pulikanti krishanareddy

జీవితానుభవాలను రంగరించి సీమమాండలికంలో అక్షరాలను శివతాండవం ఆడిచించిన కవిశేఖరుడు. కరవు సీమలో అనునిత్యం సాహిత్య పంటను పండించిన కృషీవలుడతడు. తన గళంలో జానపదుల అందెలు మోగించి సామాన్యుల హృదయాల్లో తనదైన ముద్రవేసుకొన్న సీమ చిన్నోడు. చిత్తూరు నుంచి చికాగో వరకు సీమ మాండలికంతో సాహిత్య రసజ్ఞుల హృదయాలను దోచుకొన్న సాహితీ పిపాసి పులికంటి కృష్ణారెడ్డి.
రాయలసీమ మాండలికంలో వినూత్న ప్రయోగాలు చేసిన వ్యక్తి కృష్ణారెడ్డి. ఈయన రచనలపై పరిశోధనలు చేసి నలుగురు పి హెచ్ డి, ముగ్గురు ఎంఫిల్ పట్టా పొందారు.

సంఘ సంస్కర్త ప్రజా కవి యోగి వేమన బాటలోనే పులికంటి కృష్ణారెడ్డి కూడా సూటిగా సమాజాన్ని ప్రశ్నిస్తూ చైతన్యం కలిగిస్తూ పద్యాలు ఐదుశతకాలు రచించారు. వేమన పద్యాలు మకుటం విశ్వదాభిరామ వినురవేమ అయితే పులికంటి కృష్ణారెడ్డి శతక పద్యాలలో మకుటం “కంటి నలుసు రా పులికంటి మాట”.

పులికంటి కృష్ణారెడ్డి 1931, జూలై 30 న చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జక్కిదోన గ్రామంలో జన్మించాడు. తండ్రి పులికంటి గోవిందరెడ్డి, తల్లి పాపమ్మ . ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం జక్కిదోనలోనే సాగింది. తిరుపతిలోని దేవస్థానం హిందూ ఉన్నత పాఠశాల ఉన్నతపాఠశాల విద్య సాగించారు. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రైల్వే ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 13 సంవత్సరాలపాటు భారతీయ రైల్వేలో ఉద్యోగం చేసిన ఆయన నాటకాల మీద మక్కువతో రాజీనామా చేశారు. రాజీనామా చేసేనాటికి ఆయన అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్. రాజీనామా చేసి తిరుపతి లో కాఫీపొడి దుకాణం ప్రారంభించారు. వ్యాపారం నిర్వహిస్తూ సాహిత్యం కొనసాగించారు.

తిరుపతి కేంద్రంగాచేసుకొని
కామధేను సాహిత్య పక్షపత్రికకు సంపాదకత్వం
నిర్వహిస్తూ పత్రిక నడిపారు. ఆంధ్రభూమి పత్రికలో ఉద్యోగం చేశాడు.

చెరకు రసము కన్న చెలియ మాట కన్న
తేనెచినుకు పాట తేట కన్న
పెదవి తీపికన్న పదవి తీపిర మిన్న
కంటి నలుసుర పులికంటి మాట!
——***——
కూడు గూడు లేక కుములుచు మనవచ్చు
కొన్ని దినములైన కోర్కె లుడిగి పదవి లేని క్షణము ప్రాణాలె నిలువవు
కంటి నలుసుర పులికంటి మాట!

ఇలాంటి పద్యాలుతో ప్రజాచైతన్యం కోసం కృషి చేశారు. నాటకాలు వ్రాయడంలో, వేషాలు వేయడంలో ఇతని గురువు నాగేశం కాగా కవిత్వంలో ఓనమాలు నేర్పింది చేబ్రోలు సుబ్రహ్మణ్యశర్మ.1958లో రచించిన ఆదర్శం నాటకం వీరికి మంచి పేరుతెచ్చాయి.

పులికంటి గారు పద్యకవిగా ప్రసిద్ధులు కాదు .నటుడుగా, నాటక రచయితగా, సంగీత రూపకర్తగా, గేయకవిగా,
కథా రచయితగా, వ్యాస రచయితగా, మాండలిక భాషా ప్రవీణుడుగా, బుర్ర కథకుడిగా ఆకాశమంత ఎత్తు ఎదిగిన సాహితీ మూర్తిగా పులికంటి ప్రసిద్ధి చెందారు. ఈయన బుర్రకథలు ప్రజల హృదయాలలో చెరగని ముద్ర ముద్రవేసుకొన్నాయి. సాంప్రదాయ కవిత్వం రాశారు. పులికంటి శతకాలు కు తగినంత ప్రచారం రాలేదు.
బెల్లంకొండ రామదాసు రచించిన ‘పునర్జన్మ’ నాటకంలో వృద్ధుడి పాత్ర ధరించారు. దాంతో ఆయన నటజీవితం ప్రారంభమైంది.
కృష్ణారెడ్డి బాశాలి పాత్ర ద్వారా కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో భార్య పాత్ర ఎంతో ఉదాత్తంగా ఉంటుందో వివరించారు. నాటకరచయితగా రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ మెప్పును పొందాడు. తిరుపతి లలిత కళా సమితి నాటికల పోటీలలో ఎన్నోసార్లు పాల్గొని బహుమతులు పొందాడు. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ఇతడిని నటనాగ్రేసరుడు అని కొనియాడాడు.

దుర్యోధనుడు, తిమ్మరుసు, పఠాన్ రుస్తుంగా ఇంకా ఇంకా సాంఘిక నాటక పాత్రధారిగా ఎన్నో పురస్కారాలు పొందిన నటుడు పులికంటి. “మేకలు! మీకు కొమ్ములు న్నాయ్” వంటి నాటికలను చూచినవారు మర్చిపోగలరా? “సూర్యుడు ఉదయించడు” వంటి సంగీత రూపకాల సంగతి చెప్పేదేముంది? ‘మోసులు ఎండిపోతున్నాయి’ వంటి కథలు గుండెలు జలదరింపచేస్తాయి. ఇకమాండలిక భాషా రచనల్లో మకుటంలేని మహారాజు పులికంటి. ఇతడు బుర్రకథ గాయకుడు కూడా. కమ్మని గానంతో,చమత్కారవ్యాఖ్యానంతో సాగే ఇతని బుర్రకథలను విని మధురాంతకం రాజారాం వంటి ప్రసిద్ధులు పరవశించి ఇతడిని పొగడ్తలతో ముంచెత్తారు. నటుడిగా పలువురి ప్రశంసలు అందుకున్నారు.

రచనా వ్యాసంగం పట్ల అమితమైన ఆసక్తి ఉండేది.
ప్రత్యేకంగా ‘కథా సాహిత్యం’పై దృష్టి సారించారు. రాయలసీమ మాండలిక మాంత్రికుడు. ఈయన 1960లో రాసిన మొదటి కథ ‘గూడు కోసం గువ్వలు’. ఈయన రాసిన ‘గోరంత దీపాలు’ పాఠ్యాంశంగా తీసుకోవడం జరిగింది.

ఆంధ్రప్రభలో సంవత్సరం పాటు నాలుగు కాళ్ల మండపం కాలం నిర్వహించారు. ఇది తిరుపతి పరిసర ప్రాంతాల జీవితాలను కళ్లకుకడుతుంది. ముఖ్యంగా రైతుసమస్యలు, నీటి ఎద్దడి, ఓట్లు, రాజకీయాలు ఇలా అన్ని సమస్యలు వీరి రచనల్లో కనిపిస్తాయి. కృష్ణారెడ్డి తన చుట్టూ ఉన్న సమాజాన్ని అధ్యయనం చేసి, వాటినే రచనల్లో చెప్పేవారు. కృష్ణారెడ్డి రచనలు ఎక్కువభాగం ఆకాశవాణి, టీవీలలో ప్రసారం అయ్యాయి.

దళితుల చైతన్యం కోసం పరితపించిన రచయిత గా గుర్తింపు పొందారు.దళితులు సామాన్య జీవన స్రవంతికి దూరంగా ఉన్నారని బాధపడేవారు. వారిని అక్కున చేర్చుకునే విధంగా, వారిమనోభావాలతో కథలు రాశారు. ఆయన భావాలన్నీ ప్రగతి శీలాలు .అందరికి దూరమై పోయిన దళితులను అక్కున చేర్చుకొన్నారు .వారి మనోభావాలను వారు కూడా చెప్పలేనంత సహజంగా తన కవిత్వంలో ,కధల్లో చెప్పి అనితర సాధ్యమనిపించారు.
కోటిగాడు స్వతంత్రుడు, పులికంటి కథలు ఇలాంటివే.

రాయలసీమ భాషను, ప్రజల దైనందిన జీవితాలను తొలినాళ్లలో గ్రంథస్తం చేసిన వారిలో కృష్ణారెడ్డి ఒకరు. రాయలసీమ భాషకు కావ్యగౌరవం కల్పించిన మహానుభావుడు.వచనాన్ని, పద్యాన్ని, జానపద కథారీతుల్ని అలవోకగా రాయగల సాహితీవేత్త పులికంటి కృష్ణారెడ్డి.

రాయలసీమ చిన్నోణ్ణి… రాళ్ల మద్దె బతికేవాణ్ణి… రాగాలే ఎరగక పోయినా… అనురాగానికి అందేవాణ్ణి..’ అంటూ సీమ చిన్నోడిగా అందరిచేత పిలిపించుకున్న రాయలసీమ రావిశాస్త్రి పులికంటి కృష్ణారెడ్డి. సీమ ప్రజల కష్టాలను, కండగండ్లను, కరువును, వలసలను తన కథల్లో
సహజాతి సహజంగా చిత్రించిన అరుదైన కథకుడు పులికంటి. ఈయన 200 కథలు, 60లలిత గేయాలు, 5 దృశ్య నాటికలు, 6 శ్రావ్య నాటికలు 43 అమ్మిపదాలు రాశారు. 14 కధలు ఉత్తమ కధలు గాఎన్నికైనాయి. వీరి కథలు ఇంగ్లీష్ , తమిళం, మలయాళం ,హిందీ ,కన్నడ భాషలోకి అనువదించబడ్డాయి.
నండూరి సుబ్బారావు ఎంకి పాటల తర్వాత అంతటి వస్తుశిల్ప శోభితమైన పాటలు పులికంటి వారి అమ్మిపదాలే.
ఆట వెలదులతోట, గోయిందా గోయిందా, పులికంటి కథావాహిని వంటి గ్రంథాలెన్నో వెలువరించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశానుసారం 100కుపైగా బుర్రకథలు రాశారు. వీటిలో వయోజన విద్య, వనమహోత్సవాలు, కుటుంబనియంత్రన వంటి ఎన్నో సామాజికాంశలే మనకు కనిపిస్తాయి. కృష్ణారెడ్డి కథ రాసినా, గేయం రాసినా, బుర్రకథ రాసినా రాయలసీమ ప్రజల వ్యధాభరిత జీవితం ఉంటుంది.

ఐదు దశాబ్దాలు మాండలిక పరిభాషలో జనజీవనాన్ని కళ్లకు కట్టారు. సీమ జీవితాల శిథిల ఘోషను తన సాహిత్యంలో ఏర్చి కూర్చారు.
కరువు ,కాటకాలు నీటి ఎద్దడి,వలసలు,దరిద్రం తాండవం చేస్తున్న సీమ దర్శనమిస్తాది .గుక్క నీటి కోసం కిలోమీటర్లు కిలో మీటర్లు నడిచి వెళ్ళాల్సిన దుస్థితి. రాయలసీమ జీవన గతిని ‘పులికంటి కృష్ణా రెడ్డి’.కథా సాహిత్యం లో ప్రతిబింబించారు.

‘’రాయల సీమ రా.వి.శాస్త్రి అని సీనియర్ పాత్రికేయులు , సంపాదకులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు కితాబిచ్చారు.

‘పులికంటి సాహితీ సంత్కృతి’ స్థాపించి ఎందరో సాహితీ మూర్తులను సత్కరించారు.
ఆకాశవాణి, దూరదర్శన్ లలో ఆడిషన్ కమిటీ సభ్యులుగా, సలహాదారుగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఫెర్ ఫామింగ్ గా కూడా పనిచేశారు. వీరికి ఎన్నో పురస్కారాలు, బహుమతులు వచ్చాయి. అగ్గిపుల్ల నవలకు చక్రపాణి అవార్డు వచ్చింది. నటులుగా ఎన్నో సత్కారాలు పొందారు. యువకళావాహిని వారి గోపీచంద్ అవార్డు లబించింది.2005లో ఎస్వీయు గౌరవ డాక్టరేటు తో సత్కరించింది. ఇంకా జానపదకోకిల, ధర్మనిధి పురస్కారాలు వంటివి ఎన్నో వచ్చాయి.

‘నిండుగా, కండగా, కవితల కలకండ’ అంటూ నారాయణరెడ్డి, ‘ప్రణయార్థ మెరిగిన భావకుడతడంటూ’ శంకరంబాడి పొగిడినా.. ‘రాయలసీమ చిన్నోడు’గా అందరి గుండెల్లో నిలిచిన సాహితీ తపస్వి పులికంటి కృష్ణారెడ్డి 2007నవంబర్ 19 న మరణించారు. వీరి భార్య పేరు సుదేష్ణా దేవి. వీరికి
ఒక కుమారుడు, 5 కుమార్తెలు.

సేకరణ :– చందమూరి నరసింహారెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s