
తిరుమల , కంచితో ఒకనాడు సమానం గానూ, దక్షిణ కాశిగానూ ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ విద్యారణ్యస్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్టించినారు.
కడప నుండి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క దారి చీలిపోతుంది. ఆ మార్గంలో పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని ‘మధ్య అహోబిలం’ అనీ, శైవులు దీనిని ‘మధ్య కైలాసం’ అనీ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇదొక్కటే ఆది శంకరులచే ఆంధ్ర దేశాన స్థాపించబడిన శంకరాచార్య మఠం. ఈ క్షేత్ర చరిత్ర చాలా ప్రాచీనమైంది. శ్రీశైలఖండంలో, స్కాంద పురాణంలో, సత్యనాధుని రసరత్నాకరంలో, పుష్పగిరి గురించి ఎన్నో విశేషాలుఉన్నాయి. ఇక్ష్వాకుల వారి శాసనాలలో శ్రీశైలానికి దక్షిణ ద్వారంగా ఈ క్షేత్రాన్ని పేర్కొన్నారు.
