pic source Google

ఆయన ఓ మేథావి….గొప్ప శాస్ర్తవేత్త….సాహిత్య పిపాసి….విలక్షణమైన వ్యక్తి …
చాలా నిరాడంబరుడు….
వృత్తిరీత్యా తైల పరిశోధనా శాస్ర్తవేత్త. ప్రవృత్తిరీత్యా సాహితీ విమర్శకుడు.
సర్దేశాయి తిరుమలరావు సప్తసముద్రాల సమ్మిశ్రమ మహాసముద్రంలాంటివాడు.

పుట్టింది కర్నూలు జిల్లా అయినప్పటికీ ఆయన ఉద్యోగ జీవిత మంతా అనంతపురం జిల్లా లోనే గడిచింది. అతని అనంతపురం జిల్లా సొంత వాసిగా భావించారు.

తిరుమలరావు కర్నూలు జిల్లా జోహారాపురంలో 1928 నవంబర్ 28 న జన్మించాడు.
తల్లికృష్ణవేణమ్మ, తండ్రి నరసింగరావు. ఆదోని,అనంతపురంలలో ప్రాథమిక,ఉన్నత పాఠశాల విద్యలు చదివాడు. అనంతపురం దత్తమండల కళాశాల(ప్రస్తుత ఆర్ట్స్ కళాశాల)లో 1950లో డిగ్రీ చదివాడు. చిలుకూరి నారాయణరావుకు ఇతడు శిష్యుడు. 1954లో బిట్స్ పిలాని లో ఎం.ఎస్.సి.(కెమిస్ట్రీ) చేశారు.1954లో తైల సాంకేతిక పరిశోధనా సంస్థ అనంతపురం లో
కెమిస్టుగా ఉద్యోగం లో చేరారు. 1983 జూలై 31న డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు.

నాణెం కు ఓవైపు బొమ్మ మరోవైపు బొరుసు ఎలానో ఈయన జీవితం లో కూడా రెండు కోణాలున్నాయి. శాస్ర్తవేత్త గా తన ఉద్యోగ ధర్మం పాటిస్తూ సాహిత్య రంగంలో తన ప్రావీణ్యం ప్రదర్శించారు. శాస్త్రవేత్తగా సాహితీవేత్త గా ఆయన ప్రతిభా పాఠవాలను తెలపడానికి నా శక్తి యుక్తులు చాలవు.

రాచపాళెం చంద్రశేఖరరెడ్డి సంపాదకత్వంలో సర్దేశాయి తిరుమలరావు విమర్శావ్యాసాలను విమర్శ-ప్రతివిమర్శ పేరుతో తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించారు.

సర్దేశాయి తిరుమలరావు తో రోజు సాయంత్రం సంభాషించడంతో సాహిత్య విమర్శకుడిగా ఎదిగానని స్వయంగా రాచపాళ్యం చంద్రశేఖర్ రెడ్డి ఓసందర్బంలో తెలిపారు.సర్దేశాయిని ఒక మంచి తులనాత్మక సాహిత్య విమర్శకుడుగా పేర్కొన్నారు.
సాహిత్యాన్ని సాహిత్యాంశాల పరిశీలనకే పరిమితం చేయకుండా ఇతర కళలు, శాస్త్రం కన్యాశుల్కంలోని పాత్రలను చార్లెస్ డికెన్స్ పిక్ విక్ నిరూపించారు సర్దేశాయి.

సర్దేశాయి కావ్యాలను పరిశీలించే కవిమార్గానుసరణ పద్ధతి. వాటిలో మూడవదైన
సాంకేతిక, మత, రాజకీయ, ఆర్ధిక, చారిత్రక విషయాలను జోడించి సమన్వయం చేసారంటారు రాచపాళెం.

ఆయనకు ప్రజల భాష అంటే గౌరవం. లోకోక్తుల వల్ల కావ్య కవిత్వ స్థాయి పెరుగుతుందంటారు. కవి వాక్యాలు జనంలోకి వెళితే, జనం భాషకు గౌరవం పెరుగుతుందని సర్దేశాయి సిద్ధాంతం

ప్రకృతిలో ఉన్నది ఉన్నట్టు చెప్పటం కవి పని కాదని తిరుమలరావు చెబుతారు. ఉన్నదానికి తన
సృజనాత్మకతను జోడించాలంటారాయన. శాంతంగా స్మరించే ఆవేశమే కవిత్వమని వర్డ్స్వర్త్ అంటే ఆవేశంగా ప్రకటించే శాంతమే కవిత్వమని సర్దేశాయి చెప్పారు. అలా తిరగేసి వ్యాఖ్యానించటం ఆయనకి సరదా. తిరుమలరావు శాస్త్ర సాహిత్య రంగాలలో సవ్యసాచిగా పేర్కొంటారు.

నాగసూరి వేణుగోపాల్, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, హెచ్.ఎస్. బ్రహ్మానంద, రావినూతల శ్రీరాములు, సూర్యదేవర రవికుమార్ తదితరులు తిరుమలరావు గురించి వ్యాసాలు రాశారు.

‘నా మనస్సు విజ్ఞాన శాస్ర్తానికి అంకితమైంది. నా హృదయం సాహిత్యంతో నిండినది’ అని సీనియర్ పాత్రికేయులు జి. కృష్ణతో ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యాలని ఆయన జీవన విధానాన్ని గమనిస్తే తెలుస్తుంది.

ఈయన గురించి
జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు పుస్తక సమీక్ష సందర్భంగా వడ్డి ఓంప్రకాశ్ నారాయణ ఇలా ప్రస్తావించారు.
‘ఇలాంటి వ్యక్తి ఈ భూమ్మీద నడయాడాడంటే భావితరాలకు నమ్మకం కుదరదు’ అని మహాత్మాగాంధీ గురించి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ అన్నమాట, సర్దేశాయి తిరుమలరావుకూ వర్తిస్తుందని చెప్పడం ఆషామాషీ వ్యవహారం కాదు.

ఆయన రాసిన అక్షరమక్షరాన్ని చదివి అర్థం చేసుకున్నవాళ్లు, ఆయన జీవన విధానాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మాత్రమే ఆ మాట చెప్పడానికి సాహసిస్తారు. ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ పుస్తక సంపాదకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్ ఈ విషయాన్ని పుస్తక ప్రారంభంలోనే ప్రస్తావించడంతో ఈ తరం వారికి కాస్త ఆసక్తి, మరికొంత సందేహం కలిగే అవకాశం ఉంది. గతించిన వ్యక్తి గురించి ఇంత పెద్ద మాట అన్నారంటే ఆయనలో ఏదో గొప్పతనం ఉండే ఉంటుందనిపించడం సహజం.

బహుముఖ ప్రజ్ఞగల తిరుమలరావుగారు గడియారం వారి శివభారతమును సాహిత్య తత్వము- శివభారత దర్శనము పేర దర్శించి, 1971లో ఆంధ్ర సాహితీ లోకానికి అందించిన గ్రంథము.

ప్రతి రచననూ విమర్శనాత్మక దృష్టితో చూసే సర్దేశాయి తిరుమలరావుకు నచ్చిన గ్రంథాలు మూడున్నాయి. గురజాడ రచించిన కన్యాశుల్కం నాటకాన్ని, ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన మాలపల్లి నవలను, గడియారం వేంకట శేషశాస్త్రి రాసిన శివభారతం కావ్యాన్ని ఆయన ఎంతో ఇష్టపడేవాడు.

కన్యాశుల్క నాటక కళ, సాహిత్య తత్త్వము – శివ భారత దర్శనము అనే పుస్తకాలను రాశారు. మాలపల్లి మీద రచన పూర్తి చేయకుండానే ఆయన కన్నుమూశాడు

కళాహృదయమున్న మేధావి, రసతత్త్వ మెరిగిన వైజ్ఞానికుడు, దార్శనికదృక్పథం ఉన్న స్వాతంత్రుడు’ అంటూ ఆచార్య హెచ్. ఎస్. బ్రహ్మానంద పేర్కొన్నారు.

తిరుమలరావు సాదాసీదా జీవితాన్ని గడిపారు. అనంతపురం లోని కమలానగర్ లో ఒక చిన్న పెంకుటిల్లు లో ఆయన, ఆయన సోదరుడు కలసి సాదా సీదా జీవనం సాగించారు. ఇంటిలో కనీసం కుర్చీలు కూడా ఉండేవి కావట కేవలం రెండు చాపలు ఉండేవి. చాపల మీద కూర్చుని తన రచన వ్యాసంగాలు కొనసాగించేవారు.

చుట్టూ పుస్తకాల మధ్య ఓ చిన్నగదిలో చాపమీదే ఆయన జీవితమంతా గడిపారన్న విషయాన్ని గమనిస్తే ఆయన నిరాడంబరుడు అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు.అత్యున్నతమైన ఆలోచనలతో, అతి సాదాసీదా జీవితాన్ని గడిపిన సర్దేశాయి తిరుమల రావును చూస్తే రుషిపుంగముడనే అనిపిస్తుంది.

కొలకోవ్ స్కీ రాసిన ‘మాడర్నిటీ ఆన్ ఎండ్‌లెస్ ట్రయల్’ సుదీర్ఘ వ్యాసానికి అనువాదం సర్దేశాయి చేసారు.

రచయితల సృజనలో ఏమాత్రం పొరపాటు జరిగిన విమర్శించడానికి ఆయన వెనుకాడలేదు. ప్రముఖ కవి శేషేంద్ర శర్మ అయినా ఆయన మొహమాటపడలేదు. అలానే పుట్టపర్తి నారాయణాచార్యుల ‘జనప్రియ రామాయణం’ గురించి విమర్శనాత్మక వ్యాసాన్ని అదే నిబద్ధతతో విశ్లేషించారు.

సాహితీ విమర్శకుడిగా నిర్మొహమాటంతో, నిర్భీతితో ఆయన తన విశ్వరూపాన్ని అనేక పర్యాయాలు ప్రదర్శించారన్నది వాస్తవం.

రాయలసీమ నుంచి ఎదిగిన భంగోరె, రారా వంటి విమర్శకుల కోవలో విశేష కృషి చేసిన పండితులు సర్దేశాయి తిరుమలరావు

జంధ్యాల రఘబాబు తన వ్యాసంలో ఇలా పేర్కొన్నారు.
మాట్లాడేటప్పుడు ఆయన ఎంతో సౌమ్యుడు సాహిత్య విమర్శ విషయంలో అంత కటువుగా ఉండేవారు
తన కటువుదనానికి కారణం విశ్వవిద్యాలయాలు, అకాడమీలకు దూరంగా
ఉండటమేనని ఆయన చెప్పేవారు.

ఆంధ్రపత్రిక, భారతి హిందూ, బ్లిట్జ్, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, సైన్స్ టుడే వంటి పత్రికలు మాత్రమే చదివే ఆయన వాటికే తన రచనల్ని పంపేవారు ఒక్క భారతి పత్రికలోనే 23 వ్యాసాలు, 15 లేఖలు, 50 కలగూరగంప వ్యాసాలు, 5 గ్రంథ విమర్శలు వచ్చాయంటే సాహిత్యంలో ఆయన చేసిన కృషిని అర్థం చేసుకోవచ్చు.

మినీ కవితా ప్రక్రియ కొత్తదేమీ కాదని అధర్వవేదంలో మినీ కవితలున్నాయని సర్దేశాయి చెప్పారు. పొయ్యిలో పిల్లిని లేపటమంటే వంట చేయటం కాదని, వంటనొదలు పెట్టటం మాత్రమేనని సర్దేశాయి చెబుతారు. ఏ ఒక్క విషయాన్నీ ఆయన తేలిగ్గా తీసుకోలేదు. గొప్ప పరిశీలన తరువాత మాత్రమే ఆయన మాట్లాడడం, రాయటం చేస్తారు .

మతాలు వాటిలోని అంశాలను కూడా తిరుమల రావు పలు సందర్భాలలో పేర్కొన్నారు. ఆయన నిశితంగా అన్ని విషయాలను పరిశీలిస్తారు. శాస్త్ర సాంకేతిక రంగం సాహిత్య కళారంగాల్లో ఆయన పద్నాలుగు అవార్డులు పొందారు. ఆయన పలువురు కవులకు రాసిన లేఖలు కూడా ఎంతో ప్రసిద్ధి పొందాయి. వాటిలో ఆయన ఎన్నో విషయాలు పేర్కొనేవారు.

డాక్టర్ కొలకలూరి ఇనాక్ రచన దిక్కు లేనోడు” పై కూడా సర్దేశాయి సద్విమర్శ ఘాటుగా చేశారు. జరిగిన సంఘటనలనే రాసి కథ, సన్నివేశం, పాత్రలు కల్పితాలు, నిరాధారాలు అనడం సరికాదన్నారు లేనిది ఉన్నదనడం, ఉన్నదానిని లేదు అనడం చేయకూడదంటారాయన. రచయితకు సత్యమొక్కటే ఆధారం కావాలంటారు. ఆ వ్యాసం జూన్ 1979 భారతిలోవచ్చింది అలా పలు రచనలు చేసారు.

వీరు ఐదువందలకు పైగా పరిశోధనా, సిద్ధాంత వ్యాసాలు వ్రాశారు. ఏ ఐ ఐ టీ వంటి సంస్థలలోనో తప్ప ఇలా వందలకొలదీ పరిశోధనా వ్యాసాలు వ్రాసిన వారు కనిపిస్తారా అన్నది సందేహమే. అమెరికాలో ఒకానొక తైలసాంకేత సంస్థలో భారతదేశం తరపున నమోదు అయిన ఏకైక వ్యక్తి తిరుమల రావు. ఈ రంగంలో నిష్ణాతులైన విదేశీయులు ఈయనను సంప్రదించేవారు.

సర్దేశాయి తిరుమలరావు ఆయిల్ టెక్నాలజీలో గొప్ప సైంటిస్ట్.ఈయన పేరిట తైలసాంకేతిక రంగంలో పదకొండు పేటెంట్లు ఉన్నాయి. మనం నేడు ఉపయోగించే వంటనూనెలలో కొన్ని ఈయన కృషి ఫలితమే. తన సాంకేతికత తో అభివృద్ధి చేశాడు.

ఆయన నేతృత్వంలో అనంతపురం తైల సాంకేతిక పరిశోధనా కేంద్రం కు
కేంద్ర ప్రభుత్వం యేటా ఉత్తమ పరిశోధనాసంస్థలకు ఇచ్చే బహుమతులలో ఐదు సార్లు బంగారు పతకాన్ని, ఇంకా పది సార్లు రజత కాంస్యపతకాలను గెలుచుకుంది.

జాతీయ, విదేశీయ పత్రికలలో తైలసాంకేతికత మీద ఐదువందలకు పైగా పరిశోధనా, సిద్ధాంత వ్యాసాలు వ్రాశాడు.

ఈయన సాహిత్యకృషిని గుర్తించి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 1989లో గౌరవ డాక్టరేట్ (డి.లిట్.)ప్రదానం చేసింది.

ఈయన విమర్శకు గుర్తింపుగా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 1989లో తిక్కవరపు రామిరెడ్డి స్మారక పురస్కారాన్ని ఇచ్చింది.

భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ది హిందు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, బ్లిట్జ్,సైన్స్‌టుడే మొదలైన పత్రికలలో సాహిత్య, సాహిత్యేతర అంశాలపై ఎన్నో వ్యాసాలు, ఉత్తరాలు వ్రాశాడు.

చర్చలు చేశాడు. అసలు పేరుతో పాటుగా ‘తి’, ‘నిశ్శంకతిమ్మణ్ణ’, ‘పైథోగొరస్’ మొదలైన తొమ్మిది కలంపేర్లతో రచనలు చేశాడు. ఇతడు విమర్శలు మాత్రమే కాకుండా సృజనాత్మక రచనలు కొన్ని చేశాడు. వాటిలో ‘పద్మావతీ చరణచారణ చక్రవర్తి’, ‘పగచిచ్చు’ అనే నాటికలు, ‘భూసూక్తము’ అనే కథా ఉన్నాయి.

అనంతపురం పట్టణంలో జీవితాంతం బ్రహ్మచారిగా నివశించిన సర్దేశాయి తిరుమలరావు 1994లో మే 11న మరణించారు.

రచన:– చందమూరి నరసింహా రెడ్డి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s