రాచపాళ్యం చంద్రశేఖర రెడ్డి

చుట్టూ కొండలు, పచ్చని చెట్లతో , పైర్లతో ,పాడిపంటలతో కళకళలాడుతున్న ఓ పల్లెటూరి ప్రశాంత వాతావరణంలో హలాలతో పొలాలలో నడయాడి, బంగారు పంటలు పండించిన రైతుబిడ్డడై … సీమ సాహితీ పొలాల్లో అక్షర సేద్యంతోనూ సుగంధ భరిత ఫలాలను లోకానికందించిన మహోన్నత సాహితీ కృషీవలుడు…

సద్విమర్శకు రూపశిల్పి . విశ్వవిద్యాలయ తెలుగు తోటలో శ్రీగంధపు ‘పరిశోధక’,ను పెంచి పోషించి, సంతసిల్లిన వనమాలి.

విలక్షణమైన కవిగా.. రచయితగా.. ఆయన సాహితీ లోకానికి సుపరిచితులు. గురజాడ సాహిత్యాన్ని నిత్య నూతనం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి. సీమలోని అనేకమంది సాహిత్యకారులను సునిశితంగా పరిశీలించి వారిని బయట ప్రపంచానికి తెలియజెప్పిన పరిశోధకుడు.

ఆయనే మన తెలుగు నవల కథానిక సాహిత్య విమర్శకు ‘రాచ’బాట వేసిన చిత్తూరు సాహిత్య ముద్దు బిడ్డ.. ఎస్వీయూ చిన్నోడు.. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి.

రాయలేలిన సీమలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం లో విలువలకు వలువల తొడిగి వజ్రాలాంటి విద్యాధికులను అందించారు.

చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో ని కుంట్రపాకం గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో 1948 అక్టోబర్ 16న రాచపాళెం చంద్రశేఖరరెడ్డి జన్మించారు. తల్లిదండ్రులు రాచపాళెం రామిరెడ్డి, మంగమ్మలు. వీరికి నలుగురు సంతానం.ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు. ఈయనమూడవ సంతానం. వీరికి అన్న,అక్క , చెల్లెలుఉన్నారు. వీరు6 సంవత్సరాల పిల్లవానిగా ఉన్నప్పుడు తల్లి చనిపోయింది. వీరి తండ్రి రాజమ్మ ను రెండో పెళ్లి చేసుకొన్నారు.వీరికి ఐదు మంది సతానం.

రాచపాళ్యం కుంట్రపాకంలో మెషనరి స్కూల్ లో ప్రాథమికవిద్య, కట్టకింద వెంకటాపురం లో 6వతరగతి , 7వతరగతి నుంచి తిరుపతి మున్సిపల్ హైస్కూలులో , 1965 లో యస్ .యస్ యల్.సి కట్టకింద వెంకటాపురం హైస్కూల్ లో చదివారు.పీ.యూ.సీ విద్య యస్.వి ఆర్ట్స్ కాలేజ్ తిరుపతి లో , 1970లో బి.ఏ ,1972లో యం.ఏ , 1977 లో పి.హెచ్.డి తిరుపతిలో శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో పూర్తి చేశారు. వయోజన విద్యలో డిప్లొమా చేశారు. శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి తమిళంలో సర్టిఫికెట్ కోర్సు చేశారు.

ఆ తర్వాత 1977 ఆగస్టు 25న అనంతపురం
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం లో తెలుగు ఉపన్యాసకులు గా చేరారు.
1977 నుంచి 85 వరకు ఉపన్యాసకులు గాను1985 నుంచి 93 వరకు రీడర్ గా గాను 93 నుంచి 2008 వరకు ప్రొఫెసర్ గా పని చేశారు. 2008లో పదవీ విరమణ చేశారు. 2008 నుంచి 2016 వరకు యోగి వేమన విశ్వవిద్యాలయం లో తెలుగు ప్రొఫెసర్ పని చేశారు.

2014 డిసెంబర్ 21న సాక్షి పత్రికలో విమర్శలో రాచ‘పాళీ’యం అంటూ శశిశ్రీ ఇలా పేర్కొన్నారు.
ఆచార్య చంద్రశేఖరరెడ్డి
పద్నాలుగేళ్ల్ల విరామం తర్వాత రాయలసీమ సాహిత్య విమర్శకునికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మాటల్లో చేతల్లో తనువెత్తు ఆదర్శం రాచపాళెం.

గత 42 ఏళ్లుగా సుదీర్ఘ కాలం విరామం పాటించకుండా విమర్శా సాహిత్యం అందిస్తున్న నిబద్ధ, మార్క్సిస్ట్ సాహిత్యకారుడాయన. ఆయన రచించిన ‘మన నవలలు-మన కథానికలు’ పుస్తకానికి, జీవిత కాల సాహిత్య కృషికి గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. 2014వ ఏడాదికి ఇచ్చే ఈ అవార్డు ఆయనకు ప్రదానం చేశారు

1972 అక్టోబర్ నెలలో ‘స్రవంతి’ మాసపత్రికలో ‘సినిమా కవిత్వం’ మీద రాచపాళెం తొలి విమర్శా వ్యాసం అచ్చయింది. సాహిత్యం ఇచ్చిన సంస్కారం రాచపాళెంలోని సంస్కర్తను తట్టి లేపిందన్నారు. అనంతపురం యూనివర్సిటీలో గురజాడ కన్యాశుల్కంపై విద్యార్థులకు ఏకంగా నాలుగేళ్లపాటు పాఠం చెప్పాల్సివచ్చింది. దాంతో కన్యాశుల్కం నాటకానికి సంబంధించిన విమర్శనా గ్రంథాలు అధ్యయనం చేయడంతో తనలో కొత్త ఆలోచనలు రేకెత్తాయి.

ఆలోచనలు మారాయి. పైగా అనంతపురంలో జనవిజ్ఞాన వేదిక, అభ్యుదయ రచయితల సంఘం, విశాలాంధ్ర, సీపీఎం, సీసీఐ నాయకులతో పరిచయాలుతో
అప్పటి వరకు దైవభక్తి కలిగిన ఆయన్ను మార్క్సిస్టుగా మార్చాయి.

ఈ క్రమంలో కులాంతర మతాంతర వివాహాలు నిర్వహించారు. గుర్రంజాషువా విగ్రహం ఏర్పాటులో ప్రధాన భూమిక నిర్వహించారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఏకగ్రీవంగా న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన గ్రంథం ‘మన నవలలు- మన కథానికలు’. ఈ పుస్తకంలోని 24 వ్యాసాలు 13 ఏళ్ల సాహిత్య అధ్యయన కృషికి అక్షరరూపం.

అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నాలుగు ప్రాంతాలకు చెందిన ప్రాతినిధ్య నవలలు, కథానికల మీద చేసిన మూల్యాంకనం, పునర్ మూల్యాంకనాలే ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకంలో రెండు అధ్బుత మైన వ్యాసాలున్నాయి.

అవి ఒకటి. ‘సామాజిక ఉద్యమాలు- తెలుగు కథానికా వికాసం’. ఈ వ్యాసంలో సంఘసంస్కరణ ఉద్యమం నుండి ప్రపంచీకరణ నేపథ్యం వరకు తెలుగు కథానిక ఎలా వికసించిందో చెప్పారు.

రెండు. ‘అయ్యో పాపం నుండి ఆగ్రహం దాకా తెలుగు దళిత కథానిక’. ఈ వ్యాసంలో 1925నుంచి2008 మధ్య దళిత జీవితం వస్తువుగా వచ్చిన కథానికల్ని చారిత్రక దృక్పథంతో అధ్యయనం చేశారు. దళిత సాహిత్య విమర్శ లో ఈ వ్యాసం కలికితురాయి. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుఇది.

ఆధునిక తెలుగు సాహిత్యం పై అనేకమైన సామాజిక ఉద్యమాల ప్రభావం ఉందని, ఆ ప్రభావం వల్ల సాహిత్యం పెను మార్పులకు లోనైందన్నారు.ప్రాచీన ఆధునిక అలంకారిక సిద్ధాంతాల నేపథ్యంలో జాతీయ పునరుజ్జీవన కవిత్వ సిద్ధాంతాలు, వీరేశలింగం గారి సామాజిక సంస్కరణ గురజాడ సాహిత్య సంస్కరణ, గిడుగు భాషా సంస్కర ణల వల్ల తెలుగు సాహిత్యంలో ఆధునికత ప్రారంభమైందని రాచపాళ్యం ఓ సభలో పేర్కొన్నారు.

ఓ పరిశోదన విద్యార్థి రాచపాళ్యం గురించి ఇలా అన్నారు.ఎంఏ పూర్తయినాక పరిశోధన చెయ్యాలన్న ఉత్సాహంతో ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారికి సంప్రదించాను, పరిశోధన అంశాన్ని సూచించమని అడిగాను సాహిత్య విమర్శ మీద పరిశోధనలు ఎక్కువగా జరగలేదు, దానిమీద పరిశోధన చేయమని సూచించారు.

అప్పుడు నా పర్యవేక్షకులు డా॥ జి. బాలసుబ్రమణ్యం గారితో చర్చించి రాచపాళెం సాహిత్య విమర్శను పరిశోధనాంశంగా గా తీసుకున్నాను.

ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి నాకు గురువుగారే గాక , రాష్ట్రం లోని తెలుగు సాహిత్య విమర్శకులు పేర్కొన దగిన వాళ్ళలో ఒకరు. నిరంతరం సభలో మాధ్యమాలలో సాహిత్య విమర్శను ఆధునిక ప్రక్రియగా రూపొందించడంలో కృషి చేస్తున్నారు. ఈ రెండు కారణాలు నా పరిశోధనకు ఈ అంశాన్ని తీసుకోవడానికి ప్రేరేపించాయి .

తరగతి గదిలో పాఠం చెబుతున్నప్పుడు గాని , శాఖలో తన గదిలో ఎవరితోనైనా సాహిత్యాన్ని గూర్చి మాట్లాడుతున్నప్పుడు గానీ , సాహిత్య సభలో ప్రసంగిస్తున్నప్పుడు గాని, ఆయనకు తాను సాహిత్య విమర్శకుడిననే స్పహ సజీవంగా ఉంటుంది . గంభీరమైన వదనమే కాదు ఆలోచనలు కూడా గంభీరంగా ఉంటాయి.

తరగతి గదిలో తన భావజాలాన్ని పద్యంలో పాఠం చెప్పి, గంట అయిపోయిన తర్వాత అటెండెన్స్ వేసేముందు ఇది నా అభిప్రాయం, మీరు ఆలోచించుకోండి, యదాతథంగా విశ్వసించ వద్దుఅంటారు . అధ్యాపకులు ఏది చెబితే అది విని అంతా నిజమనుకునే మేము, రాచపాళెం ఆ మాట అన్నప్పుడు ఒకింత ఆశ్చర్య పడ్డాం. ఈయనలో ప్రజాస్వామిక వాదిని చూసి అనంద పడిపోయాం.

రాచపాళ్యం సాహిత్య విమర్శ ప్రాచీన సాహిత్యం తోనే మొదలయ్యింది. పింగళి సూరన కళాపూర్ణోదయం ప్రభావతి- అద్య కావ్యాల మీద విమర్శ రావడం తోనే మన సాహిత్య విమర్శకుడుగా పట్టాడు. ఒక దశాబ్దం తర్వాతనే ఆయన ఆధునిక సాహిత్య విమర్శ లోకి ప్రవేశించారు. ఆధునిక సాహిత్య విమర్శ చేస్తున్నా ప్రాచీన సాహిత్య అధ్యయనాన్ని పూర్తిగా విస్మరించ లేన్నారు.

గో తెలుగుడాట్ కాం లో ఓ యువకవి ఇలా అన్నారు.
విమర్శ ఒక బాధ్యత దానిని సరిగా నిర్వహించకపోతే సాహిత్యానికే కాదు సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. తద్వారా మంచి పుస్తకాలు మరుగున పడి సాహిత్య విలువలు లేని పుస్తకాలు రాజ్యమేలుతాయి. విమర్శ కేవలం తప్పులనే కాదు ఒప్పులను కూడా చూపుతుంది కనుక మంచి పుస్తకం నిలబడుతుంది.

గత నలభై సంవత్సరాలుగా నిర్విరామంగా విమర్శా సాహిత్యంలో కథ, కవిత్వం, నవల ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలపై రాచపాలెం
పదునైన సద్విమర్శలు చేస్తూనే ఉన్నారు.

రాచపాలెం గారు కవిత్వంపై చేసిన విమర్శలను “రాచపాలెం కవిత్వావరణం” పేరుతో 2018 లో తెలుగు సాహిత్య లోకానికి అందించారు. డాక్టర్ తన్నీరు నాగేంద్ర గారు సంపాదకత్వం వహిస్తే ఆర్. ఆనంద్ కుమార్ గారు ప్రచురణ చేశారు. మొత్తం 19 వ్యాసాలు పుస్తకంలో ఉన్నాయి.

అన్నమయ్య దగ్గరి నుండి నేటి ఆధునిక కవి కెరె జగదీశ్ గారి వరకు తన విమర్శను ఎక్కు పెట్టారు రాచపాలెం గారు. ఈ పుస్తకం చదవడం ద్వారా నాటి నుండి నేటి వరకు ఉన్న పూర్తి కవిత్వాన్ని అవగతం చేసుకోవచ్చు. సూపర్ రీడర్ తప్ప మామూలు రీడర్ అయితే అంతమంది కవులను చదవడం కష్టమౌతుంది అందుకే ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల అంతమంది కవుల కవిత్వాన్ని తెలుసుకోవడమే కాకుండా అందులోని తప్పులు కూడా తెలుస్తాయి.

తద్వారా కొత్తగా రాసే వారు తప్పులు తాము రాసే సాహిత్యంలో చేయకుండా ఉంటారు. కవిత్వం చదవడమే కాదు కవిత్వంపై వచ్చిన విమర్శ చదివినప్పుడు కవిత్వంపై కొత్త కవులు పట్టు సాధించగలరని నా అభిప్రాయం.

వాస్తవికత నుండి స్వప్నంలోకి ప్రయాణమే కవిత్వం.” ఉన్నది వాస్తవికత ఉండవలసినది స్వప్నం అంటారు రాచపాలెం గారు. అంటే ప్రతి కవికి ఒక స్వప్నం ఉండాలి. ఆ స్వప్నం సాకారం కోసమే తన సాహిత్య మనుగడ కొనసాగుతూ ఉంటుంది. ఇలా అనేక విషయాలను విమర్శనాత్మకంగా యువ కవులకు కోసం అందించిన అరుదైన పుస్తకం. ఈ పుస్తకాన్ని యువ కవులు తప్పకుండా చదవాలి.

తన విమర్శ ద్వారా మాలాంటి యువ కవులను సరైన మార్గంలో పెడుతున్న రాచపాలెం గారి పాద కుసుమాలకు వందనాలు తెలుపుతున్నాను అనిపేర్కొన్నారు.

మెలక లో ప్రభాకర్ ఇలా అన్నారు.డాక్టర్. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారి ఉద్దేశంలోగురజాడ సాహిత్యంలోని స్త్రీలంతా భూస్వామ్య వ్యవస్థలోపురుషాధిపత్య ఉక్కుపాదాల క్రింద నలిగిపోతూ అందులోనుంచి బయటపడటానికి పోరాటం చేస్తున్నవాళ్ళే! ఈ వాస్తవాలకన్నిటికీ సైద్ధాంతిక రూపంగా గురజాడ ” కాసులు” కవిత వ్రాసాడు. స్ర్తీ పురుష సంబంధాలలో విప్లవాత్మక మార్పు అంటే యజమాని బానిస సంబంధాలు ధ్వంసమై ప్రేమపూరితమైన స్నేహ సంబంధాలు ఏర్పడటమే.

రాచపాళెం వారి ‘ దీపధారి గురజాడ’ అనే వ్యాసంలో “సాంప్రదాయవాదులు విశ్వనాథంను, అభ్యుదయ ప్రగతిశీల వాదులు గురజాడను, దళితవాదులు జాషువాను, స్త్రీ వాదులు చలంను అలా సొంతం చేసుకున్నారు. చేసుకుంటున్నారు. ఇందులో అసహజతత్వమేదీ లేదు. అనివార్యం కూడా. సమాజం విభజితమై ఉన్నప్పుడు అభిరుచులు కూడా విభజితాలై ఉంటాయి………ఏ రచయితా అన్ని కాలాలకు యథాతథంగా ఆదర్శ ప్రాయం కాదు ” అని అంటారు. కానీ గురజాడవారిని అన్ని కాలాలకు ఆదర్శ ప్రాయుడుగా మనం గుర్తించక తప్పదు.

ఓ ఇంటర్వ్యూ లో రాచపాళ్యం ఇలా పేర్కొన్నారు. ఇందులో ఆయన పేర్కొన్న విషయాలు పరిశీలిస్తే ఆయన రచనా గంభీరత ,వ్యక్తిత్వం , సునిశిత పరిశీలన అవగతమౌతాయి. Up
ఒకప్పుడు సాహిత్యమంటే సంప్రదాయరీతిలో మూసబోసినట్టుండేది. వాటికి కామా పెడుతూ కొత్త వాదాలు పుట్టకొచ్చాయి. 1980 ప్రాంతాలలో అనుకుంటా యుద్దనపూడి మరణం తర్వాత స్త్రీ వాదం, కారంచేడు, చుండూరు ఘటనలతో దళిత వాదం, బాబ్రీ మసీదు విధ్వంసంతో మైనార్టీ వాదం పుట్టుకొచ్చాయి.

ప్రాంతీయ అసమానతల వల్ల అస్థిత్వ వాదాలు కూడా జనిస్తున్నాయి. కాబట్టే నా రచనా వస్తువు కూడా తొలినాళ్లలో ఉన్నట్టు కాకుండా ఒరవడి మారింది. కథలు మాత్రమే రాయడంతో రచయిత పని అయిపోదని నా కలం గ్రహించింది కాబట్టే ఫ్యాక్షనిజం, కరువు రక్కసి, వర్తమాన రాజకీయాలు చేస్తున్న వికృత చేష్టలు ఓ వైపు ఎత్తి చూపుతూనే వాటి పరిష్కార మార్గాలు వెతికే పని చేపట్టాల్సి వచ్చింది.

మార్క్సిజమే ఎందుకు?
చాలా మంది అనుకుంటారు ఇన్ని వాదాలుండగా మార్క్సిజమే ఎందుకని. ప్రపంచాన్ని బాగా అర్ధం చేసుకోవాలంటే మార్క్సిజాన్ని మించినది మరేది ఉండదు. చరిత్ర అంతా వర్గపోరాటమే. రెండు వర్గాల నడుమ సాగే పోరులో అంతిమ విజయం శ్రామిక వర్గానిదే అని చెప్పే మార్క్సిజం.. పీడిత వర్గం వైపు ఉండాలని కవులకు, రచయితలకు, మేధావులుకు సూచిస్తుంది.

అభివృద్ది పథంలో ప్రపంచమంతటా ఒకలా ఉంటే మన దేశంలో కులం అడ్డుగోడగా నిలిచిందనడంలో సందేహం లేదు. శక్తి వంతమైన సమాజ నిర్మాణానికి అంబేద్కరిజమే చక్కటి పరిష్కార మార్గం. కుల రక్కసి చేసే విలయతాండవం మరెన్ని రోజులు చూడాల్సి వస్తోందో.

ఆ రోజులే వేరు..
ఒకసారి మా జ్ఞాపకాలలోకి వెళితే అప్పుడుండే పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయని అనిపిస్తుంది. ఇప్పుడున్నంత బిజీ లైఫ్‌ ఉండేది కాదు. కాబట్టే అప్పట్లో నాతో పాటు చిలకూరి దేవపుత్ర, బండి నారాయణస్వామి, రాయుడు, బోసు, బద్వేలు రమేష్, దక్షిణామూర్తి, రఘుబాబు వంటి వారితో నగరంలో ఉండే గిల్డ్‌ ఆఫ్‌ సర్వీసు పాఠశాలలోని ఓ తరగతి గదిలో కూర్చొని అనేక విషయాలు చర్చించుకునే వాళ్లం.

ముఖ్యంగా 21 వారాలు ‘లిటరరీ మీట్‌’ నడిపాం. కథా చర్చలు జోరుగా సాగేవి. ముఖ్యంగా అవధాని ఆశావాది ప్రకాశరావు ‘రాయల కళా గోష్టి’ పేరిట సాగిన చర్చలు ఎంతో రసవత్తరంగా ఉండేవి.

కవితా వస్తువు కూడా విభిన్నమే
రాయలసీమ నిర్ధిష్ట సమస్యలైన కరువు, ఫ్యాక్షనిజం, వర్తమాన రాజకీయాలు ఇవే నా కవితా వస్తువులు.కథలలో నాటకీయత కన్నా సజీవ చిత్రణ గొప్పగా కనపడాలని నేననుకుంటాను. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు కళ్లముందు కదలాడే విధంగా రచనలుండాలి.

వాటికి తగ్గట్టుగానే నా ‘రెండు ప్రపంచాలు’, ‘స్వర్ణభారతి సాక్షిగా’, ‘సీమ నానీలు’, ‘పొలి’ వంటి కవితా సంకలనాలు, ‘తెలుగు కవిత్వంలో నన్నయ్య ఒరవడి’, ‘గురజాడ తొలి కొత్త తెలుగు కథలు’, ‘చర్చ మరోచర్చ’, ‘విమర్శ –2009’ వంటి విమర్శనా గ్రంథాలు.

‘అనంత’ సాహిత్యం ప్రత్యేకతను చాటాయనే అనుకుంటున్నా. ముఖ్యంగా చాలా మందిని కదిలించిన విమర్శనా గ్రంథం ‘ప్రతిఫలనం.’ ఇందులో అనేక మంది రచయితల ప్రసిద్ధ కథలపై విమర్శ సాగుతుంది. ఇదే ఒరవడిలో సాగిన ‘మన నవలలు–మన కథానికలు’ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకుంది. విమర్శపై విమర్శ రాసినవారు అరుదుగా కనిపిస్తారు. ఆ అదృష్టం నాకు దక్కడం ఆనందమే మరి.

అంతరాలు వాస్తవమే
అప్పటి గురువులకు.. ఇప్పటి వారికి చాలా అంతరమే ఉంది. మా రోజుల్లో పాఠాలు చెప్పడమే ఉపాధ్యాయుల పని. కానీ ఇవాళ అలా కాదే.. వృత్తితో పాటు మరెన్నో వ్యాపకాలు.. వ్యాపారాలు. నిబద్ధత అనేది లోపిస్తోంది. అందరూ అలా ఉంటారని కాదు కానీ… మా రోజుల్లో శిష్యులను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దేవారనేది స్పష్టం.

ఈ విషయంలో నేను చాలా జాగ్రత్త పడ్డాను. మా శిష్యులు కిన్నెర శ్రీదేవి, జూలూరు గౌరీశంకర్, జూపల్లి ప్రేమ్‌చంద్‌ (ప్రస్తుతం జిరసం అధ్యక్షులుగా ఉన్నారు), నానీల నాగేంద్ర వంటి వారిలో చాలా మంది పీహెచ్‌డీలు చేసినా సాహితీ కృషి మరవకుండా చేయడంలో నా వంతు పాత్ర ఉందని సగర్వంగా చెబుతున్నా.

గురువులే స్ఫూర్తి
నాలోనూ మంచి రచయిత ఉన్నాడని గుర్తించిన తొలి వ్యక్తి తుమ్మపూడి కోటేశ్వరరావుగారు. నా పరిశోధనా గ్రంథం ‘శిల్ప ప్రభావతి’కి ఆయనే గైడ్‌గా వ్యవహరించారు. అలాగే ఆచార్య జి.ఎన్‌.రెడ్డి, జాస్తి సూర్యనారాయణ, తిమ్మావఝల కోదండరామయ్య, మద్దూరు సుబ్బారెడ్డి, ఆచార్య నాగయ్య వంటి వారు చాలా మంది గురువులుగా, స్నేహితులుగా నన్నెంతో ప్రోత్సహించారు. అదే ఆప్యాయతను నా శిష్యుల పట్ల చూపించడానికి నాకు పునాదులేశారు. అలాగే మిత్రులు ఆచార్య పి.ఎల్‌.శ్రీనివాసరెడ్డి, భక్తవత్సలరెడ్డి నా పట్ల చూపిన ఆదరణ కూడా మరవలేనిదే.

సృజన సాహిత్యప్రక్రియల మీద విమర్శ రాస్తున్న క్రమంలో సాహిత్యవిమర్శను, విమర్శకులను చదవడం, వస్తున్న సాహిత్య విమర్శ, పరిశోధనలమీద జరుగుతున్న చర్చల్లో పాల్గొనడం, విమర్శగ్రంథాలను సమీక్షించడం, వ్యాసాలు రాయడం – ఆయనకొక బాధ్యత అయ్యింది. ఈ బాధ్యతలోంచి ఈ వ్యాసాలు పుట్టాయి.

1988నుంచి2005 మధ్య దాదాపు మూడు దశాబ్దాలలో రాసిన ముప్పయ్యెనిమిది వ్యాసాల సంపుటి ఇది. తెలుగు సాహిత్య సృజనలో, విమర్శలో ఇవాళ రెండు పాయలుకొనసాగుతున్నాయి. 1. భౌతికవాద, చారిత్రక, వాస్తవిక పురోగమనపాయ, 2. ఆధ్యాత్మిక, భావవాద, అచరిత్రక, అవాస్తవిక తిరోగమనపాయ. ఈ రెండు పాయలమధ్య సంఘర్షణ అనివార్యంగానే జరుగుతున్నది. మొదటి పాయకు చెందినవ్యక్తి గా ఆ పాయద్వారా వచ్చిన విమర్శను ఆమోదించడం, రెండోపాయ ద్వారా వచ్చిన విమర్శను తిరస్కరించడం ఇదీ ఆయన విమర్శ ధోరణి.

ఆయన తిరస్కరించిన వాళ్ళలో వారి గురుతుల్యులు ఉన్నారు. స్నేహితులు ఉన్నారు. ఆమోదించిన వాళ్ళలోనూ అంతే. ఎవర్ని ఆమోదించినా, తిరస్కరించినా వాళ్ళ వాదాలనే తప్ప, వ్యక్తులను కాదు. ఆమోదయోగ్యం కాని వాదాలను అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శించారు. ఆమోదించిన వాదాలను కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రస్తావించారు. అందువల్ల పునరుక్తి, పునఃపునరుక్తి తప్పలేదు.

ఈ వ్యాసాలు కదలిక, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఉపాధ్యాయ, వార్త, ప్రజాసాహితి, అరుణతార, ఆంధ్రభూమి, విశాలాంధ్ర పత్రికలలోను, వివిధ గ్రంథాలలోను అచ్చయ్యాయి.

బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం నుంచి రాయలసీమ కల్పనా సాహిత్యం, స్థానిక పదకోశం, పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కడప జిల్లాలోని కవులు, రచయితలపై ‘నెలనెల మన జిల్లా సాహిత్యం’ పేరిట సాహితీ సదస్సులు నిర్వహించారు. వేమన, సీపీ బ్రౌన్‌పై విమర్శనా వ్యాసాలు వెలువరించారు.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయము, ఆంధ్ర విశ్వవిద్యాలయం, మైసూరు విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము, గుల్బర్గా విశ్వవిద్యాలయంతో అనుబంధం ఉంది.

వీరి దీర్ఘకావ్యం “పొలి”ని పి.రమేష్ నారాయణ The Harvest పేరుతో ఆంగ్లంలోనికి అనువదించారు.

ఓ పుష్కర కాలంలో వచ్చిన తెలుగు నవలలు, కథానికల మీద విమర్శనా గ్రంథం ‘మన నవలలు మన కథానికలు’. సంఘ సంస్కరణ, జాతీయ, అభ్యుదయ, విప్లవ, దళిత, బహుజన, స్త్రీ, ప్రాంతీయ అస్తిత్వవాదాలను, ఉద్యమాలను ప్రతిబింబించిన నవలలు, కథలపై సమకాలీన వాస్తవికతతో చేసిన సద్విమర్శ ఇది. రాగద్వేషాలకు అతీతంగా వస్తు వివేచనతో సాగే విమర్శనా పద్ధతికి నిలువుటద్దం ఈ పుస్తకం.

సీమ సాహిత్య మాస పత్రిక సంపాదకునిగా, విద్యార్థి చెకుముకి మాస పత్రిక సంపాదకవర్గం సభ్యునిగా పనిచేశారు.

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులుగా, పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులు గా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా, కోఆర్డినేటర్ గా పనిచేశారు . యూజీసీ పరీక్షల విభాగం డీన్ గా,అకడమిక్ సెనేట్ సభ్యులుగా రెండు సంవత్సరాలు పనిచేశారు.

యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు గా వరకు పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులుగా, ప్రొఫెసర్ గా పని చేశారు.

2011 నుంచి 2017 వరకు కడప సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం బాధ్యతలను నిర్వర్తించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ న్యూఢిల్లీ సభ్యులుగా,తెలుగు సలహా మండలి కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులుగా ,కేంద్ర సాహిత్య అకాడమీ కౌన్సిల్ సభ్యుడిగా పని చేశారు.

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సభ్యులుగా, డిగ్రీ తెలుగు పాఠ్యాంశం ప్రణాళిక నిర్మాణ కమిటీ సభ్యులుగా , తెలుగు పాఠ్య ప్రణాళిక నిర్మాణ కమిటీ సభ్యులు, తెలుగు వాచకం నిర్మాణ కమిటీ ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ సభ్యునిగా కొనసాగారు .

1989 నుంచి 2004 వరకు అనంతపురం జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షుడు గాను, అధ్యక్షుడిగా పని చేశారు. 1994 నుంచి 90 వరకు గుర్రం జాషువా శతజయంతి కమిటీ అధ్యక్షులు .1999 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం లో వివిధ హోదాలలో పనిచేశారు.

2000 నుంచి 2010 వరకు జన విజ్ఞాన వేదిక అనంతపురం జిల్లా శాఖ అధ్యక్షుడు గా కొనసాగారు. జనవిజ్ఞానవేదిక ఆంధ్ర ప్రదేశ్ శాఖ గౌరవాధ్యక్షులు గా పని చేస్తున్నారు .1995 నుంచి 97 వరకు సాహితి మాస పత్రిక సంపాదకుడు .

సీమ సాహితి సాహిత్య సామాజిక మాసపత్రిక నంద్యాల నుండి వెలువడింది. జనవరి 1996లో తొలి సంచిక వెలువడింది బి.పాండురంగా రెడ్డి, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, తుమ్మల రామకృష్ణ సంపాదకులుగా తొలి సంచికలో పేర్కొన్నారు. రెండవ సంచికలో రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన సంపాదకునిగాను, బి.పాండురంగారెడ్డి వర్కింగ్ ఎడిటర్‌గా, మధురాంతకం రాజారాం, జానమద్ది హనుమచ్ఛాస్త్రి, భూమన్ ఇతర సంపాదక సభ్యులుగా పేర్కొనబడింది.

రాయలసీమ ప్రాంతం నుండి వెలువడే సాహిత్యానికి పూర్వవైభవం తీసుకురావడం ఈ పత్రిక ఆశయాలలో ఒకటి. ఈ పత్రిక బళ్ళారి రాఘవపై, విద్వాన్ విశ్వంపై, శ్రీబాగ్ ఒడంబడికపై ప్రత్యేక సంచికలను వెలువరించింది. ఈ పత్రికలో వ్యాస సాహితి, కవితాసీమ, కథా సాహితి, సమీక్షా సాహితి, లేఖా సాహితి మొదలైన శీర్షికలున్నాయి. 1998లో ఈపత్రిక ఆగిపోయింది.

భారతీయ అభ్యుదయ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు .
15 పురస్కారాలు అందుకున్నారు. అరవై గ్రంథాలు ,28 సాహిత్య విమర్శలు ,ఆరు అనువాదాలు ,నాలుగు కవితా సంపుటాలు వెలువడ్డాయి.22 పుస్తకాల ప్రచురణకు సంపాదకత్వ బాధ్యత వహించారు .రెండు పరిశోధనాత్మక పరిశోధన వ్యాసాలు రాశారు. 131 విమర్శ వ్యాసాలు ప్రచురితమయ్యాయి .

పది అనువాద వ్యాసాలు, 8 ఆంగ్ల వ్యాసాలు రాశారు. వివిధ విశ్వవిద్యాలయాలకు, దూర విద్యా కేంద్రాల పాఠ్య రచనలు సుమారుగా 54 పైగా రాశారు. 137 రచనలకు ముందు మాట రచించారు. ఈయన పర్యవేక్షణలో 25 మంది విద్యార్థులు పి.హెచ్.డి, మరో 20 మంది విద్యార్థులు ఎంఫిల్ చేశారు.

1985లో సామాజిక మార్పు -తెలుగు కథానికల్లో స్త్రీ (1950), 1996లో భారత జాతీయోద్యమం- తెలుగు, తమిళ ,కన్నడ నవల తులనాత్మక అధ్యయనం అనే రెండు యూజీసీ పరిశోధన ప్రాజెక్టులు చేపట్టారు.

పుట్టపర్తి నారాయణాచార్యుల తో , డాక్టర్ జి వి చలపతి జానమద్ది హనుమచ్ఛాస్త్రి, కొలకలూరి ఇనాక్ లతో ఆకాశవాణిలో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించారు.

ఈయన రచించిన సాహిత్యం మీద 9 మంది పి.హెచ్.డి విద్యార్థులు పరిశోధనలు చేశారు.104 దాకా జాతీయ రాష్ట్రీయ సదస్సులకు హాజరయ్యారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి తెలుగు శాఖ నందు, వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ప్రత్యేక ఉపన్యాసాలు చేశారు.

ఈయన పై రెండు ప్రత్యేక సంచికలు విడుదల చేశారు. 2008లో రాచపాళీయం గౌరవసంపాదకులు అనే సంచిక,2012లో
40 ఏళ్ల సాహిత్య విమర్శలో రాచపాళీయం సంచికను విడుదల చేసింది.

వీరి రచనల్లో కొన్ని
శిల్పప్రభావతి – ప్రభావతీప్రద్యుమ్నము కావ్యం పై విమర్శ (పి.హెచ్.డి.సిద్ధాంతగ్రంథము)
కథాంశం,చర్చ,కొన్ని కావ్యాలు – కొందరు కవులు,దరి/దాపు
దీపధారి గురజాడ,మన నవలలు-మన కథానికలు,
రెండు ప్రపంచాలు (కవితా సంపుటి),
సాహిత్య పరిశోధన సూత్రాలు (హెచ్.ఎస్.బ్రహ్మానందతో కలిసి),వేమన,విమర్శ -2009,
పొలి (దీర్ఘకవిత),
గురజాడ – తెలుగు కథానిక,
గురజాడ – మన విమర్శకులు,
మహర్షి దేవేంద్రనాథ టాగూర్ (మోనోగ్రాఫ్ అనువాదం)
రాచపాళ్యం ఓ అభ్యుదయవాది. ఈయనకు అనేక సంస్థలు వ్యక్తులు బిరుదులతో సన్మానం చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఇది ఆయన భావజాలానికి ఓ నిదర్శనం. చాలా చాలా నిరాడంబరుడు.

2007లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం ,2008లో
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సాహితీ విమర్శ పురస్కారం
2014 లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం 2000లో కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం అందుకొన్నారు.

న్యూఢిల్లీ సాహిత్య అకాడమి నుంచి2010 ఆగస్టు10న ‘విమర్శకుని తో ఓ సాయంకాలం’ పేరిట అరుదైన ఓ గౌరవం పొందారు.

చిత్తూరు జిల్లా వడమాలపేట సమీపంలోని తిరుమన్యం గ్రామానికి చెందిన చెంచమ్మ పట్టాభి రెడ్డి కుమార్తె లక్ష్మీ కాంతమ్మతో 1974 జూలై 11న రాచపాళ్యం చంద్రశేఖర్ రెడ్డి కిపెండ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు శ్రీవిద్య బి.ఏ,బిఇడి చేశారు. కుమారుడు ఆనందకుమార్‌ యం.సి.ఏ , బి.యల్ చేశారు. రాచపాళెం సిద్ధాంతాలు చెప్పడం వరకే కాదు ఆచరణలో చూపించారు.సుధా లావణ్య తో కొడుకు మతాంతర వివాహం,కూతురు శ్రీవిద్య కు నారాయణ స్వామితో కులాంతర వివాహం చేశారు.

ఆ తల్లి చలువే సాహితీవేత్త అయ్యారు.
మద్య తరగతిరైతు కుటుంబం వీరిది. రెండేళ్ల ప్రాయంలోనే తల్లి చనిపోయారు. తండ్రి రాజమ్మ ను పెళ్లి చేసుకొన్నారు. పిన్ని వీరిని పెంచారు. వయసొచ్చేకొద్దీ నిత్యమూ పొలం పనులు చూసుకుని పాఠశాలకు, కళాశాలకు వెళ్లాల్సి వచ్చేది. యూనివర్శిటీ చేరినా ప్రతి రోజూ ఆరు కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లే వారు

పీయూసీ తరువాత చదువు వద్దు ఇంటి దగ్గరే ఉండి పెళ్లి చేసుకొని,సేద్యంచూసుకోమని చేదోడువాదోడుగా ఉండమని తండ్రి అన్నారు.సేద్యం చేయమని పట్టుబట్టాడు. చదువుకోవాలని ఎంత చెప్పినా వినిపించుకోలేదు.
ఉన్నత చదువులపై ఆశ వదులుకొనే పరిస్థితి ఏర్పడింది.

అప్పటికే తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్ కళాశాలలో బీయస్సీ సైన్స్ కోసం, ఎస్వీ యూనివర్సిటీ స్పెషల్ తెలుగు కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెండు చోట్లా సీటు వచ్చింది. కానీ ఇంట్లో మాత్రం చదువు వద్దన్నారు.
ఈ పరిస్థితులలో దేవతలా పినతల్లి రాజమ్మ ఆదుకుంది

ఆ తల్లే లేకుంటే చదువు లేదు.సాహిత్యం లేదు. బిడ్డ చదువుకుంటానంటే సేద్యం అంటావేంటి అంటూ భర్తను ఓప్పించేందుకు గట్టి ప్రయత్నాలే చేసింది.

సేద్యం ఇబ్బందిగా ఉంది తోడుగా ఉంటాడు అని తన అవసరాలను చెప్పగా ఆమే ఆ సమయంలో నీకేందుకు బాబయ్య సేద్యం పనులుచూసుకొంటారు. నేను చూసుకుంటా అంటూ ఆమే నచ్చజెప్పింది. ఇంట్లో నౌకరుగా పనిచేస్తున్న మాలపెద్దాయన బాబయ్య కూడా ఒప్పించడం తో తండ్రి ఒప్పుకున్నాడు.పినతల్లి ఆయనను కళాళాలకు పంపింది.ఆ తల్లి చల్లని దీవెనల వల్ల ఇంతటిమహోన్నతమైన సాహితీవేత్త మనకు లభించారు. రాజమ్మ లాంటి మహా తల్లులు ఉండడం వల్లనే స్త్రీ జాతికి గౌరవం దక్కుతున్నది. నిగర్వి నిరాడంబరుడు నిబద్ధత కలిగిన సాహితీవేత్త రాచపాళ్యం చంద్రశేఖరరెడ్డి. ప్రస్తుతం వీరు అనంతపురం లో నివసిస్తున్నారు.💐🙏

సేకరణ:– చందమూరి నరసింహారెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s