చెప్పుకొంటూపోయాడు. ఆయన ఆశ్చర్యానికి అంతులేదు మరోసారి “పారిజాతాపహరణ” కావ్యంగూర్చి ఆశువుగా చెప్ప మన్నారు. అప్పుడు

“పలుకు పలుకున తేవియ లొలుకునట్లు అరణపుంగది ముక్కు తిమ్మన్న గారు పారిజాతాపహరణము పాడి నట్టి
కూరుచున్నారు ముత్యాల గొడుగు నీడ… అనిదోణప్ప గర్జించాడు ఆ పండితుల ఆనందానికి అవధులు లేవు. ఇలా చిన్నప్పుడు ఆశువుగా కవిత్వం చెప్పారనడానికి సాక్ష్యం.

1948లో అనంతపురంలోని దత్తమండల కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరాడు. అక్కడ శంఖవరం రాఘవాచార్యులు, కారెంపూడి రాజమన్నారు, మిక్కిలినేని వేంకటేశ్వరరావు, చిలుకూరి నారాయణరావు మొదలైనవారు ఇతని గురువులు.

1949-52సం.ల మధ్య ఆంధ్రవిశ్వవిద్యాలయంలో బి.ఎ. ఆనర్స్ చదివాడు. అక్కడ గంటి జోగి సోమయాజి, దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, కాకర్ల వెంకటరామ నరసింహం, భద్రిరాజు కృష్ణమూర్తి, ఓరుగంటి రామచంద్రయ్య, మధుసూదన షడంగి, వజ్ఝల చినసీతారామస్వామి మొదలైన హేమాహేమీలు ఇతని గురువులుగా ఉండేవారు.

1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ.ఆనర్సులో బంగారు పతకాన్ని సాధించాడు. గంటి జోగి సోమయాజివద్ద పరిశోధక విద్యార్థిగా చేరి “తెలుగులో వైకృతపదాలు” అనే అంశంపై పరిశోధించి 1966లో పి.హెచ్.డి సంపాదించాడు.

వజ్రకరూరులో ఉన్నప్పుడే నాటకాలు వేయడం మొదలుపెట్టారు. పద్నాలుగేళ్ళ వయస్సులోనే ముఖానికి రంగువేసుకున్నారు.
ప్రధానోపాధ్యాయుల ఆజ్జమేరకు “చింతామణి” నాటకంలో మొట్టమొదటిగా ‘చిత్ర’ పాత్ర ధరించి ప్రశంశలు పొందారు.

చిన్ననాడే మోహినీ రుక్మాంగదలో రుక్మాంగదుడు కృష్ణతులాభారంలో శ్రీకృష్ణుడు, సాయిలీలలో సాయిబాబా పాత్రలను నిర్వహించి మెప్పుపొందారు.

విద్యార్థి దశలోనే ఎనిమిదోతరగతి చదువుతున్నప్పుడే “చిత్రగుప్త” పత్రికలో మొట్టమొదటి రచన “చంద్రుడు – కలువ” అనే కధ అచ్చయింది. ‘సూర్యప్రభ’ అనే పత్రికలో రాధాగోపాలుల తత్వంపై ‘అన్వేషణ’ అనే గేయం రాశారు.

అనంతపురం దత్త కళాశాల విద్యార్ధిగా “బైబిలు, కురాను, భగవద్గీత” పరీక్షలో ప్రధమ స్థానం లభించి, మీనాక్షిసుందరాంబా స్మారక
బహుమానం పొందారు
ఆదర్శ శిఖరాలు(ఏకాంకిక), చంద్రుడు – కలువ (కధ), అన్వేషణ (గేయం),రచించారు.

ఆచార్య తూమాటి దోణప్ప “ఆంధ్రుల అసలు కథ”, “బాలల శబ్ద రత్నాకరం”, “తెలుగు మాండలిక శబ్దకోశం”, “భాషా చారిత్రక వ్యాసావళి”, “తెలుగులో కొత్త వెలుగులు”, “జానపద కళా సంపద”, తెలుగు హరికధా సర్వస్వం” ,
వైకృతపదస్వరూప నిరూపణం( సిద్ధాంత గ్రంధం),
ఆంధ్ర సంస్థానాలు – సాహిత్య పోషణ, ఆకాశభరిత(రేడియో ప్రసంగ వ్యాస సంపుటి) మున్నగు పలు రచనలు చేశాడు.

1989లో “ఆంధ్ర సంస్థానములు-సాహిత్య సేవ” అను పరిశోధనా గ్రంథాన్ని ప్రచురించారు. ఇది సాహిత్య అకాడమీ అవార్డు అందుకొన్నది.

విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రాలనుంచి – వివిధాంశాల పై దొణప్ప ప్రసంగాల తొలి సంపుటి ‘తెలుగులో కొత్త వెలుగులు’ పేరు 1972 డిసెంబర్ లో గ్రంథరూపాన వెలుగును చూచింది అందులో ఇరవై ప్రసంగాలు చోటు చేసుకున్నాయి.

దోణప్ప తను రచించిన
భాషా చారిత్రకవ్యాసావళి పుస్తకం దేవులపల్లి రామానుజరావు కు అంకితం చేశారు.

ద్వా. నా. శాస్త్రి దొణప్ప జీవితం, సాహిత్యంపై పుస్తకం రాశారు. ద్వానా శాస్త్రి ఆచార్య తూమాటి దొణప్ప గారి ప్రియ శిష్యుడు. దొణప్పగారి వంటి విజ్ఞాన ఖని వద్ద శిష్యరికం చేసే అవకాశం దొరికినందుకు తన అదృష్టాన్ని ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఉంటారు. దొణప్ప గారి వద్ద తన విద్య పూర్తి తీర్చుకున్నాను అని విద్యార్థి జీవితాన్ని సఫలం చేసుకున్నాను అని ఓ సందర్భంలో చెప్పారు.

తూమాటి దోణప్ప కొడుకు
తూమాటి సుధాకర్ రాసిన వ్యాసం లో తన తండ్రి గురించి ఇలా తెలిపారు.
జానపద సాహిత్యమన్నా, మాండలికాలన్నా మానాన్నగారికి మరీ ఇష్టం. వీటికి సంబంధించి చాలా సమాచారం సేకరించారు. ఊరూరూ ఎంతో కష్టపడ్డారు.

మానాన్నగారు ఆనర్సులో “ద్రవిడియన్ ఫిలాసఫీ అండ్ జనరల్ లింగిస్టిక్స్” ను ప్రత్యేక అంశంగా అభ్యసించారు. సాహిత్యం బాగా చదివినవారికి భాషాశాస్త్రం సరిపడేది కాదని విన్నాను.

కానీ మానాన్నగారు రెండిటిలోనూ నిపుణులే. భాషాశాస్త్రం చెప్తే మా నాన్నగారె చెప్పాలని వారి శిష్యులు చెప్తూవుంటారు. మా నాన్నగారు ఆంధ్రవిశ్వవిద్యాలయ తెలుగు శాఖలో పనిచేస్తున్నప్పుడు భాషాశాస్త్రం భోధించేవారు. తమ క్లాసుకి ముందు రెండు మూడు నిముషాలు క్లాసు గుమ్మంముందు నుంచుని ఉండేవారట.అంతకు ముందు మేష్టారు వెళ్ళగానే వెంటనే క్లాసులోకి వెళ్ళేవారట! యూనివర్సిటిలో కూడా ఇంతగా ఉంటారా! అని విద్యార్ధులు ఆశ్చర్యపోయేవారని ద్వా,నా.శాస్త్రిగారు చెప్పారు.

అనకాపల్లి కళాశాల వారూ, గుడివాడ కళాశాల వారూఉద్యోగాలు ఇస్తామన్నా మా నాన్నగారు వెళ్ళలేదు. ఆచార్య గంటిజోగి సోమయాజిగారి వద్ద పరిశోధక విద్యార్ధిగా చేరారు. పూనా దక్కను కళాశాలలో భాషాశాస్త్రం ప్రత్యేక శిక్షణ తరగతులకు హాజరయ్యారు.

సునీత్ కుమార్ చటర్జీ, సుకుమారసేన్ వంటివారి ఉపన్యాసాలు విని ఉత్తేజంపొందారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం చేపట్టిన “తెలుగు వ్యుత్పత్తి పదకోశం” ప్రారంభంలో మా నాన్నగారు ముఖ్యసహాయకులుగా పనిచేశారు. ఆ తర్వాత వచ్చినవారు మా నాన్నగారి పేరును స్మరించలేదు! ఇలా వుంటుంది లోకం!

అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేసి. ఎన్.టి.రామారావుగారు ముఖ్యమంత్రిగా పదవీచ్యుతులు కాగా నైతిక విలువలను పాటిస్తూ తమ పదవికి రాజీనామా చేశారు.
నేను నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎం.కాం చదువుతున్నప్పుడు మా నాన్నగారు ప్రిన్సిపల్ గా, రిజిస్ట్రార్ గా పనిచేశారు. ఒకరిద్దరికి తప్ప నేను దొణప్పగారి అబ్బాయినని ఎవరికీ తెలీదు. ఫలానావారి అబ్బాయిగా నేనెందుకు ‘ఫోకస్’ అవ్వాలి అని నాకు ఉండేది. మా నాన్నగారి అభిప్రాయమూ అదే.

మా నాన్నగారు పెద్దగా సంపాదించింది ఏమీ లేదు. పైగా బంధువులకు చాలా సహాయపడేవారు. మా పెదనాన్నగారి అబ్బాయిని మా ఇంట్లోనే వుంచి చదివించారు. మేనమామగారిని చదివించారు. బీద విద్యార్ధులకు సాయం చేసేవారు. చెల్లెళ్ళ పెళ్ళిఖర్చులకోసం ఇల్లు అమ్మేశారు. తన పుస్తకాల అమ్మకాలద్వారా పాతిక వేలు వచ్చింది. మానాన్నగారి చిన్ననాటి మిత్రుడు బలరామరాజుగారు వడ్డీలేకుండా అప్పు ఇచ్చారు.

1978 ప్రాంతంలో వారికి వచ్చిన పెన్షన్ డబ్బు, ఎల్.ఐ.సి లోన్, నావద్ద కొంత తీసుకొని హైదరాబాద్ లో ఫ్లాట్ కొన్నారు. నేను ఫారిన్ ట్రేడ్ లో డిప్లొమా చదవడానికి ఢిల్లీ వెళ్తానంటే నెలకి వెయ్యిరూపాయలకంటే ఎక్కువ ఇవ్వలేనన్నారు. అలాగే సర్దుకు పోయాను. ఆయన డబ్బు బాగా సంపాదిస్తే మేమింత కష్టపడేవాళ్ళం కాదు.
మా నాన్నగారు చాలా నిక్కచ్చి మనిషి.

యూనివర్సిటి గొడవలుగాని, డిపార్టుమెంటు గొడవలుగాని ఇంట్లో ఎప్పుడూ ప్రస్తావించేవారుకాదు. చాలా గుంభనంగా ఉండేవారు. లోలోపల బాధపడేవారనుకుంటాను. చాలా నిరాడంబరంగా ఉండేవారు. చాలామంది శిష్యుల్ని సంపాదించారుగానీ, మిత్రుల్ని ఎక్కువగా పొందలేక పోయారనిపిస్తుంది.

సాహిత్య రచనలు ఎక్కువగా యూనివర్సిటి క్యాంపస్ లోనే చేసేవారు. మేం పడుకునే సమయానికి ఇంటికి వచ్చేవారు. తెల్లవారుజామున 5 గంటలకు లేచి చదువుకొనేవారు, రాసుకొనేవారు. మా నాన్నగారి సాహిత్య ప్రభావం మా మీదలేదు. ఆయన రాసినవాటిలో కొన్నిటిని చదవడం తప్ప నీట్ గా డ్రస్ చేసుకోవటం, ఇన్ షర్టు, బూటు, టై తోనే నేర్చుకున్నాను.

“నీకోసం నేనేమీ ఆర్ధికంగా చెయ్యలేకపోయాను” అనేవారు. “మీరు తండ్రిగా చెప్పుకోవడమే నాకు గర్వకారణం” అనేవాడ్ని. నాన్నగారి శిష్యులెందరో ఆచార్య పదవుల్లో వున్నారు. సాహిత్యరంగంలో పేరు పొందిన వారున్నారు. అయితే కొద్దిమంది మాత్రమే ఇప్పటికీ మా నాన్నగారిని స్మరించుకుంటూ వుంటారు.

వారు చనిపోయిన తర్వాత వారి విలువ మరింత తెలిసింది. తండ్రిగా కంటే స్నేహితుడిగానే ప్రవర్తించిన మా నాన్నగారిని “గురుశిరోమణి” అని శిష్యులు కీర్తిస్తూ వుంటే అంతకంటే ఆనందం ఏముంది? వారి భాషాసాహిత్యాల సేవ గురించి వివరించే శక్తి నాకు లేదని మనవి చేసుకుంటున్నాను.

కానీ ఎన్నో సంవత్సరాలు శ్రమించి మనుషులపేర్లు, ఊళ్ళ పేర్లు, ఇంటిపేర్లు ఎలా వచ్చాయో సేకరించి, వింగడించి, విశ్లేషించి రూపొందించిన గ్రంధం లిఖిత ప్రతి దొరకలేదు. దీనిని “మీ పేరేమిటి?”అనే పుస్తకంగా ప్రచురించాలనుకున్నారు. అది నెరవేరలేదు.

1949 మే, జూన్ మాసాల్లో ఆంధ్రప్రభ దినపత్రికలో మాండలిక పదవ్యాసాలను ప్రకటించాడు.వాల్తేరులో చదివేరోజుల్లో గేయ పద్య ఏకాంకికా రచనలు ఎన్నో చేశాడు. ఏకాంకికరచనల పోటీలో ఇతని ‘ఆదర్శశిఖరాలు’ మొదటి బహుమతి పొందింది. ఈ ఏకాంకిక జయశ్రీ పత్రికలో అచ్చయింది. శ్రీశ్రీ దేశచరిత్రలకు పేరడీగా హాస్టలుచరిత్ర వ్రాస్తే దానిని ఆనాటి విశ్వవిద్యాలయ కులపతి అనేక సార్లు చదివించుకుని ఆనందించాడు.

భద్రిరాజు కృష్ణమూర్తి, ప్రొఫెసర్​ తూమాటి దోణప్ప, బూదరాజు రాధాకృష్ణ, కపిలవాయి లింగమూర్తి, పోరంకి దక్షిణామూర్తి, కాలువ మల్లయ్య, నలిమెలి భాస్కర్, ముదిగంటి సుజాతారెడ్డి, రవ్వా శ్రీహరి వంటివారు వ్యక్తిగతంగా తెలంగాణ భాషా పదాలు, మాండలికాలపై వృత్తి పద కోశాలు, ఇతర పదకోశాలు వెలువరించారు. వీరి గ్రంథాలు కూడా ఈ తెలంగాణ తెలుగు పదకోశం తేవడానికి దోహదం చేసినట్లు ముందుమాటలో పేర్కొన్నారు సంపాదకులు.

1957లో “తెలుగు వ్యుత్పత్తి పదకోశం” నిర్మాణ ప్రాజెక్టులో ముఖ్యసహాయకుడిగా చేరి 1961 వరకు పనిచేశాడు.1958లో ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆంధ్రశాఖలో ఉపన్యాసకుడిగా చేరాడు.1970లో ఆంధ్రశాఖకు ప్రధానాచార్యుడయ్యాడు.1976లో నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రశాఖకు ప్రధానాచార్యుడయ్యాడు.

1970-76లో “తెలుగు వ్యుత్పత్తి పదకోశం” ప్రాజెక్టు ముఖ్యసంపాదకుడిగా ఉన్నాడు.1980-81లో నాగార్జున విశ్వవిద్యాలయం రిజిష్ట్రారుగా, 1983-85లో నాగార్జున విశ్వవిద్యాలయ కళాశాలాధ్యక్షుడిగా వ్యవహరించాడు.1985-86లో తెలుగు విజ్ఞానపీఠం ప్రత్యేకాధికారిగా, అంతర్జాతీయ తెలుగు సంస్థ డైరెక్టరుగా నియుక్తుడయ్యాడు.

1986లో తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియమించబడ్డాడు. ఇతడు దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో అకడమిక్ బోర్డు సభ్యుడిగా, సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు.

1965,1966లో వరుసగా ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి రఘుపతి వేంకటరత్నం నాయుడు స్వర్ణపతకాలు.
తెలుగు హరికథాసర్వస్వము అనే గ్రంథానికి ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి డి.లిట్.
1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమానాలు మూడుసార్లు అందుకొన్నారు.

1996 సెప్టెంబర్ 6 న విజయవాడలో మరణించారు.

సేకరణ :―చందమూరి నరసింహారెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s