సింగమనేని నారాయణ

అనంతపురంలోని బండమీది పల్లెలో సంజీవమ్మ, రామప్ప దంపతులకు జూన్ 23, 1943న సింగమనేని నారాయణ జన్మించారు. మొత్తం తొమ్మిదిమంది సంతానంలో ఈయన రెండోవాడు. వీరిది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం.వీరి
తండ్రి ఆ రోజుల్లో ఫోర్త్ ఫారం వరకు చదువుకున్నారు. అందువల్ల ఆయన కొంతకాలం ఉపాధ్యాయుడిగా కూడా పని చేశారు. ఆయన చాలా పుస్తకాలు,పత్రికలు తెచ్చియిచ్చి పిల్లలందరితో చదివించి వారిలో సాహిత్య పఠనాభిలాషను పెంపొందించాడు.
రెండో తరగతి నుంచే సింగమనేని చేతికి దొరికిన ప్రతి అక్షరం ముక్కనూ చదవడం అలవాటు చేసుకున్నారు. మూడవ తరగతి వయసులోనే ప్రతి రోజూ రాత్రి లాంతరు దగ్గర కూర్చుని మూడు నెలలపాటు నాన్న ప్రోత్సాహం తో తులసీదాసు రామాయణాన్ని సంపూర్ణంగా చదివేశారు.బాల్యం నుంచి ఆటల కన్నా పుస్తకాలు విపరీతంగా చదివటంలో ఆసక్తి ఏర్పడింది.

తండ్రి తెచ్చిచ్చే బాల మాసపత్రికలు,
వావి కొలను సుబ్బారావు రాసిన ‘ఆర్య కథానిధి పుస్తకాలను చదివేశారు. ఎలిమెంటరీ స్కూలు టీచరు నాగిరెడ్డి ప్రోత్సాహంతో వందలాది పద్యాలు శ్రావ్యంగా పాడుతూ చదివి కంఠస్థం చేశారు. ఇలా కొన్ని వేల పుస్తకాలు చదివేశారు.
ఏడునుంచి ఎస్ఎస్ సి వరకు అనంతపురంలోని సాయిబాబా నేషనల్ హైస్కూల్లో చదివారు. పియుసి అనంతపురం లోనే చదివారు. విద్వాన్ చదవటం కోసం 1964లో తిరుపతి చేరారు. ప్రభుత్వం స్కాలర్ షిప్ ఇచ్చేది. 1968లో విద్వాన్ పూర్తి చేశారు.


1969లో అనంతపురం జిల్లాలోని నార్పల ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో తెలుగు పండితునిగా చేరి వివిధ పాఠశాలలో 32 సంవత్సరాలు పనిచేసి 2001లో పదవీవిరమణ చేశారు. 1969లో గోవిందమ్మతో పెళ్లయింది. వారికి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు.అందరికీ పెళ్లిళ్లయ్యాయి. అందరూ స్థిరపడ్డారు. వందలాది కథలు చదివిన ప్రేరణతో ఏ ప్రపంచ జ్ఞానమూ లేని రోజుల్లోనే న్యాయ మెక్కడ అనే కథ రాశారు. అది కృష్ణాపత్రికలో జూలై, 1960లో అచ్చయింది. 20 ఏళ్ల వయసులో విద్వాన్ చదువుతున్న రోజుల్లోనే ఆదర్శాలు అనుబంధాలు నవల రాశారు.ఆదర్శమండలి ఆ నవలను ప్రచురించింది. వారే 100 రూపాయలు ఇచ్చారీ నవలకు‌.’అనురాగానికి హద్దులు’,’ఎడారి గులాబీ’ అనే మరో రెండు నవలలు కూడా రాశారు.ఇవన్నీ తన కలం ఎలా కదిలితే అలా ఏ ప్రాపంచిక జ్ఞానం లేని రోజుల్లో ముఖ్యంగా మార్క్సిజం పరిచయం కాకముందు రాసినవి.
శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ చదవటం ఆయన
సాహితీ జీవితాన్ని మలుపు తిప్పింది.
అందులోని మొత్తం గీతాలు కంఠస్థం చేశారు. అప్పటి నుండి మార్క్సిజంలోకి ప్రవేశించారు.
ప్రపంచం పుట్టినప్పటినుంచి మార్క్సిజాన్ని మించిన మహోన్నత మానవీయ తత్వ శాస్త్రం ఇంతవరకూ రాలేదు. మానవ శ్రమలేని సమాజం ఉందా? శ్రమ జీవికి మనం రుణపడి ఉన్నాం.
అనంతపురం జిల్లాలో కథాసాహిత్యం జి.రామకృష్ణ తో ప్రారంభమైంది.ఆయన తన కథారచన మానివేసిన తరువాత దాదాపు ఇరవై సంవత్సరాల కాలం ఆ నూతన చైతన్యానికి వారసులు దాదాపుగా లేకుండా పోయారు. ఇప్పటి వరకూ మనకు లభించిన ఆధారాలను పరిశీలించి చూస్తే అనంతపురం జిల్లాలో స్థానిక జీవిత చైతన్యం సింగమనేని కథలతో ప్రారంభమైందని చెప్పవచ్చని ప్రముఖ విమర్శకులు వల్లంపాటి వేంకట సుబ్బయ్య అన్నారు.

సింగమనేని నారాయణ

‌‌ మార్క్సిజం ప్రభావంతో ఆధునిక సాహిత్యాన్ని మార్క్సిస్టు దృష్టితో పరిశీలించడం మొదలుపెట్టారు.సమాజంలో ఉన్న సామాజికార్థిక సంబంధాలు అర్థమయ్యాక 1974లో రెండో కథ జూదం రాశారు.ఇది జిల్లాలో వచ్చిన మొదటి స్థానిక జీవిత చైతన్య కథ. ఈ కథ “ప్రజాసాహితి”లో ప్రచురితమైంది. రాయలసీమలో ప్రకృతి నిరాదరణ తో జూదంగా మారిపోయిన వ్యవసాయాన్ని విధిలేక మోస్తున్న రైతు జీవితాన్ని ఈ కథ నిరాడంబర మైన శిల్పంతో చిత్రించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సుమారు 60 కథలు రాశారు.ఈయన కథలు జూదం (1988), సింగమనేని నారాయణ కథలు (1999), అనంతం (2007), సింగమనేని కథలు(2012) అనే నాలుగు కథాసంపుటాలుగా వెలువడ్డాయి. ఆయన భావజాలాన్ని ప్రభావితం చేసింది శ్రీశ్రీ అయితే సాహిత్య శిల్పాన్ని ప్రభావితం చేసింది
కొడవటిగంటి కుటుంబరావు.మార్క్సిజం ప్రభావంతో తన పేరు చివర నున్న చౌదరి అనే కుల చిహ్నాన్ని రాసుకోవడం మానేశారు. రాయలసీమ రైతు ఎదుగూబొదుగూలేని స్థితిని తెలుగు సాహిత్యలోకానికి చెప్పాలనే ఉద్దేశ్యంతో అలాంటి కథలను సేకరించి ‘సీమ కథలు’ పేరుతో 1982లో 18 కథలతో ప్రచురించారు. అది నిర్దిష్టమైన, ప్రాంతీయమైన ఒక ఒరవడిని తీసుకొచ్చిన ఆ పుస్తకం తెలుగు కథా సంకలనాల చరిత్రలోనే ఒక మలుపు తిప్పింది.భాష విషయంలో సింగమనేని నారాయణది మధ్యేమార్గం. మాండలికాన్ని సంభాషణలకు మాత్రమే ఉపయోగించి కథకూ, కథనానికి మధ్య ఉండవలసిన తేడాను జాగ్రత్తగా పాటించారు.అనంతపురం జిల్లా కరవు కథలతో వెలువడిన ‘ఇనుప గజ్జెల తల్లి’ సంకలనానికి కూడా సంపాదకత్వం వహించారు.’తెలుగు కథకులు-కథనరీతులు’ అనే సాహిత్య వ్యాసాల సంకలనాలకు మధురాంతకం రాజారాంగారితో కలిసి సంపాదకత్వం వహించారు. నాకు తెలిసిన జీవితం పరిమితమైంది కావటం వల్ల, తెలిసిన జీవితాన్ని మాత్రమే రాయాలనుకోవటం వల్ల తక్కువ కథలు రాశానంటారాయన.


“రచయిత జీవితంలో ఒక పార్శ్వాన్ని, ఒక జీవిత శకలాన్ని మాత్రమే చెప్పగలిగి వుండాలి.ఆ కథ ఏక లక్ష్యంకలిగి వుండాలి.
కథను కొంచెం కొంచెం రాస్తూ పోతే వారం పదిరోజుల్లో కథా నిర్మాణం పూర్తి చేయొచ్చు. కథ చదవటం పూర్తి కాగానే రచయిత
ఎందుకోసమీకథ రాశాడన్న అనుమానం పాఠకునికి వస్తే అది చక్కని కథ కాదు.” అంటూ కొత్త కథకులకు సూచలిచ్చారని
సుంకోజీ దేవేంద్రాచారి పేర్కొన్నారు.
సింగమనేని కథలతో పాటు అనేక సాహిత్య విమర్శా వ్యాసాలు రాశారు.ఆయన
సాహిత్య విమర్శ నంతటినీ అధ్యయనం చేస్తే మార్క్సిజం అధ్యయనం ద్వారా ఆయన ఏర్పరచుకున్న సాహిత్యాభిప్రాయాలు తెలిసివస్తాయి.
రాయలసీమ కథా చిత్రం’, ‘తెలుగు కథ – 1990 తర్వాత’, ‘తెలుగు కథ 2002 వంటి విమర్శా వ్యాసాలెన్నో రాశారు.కథావరణం పూర్తిగా ఆయన రాసిన విమర్శ వ్యాసాల సంకలనం.ఆయనది ప్రగతిశీల మార్గం.ప్రముఖ విమర్శకులు రారా,కొ.కు.ల మార్గంగా రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ఆయన విమర్శ పద్దతిని విశ్లేషించారు.
సమాజం పట్ల తనకొక బాధ్యత ఉంది అని భావించే విమర్శకులెవరూ విమర్శకు రచనే తప్ప – రచయిత, అతని స్థలకాలాలు ప్రమాణాలు కావు అని వాదించరు.ప్రేమ విషయంలోనే కాదు, ప్రజల జీవితంలో ఏ పార్శ్వం పట్లనైనా రచయితలు పాఠకులలో భ్రమలు పెంచరాదన్నది సింగమనేని దృఢమైన అభిప్రాయం.
వస్తువులోనైనా, శిల్పంలోనైనా రచయితలు చేసే కల్పనలోనూ, నిర్మాణ విన్యాసాలలోనూ సామాజిక ప్రయోజనం దెబ్బతినకుండా ఉండాలని సింగమనేని కోరుకుంటారు.ఎంత విస్తృతంగా రచనలు చేసినా పునరుక్తులు చెయ్యడం, మూసధోరణి లో పడిపోవడం నరైంది కాదని సింగమనేని భావిస్తారు. అమెరికా రచయిత ఆప్టన్ సింక్లైయర్ చెప్పినట్లు సాహిత్యం భావప్రచారానికి బలమైన సాధన మన్న అభిప్రాయంతో సింగమనేని పూర్తిగా ఏకీభవిస్తారు. సమాజంలోని సమస్యల పట్ల స్పందించడం అనేది, క్రియాశీలకంగా పాల్గొనడం అనేది రచయిత నైతిక బాధ్యత. అదే నిబద్ధత అన్నారు.నేటి సాహిత్య కారులు తాము చెప్పడం వరకే పరిమితం కాని ఆచరించడం సాధ్యం కాదంటారు. సింగమ నేని అలాకాదు. ఆయన ఆచరణ వాది కూడా. రైతు జీవితాలను సాహిత్యం లోకి ఒకవైపు తీసుకొస్తూ సింగమనేని నారాయణ రైతు సంఘాలతో కలిసి పని చేశారు.2002లో అనంతపురంలో జరిగిన సిపిఎం రాష్ట్ర మహాసభలకు ఆహ్వానసంఘం అధ్యక్షుడిగా కూడా పని చేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర, సాగునీరు, ఇన్ పుట్ సబ్సిడీ కోసం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జరిగిన ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొని అరెస్టు కూడా అయ్యారు. ‘హంద్రీ నీవా జల సాధన సమితి’ కి కన్వీనర్‌గా వుంటూసాగునీటి కోసం జరిగిన ఉద్యమాలలో పాల్గొన్నారు.ఎన్నెన్నో గ్రామాలలో సాగునీటికోసం సమావేశాలు నిర్వహించారు. ఒక కోటి మంది నివసించదగ్గ భూభాగం వున్న అనంతపురం జిల్లాలో 35 లక్షల మంది మాత్రమే జీవించే దుస్థితికి కారణం సాగునీరు లేకపోవడమే. జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ప్రబలమవుతున్న రోజుల్లో వాటిని ఆపటానికి ప్రజా సంఘాలతో కలసి ‘రైతు ఆత్మ విశ్వాస యాత్ర’ కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా ఎన్నెన్నో గ్రామాల్లో పర్యటించారు.


రాయలసీమలోనే గాక రాష్ట్రంలో ఎక్కడ సాహిత్యసభ జరిగినా విధిగా హాజరై కొత్త రచయితలను ప్రోత్సహిస్తూ ఉంటారాయన. రైతును గురించి, గ్రామీణ జీవితం గురించి రాసి ప్రతి కథకుడు సాహిత్యంలోనైనా రైతును బతికించాలని ఆయన నిరంతరం కోరుకుంటారు.
సింగమనేని రచయితగా మాత్రమే కాకుండా తన సహచర్యంతో- ఆలోచనాపరుడుగా, లిటరరీమేట్, అనంత రచయితల సంఘం బాధ్యుడుగా, సంపాదకుడుగా, కొత్త రచయితలను వెలుగులోకి తీసుకు రావడంతో పాటు ఆ ప్రాంత రచయితల వస్తు శిల్పాలను ప్రభావితం చేశారు.ప్రముఖ రచయిత శాంతి నారాయణ తన కథావస్తువు ఎంపికలో సింగమనేని ని అనుసరించానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సాహితీ స్రవంతి సంస్థతో సన్నిహితంగా ఉండి అన్ని రకాలుగా సహకారమందిస్తూ వున్నారు. ఇటీవలే గురజాడ అపార్ట్మెంట్స్ అనే అద్భుతకథను కథాభిమానులకు అందించారు.
1997లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకట శివయ్య సాహితీ సత్కారం పొందారు.అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ ఆయనకు సాహిత్య సేవామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని 2013లో అందజేసింది.
2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న పురస్కారం తో ఆయనను సత్కరించింది.

ప్రసిద్ధ మార్క్సిస్టు రచయిత,సాహిత్య విమర్శకుడు,సీమాంధ్రులు,విశాలాంధ్ర తెలుగు కథలు ,తెలుగు కథకులు,కథను రీతులు గ్రంథాలసంపాదకుడు, కథావరణం,సమయమూ సందర్భమూ, సంభాషణ,తెలుగే ఎందుకు, మధురాంతకం రాజారాం వంటి అనేక గ్రంథాలు రచయిత, గొప్ప వక్త సింగమనేని నారాయణ గారు గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడి ,నేడు (2021ఫిబ్రవరి23 )తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి ఆం.ప్ర. అరసం ప్రగాఢమైన సంతాపం ప్రకటిస్తున్నది. జూదం,సింగమనేని కథలు వంటి కథా సంపుటాలు తో తెలుగు కథావికాసానికి దోహదం చేసిన సింగమనేని మరణం వల్ల తెలుగు సాహిత్యం పెద్ద దిక్కును కోల్పోయిందని అరసం అభిప్రాయపడింది.

Pillaa kumaraswaamy

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s