పిళ్లా కుమారస్వామి అనంతపురం జిల్లాలో ఒక సాహితీ యాక్టివిస్ట్.సాహితీ స్రవంతి బాధ్యులు. అనంతపురం జిల్లాలో సాహితీ సంస్థలు అధికమై,రచయితలు గత కొంతకాలంగా ఎవరికి వాళ్ళుగా ఉంటున్న నేపథ్యంలో,కుమారస్వామి తనదైన పద్ధతిలో జనాన్ని సమీకరించుకొని ప్రజాసాహిత్యకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతినెలా అనంతపురంలో ఒక కార్యక్రమం

నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేగాక కుమారస్వామి చాలా కుదురుగా తన రచనావ్యాసంగాన్ని కూడా కొనసాగిస్తున్నారు. కుమారస్వామి వామపక్షవాది. అభ్యుదయసాహితీపరుడు.

అందువల్ల ఆయన సాహిత్యం అభ్యుదయ సాహిత్యంలో అంతర్భాగం.కుమారస్వామి రచించిన 50 కవితలు రాయలసీమ ప్రాంత కరువు,వ్యవసాయం, రైతు, ప్రజల వలసలకు చెందినవి. కొన్ని స్త్రీ, దళిత సమస్యలమీద రాసినవి. కొన్ని రాజకీయ కవితలు కూడా ఉన్నాయి. కవిత్వంభాషల పైన నాలుగైదు కవితలు రాశారు.
‘సహజసూత్రం’ అనే కవిత కుమారస్వామి భౌతిక భావజాలానికి చెందినది. ఆ కవిత చదివితే శ్రీశ్రీ కవిత ‘మానవుడా’లోని ఎత్తుగడ గుర్తు కొస్తుంది. మనం నివసించే ప్రకృతి ఎలా ఆవిర్భవించింది అనే ప్రశ్నకు భావవాదపురాణాలు పరమాత్మ సంకల్పంలోంచి ప్రకృతి పుట్టింది అని చెబుతాయి. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రాలు పరమాణువు సంకల్పంలో ప్రకృతి ఆవిర్భవించింది అని చెబుతాయి. ఈ కవితలో కుమారస్వామి వైజ్ఞానిక శాస్త్రాల వైపుమొగ్గి తన భౌతిక దృక్పథాన్ని చాటుకున్నారు.
“జీవకోటి ఇతిహాసంలో
హోమోసెపియన్ నిలుచున్నాడు మానవుడై”
అని మనిషి పుట్టుకను శాస్త్రీయంగా పేర్కొన్నాడు.
కవిత్వం, భాష వంటి అంశాల మీద కూడా కుమార స్వామికి బలమైన అభిప్రాయాలున్నాయి. సాహిత్యం మానవ సంస్కారాన్ని పెంచుతుందని, భాష మనిషి ఉన్నతున్ని చేస్తుందని ఆయన ‘కొత్త రూపం’ కవితలో అభిప్రాయ పడ్డారు.
‘సంఘర్షణ ఇంధనంగా మారి
నాకవిత్వాన్ని నడిపిస్తోంది’
అని తన కవిత్వ వస్తువును నిర్వచించుకున్నాడు కవి. సంఘర్షణ అంటే వర్గాల మధ్య, వర్ణాల మధ్య, మతాల మధ్య, జండర్ల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, విశ్వాసాల మధ్య, ఆచారాల మధ్య, ఆలోచనల మధ్య,సారాంశంలో మానవ సంబంధాల మధ్య సంఘర్షణే సాహిత్య వస్తువు.
ఇది తనకుండిన అభ్యుదయ చింతన. కుమారస్వామి తన కవిత్వం వర్గసంఘర్షణకు ప్రతిఫలమని ప్రకటించారు. తనది ‘మార్పుగీతం’ అని కూడా అన్నారు. సమాజ పరివర్తన తన కవిత్వ లక్ష్యమని అర్థం.
అభిప్రాయ ప్రకటన భాషకున్న ఏకైక ప్రయోజనం.దీనికే కుమారస్వామి ‘పలుకుల శిల్పం’ కవితలో ఉదాత్తంగా చెప్పారు.
“భాష ఒకర్ని మరొకరిలోకి ప్రవహింపజేస్తుంది” అనడం సృజనాత్మకంగా ఉంది. అక్షరం అంటే నాశనం కానిది, చావు లేనిది అని అర్థం.కుమారస్వామి అక్షరం ఔన్యత్యాన్ని అనేక విధాలుగా వర్ణించారు ‘అక్షరం’ కవితలో. అందులో ‘అక్షరం ప్రజాసమూహాలుగా మారుతుంది” అనే వాక్యం చాలా ముఖ్యమైంది.
రాయలసీమ అస్తిత్వం ఈ కవితలలో ప్రధాన వస్తువు. అనంతపురం, ఒంటరి పక్షి, కోయిలపాటకోసం, మట్టిపోగు, నెర్రెలు బారిన చెరువు వంటి కవితలలో కుమారస్వామి సీమ గుండెచప్పుళ్ళను వినిపించారు.కరువువల్ల, వర్షం ఎండి నెర్రెలు బారిన చెరువు రూపాన్ని కవి వర్ణించాడు.
“ఎండిన చెరువు ముందు నిలబడి చూస్తే
విరిగిన నాగలి యోధుని నిలువెత్తు జీవితం
కనిపిస్తోంది”
రైతులకు చెరువుకు గల సంబంధం ఈ వాక్యంలో ఆర్థ్యంగా ధ్వనిస్తున్నది. వ్యవసాయం అనగానే భూమిగలిగిన రైతు గుర్తుకొస్తాడు చాలామందికి. నిజానికి వ్యవసాయం రైతు, వ్యవసాయ వృత్తి దారులు, కూలీలు ముగ్గురిదే. కుమారస్వామికి ఈ విశాలజ్ఞానం ఉంది. అందుకే ఆయన
రైతుతో పాటు తక్కిన వాళ్ళనూ కలిపారు.ఇప్పుడు చెరువు
తెగిపడిపోయినా పడుగులా రోదిస్తోంది.మూగవోయిన మాదిగ డప్పులా మూలన పడి ఉంది.
కరువు వల్లగాని, ప్రపంచీకరణవల్లగాని నాశన మయ్యింది పల్లెలే.నీటికరువు పల్లె ప్రజల్ని వలస పంపింది. ప్రపంచీకరణ పల్లె వృత్తుల్ని నాశనం చేసి, పల్లెల్ని ధ్వంసం చేసింది. అందుకే కుమారస్వామి “పల్లె ఇప్పుడు ఒంటరి పక్షి” అన్నాడు. పనులు లేక తిండి లేక పనులు చేయగలిగినవాళ్ళు పట్టణాలకు వలసపోతే, మిగిలిపోయిన వృద్ధుల పట్ల సానుభూతితో’ ఒంటరి పక్షి’ కవిత రాసారు కుమారస్వామి.
మార్కిస్ట్ కవి సాధారణంగా ప్రపంచీకరణను సమర్ధించడు. అది చేసే మంచికన్నా చెడే ఎక్కువ అన్నది మార్క్సిస్ట్ అవగాహన.
శ్వేత సర్పపుపడగనీడ
మైదానమంతా వ్యాపించి
మట్టి మట్టిని వేరు చేస్తోంది
ఆదుకోవాల్సిన పెద్దదిక్కు
పడమట తిరిగి సాష్టాంగ నమస్కారం చేస్తోంది
అని పెట్టుబడిదారులు, వాటికి దాసోహమనే భారతీయ పాలక వర్గాలస్వభావాలను ఆవిష్కరించారు కవి ‘తడిలేని నేల’లో.
సంప్రదాయం స్త్రీని మాటలలో పూజిస్తుంది. చేతలలో చులకన చేస్తుంది. మార్క్సిజం, అంబేద్కరిజం, ఫెమినిజం మనిషిగా గౌరవిస్తాయి.కుమారస్వామి స్త్రీని శ్రామిక దృష్టికోణం నుండి ఆవిష్కరిస్తూ
“నాశ్రమ లేని మగవాని జీవితం
ఆకులు రాలిన హేమంతం’ అన్నారు ‘జీవనవాహిని’ కవితలో.
అసమానతలతో పాటు, వివక్షలను కూడాఅభ్యుదయ రచయిత ధిక్కరిస్తాడు. ఏ కులం వారైనా మార్క్సిజం తలకెక్కించు కున్నవాళ్ళు దళిత జీవిత వేదనను చిత్రీకరించక మానరు. కుమారస్వామి ‘నగారా’ కవితలో దళిత జీవితాన్ని ఉత్తమపురుష దృష్టి కోణంలోఆవిష్కరించారు.
“నాకన్నీరు సమాజాన్ని కడగడానికి ఏరులైపాడింది” అన్నది అర్థమైన చిత్రణ.
“నేను టీతాగేచోట
రెండు గ్లాసులు విభజన రేఖలా నిలిచినపుడు
గాయపడిన మనసు
ఊహకందని భాషతో పరితపించింది”
యుగయుగాల దళితవేదనకు ఈ వాక్యం అద్దంపట్టిన రూపం.
మార్క్సిస్ట్ కవి సమస్యల ఆవిష్కరణకు కించిత్ వ్యాఖ్యలకు పరిమితం కారాదు. “అయితే ఏం చేద్దాం?” అనే ప్రశ్నకు సమాధానం కూడా చెప్పాలి. ఏ పద్ధతిలో చెప్పాలో అది కవి ఇష్టం. చెప్పడం మాత్రం తప్పదు. కుమారస్వామి కార్మికుల పక్షాన పని చేసిన వ్యక్తి. ఆ చైతన్యం ఆయన కవిత్వంలో
కనిపిస్తుంది.
“ఇక్కడ వేసిన ప్రశ్న
భూమండలమంతా విస్తరించి
పెను తుఫానుగా మారుతుంది” (నీడలేని నేల)
“ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న
వెలుగు రేఖలు నదులుగా మారి
మట్టిని ముద్దాడి
పిడికిళ్ళుగా విస్తరిస్తున్నాయి” (కోయిలపాట కోసం)
నాకిప్పుప్పడేది మార్గం
పోరాటాల జండా పట్టుకోవడం తప్ప” (స్వర్గసీమ)
“నీ మేధ సముద్రమై పోటెత్తితే
శిరసువంచుతుంది రాజ్యాధికారం” (జీవనవాహిణి)
“నేను కళ్లు విప్పార్చిన క్షణాన
కొండచిలువ పరుగుతీయకమానదు” (కార్పొరేట్ స్తూపం)
కుమారస్వామికి స్పష్టమైన తాత్వికభావజాలముంది. నిర్ధిష్టమైన ప్రాపంచిక దృక్పథంతో సిద్ధాంతబలంగలిగిన కవి. వాక్కు నిర్ధిష్టంగా ఉంటుంది. ఇంకా సిద్ధాంతాలను రాద్దాంతా లుగా భావించే తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గుర్తించవలసింది వాళ్ళకూ సిద్ధాంతాలు ఉన్నాయని.
కుమారస్వామి కవిత్వం చదివైనా సిద్ధాంత ద్వేషులు, దానిని వదులుకొని, తమ సిద్ధాంత మేదో ప్రకటించుకోవాలి.
సాహిత్యం, జీవితంలోంచిపుడుతుంది. జీవితం సిద్ధాంత రహితంగా ఉండదు. అందువల్ల సాహిత్యంకూడా సిద్ధాంత రహితంగా ఉండదు. తన కవిత్వాన్ని పుస్తకంగా ప్రకటిస్తున్న కుమారస్వామికి అభినందనలు.

“A Work of art is expressive when it conveys more thanit represents”
–Y. Khochinkyon
(Essay on the question of expressiveness thing and representativeness in Marxist Leninist aesthetics and life p112)
“The artist Pronounces aesthetic values which are at the same time ideological values”
— Yu.A. Lukin
(Essay on ideology and art in Marxist Leninist Aesthetics and Art p. 108).

__ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ కౌన్సిల్ సభ్యులు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s