“మీ గుండెల్లో ఎక్కడైనా/ చీమ కనుగుడ్డంత కారుణ్యముంటే/ మాక్కొంచెం తడినివ్వండి/ మా పొలాల గుండె గదుల్లోంచి/ కావల్సినన్ని గింజలు తోడి పోయకుంటే అప్పుడడగండి” అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరిన యాముల నర్సిరెడ్డి సోమందేపల్లి మండలంలోని చాకర్లపల్లి లో యాములసుశీలమ్మ , చక్కీ రప్ప దంపతులకు జూన్ 11న 1976 లో జన్మించారు.
తండ్రి చక్కీరప్ప టీచర్ గా పనిచేసేవారు. అయినప్పటికీ ఆయన ఉదార స్వభావం వల్ల, వ్యవసాయానికి అధికంగా ఖర్చు చేయడం వల్ల నర్సిరెడ్డి చదువు అనేక కష్టాలకడలిలో సాగింది.చాకర్లపల్లి లో ప్రాథమిక విద్యను,హైస్కూలు విద్యను సోమందేపల్లి లో పూర్తి చేశారు. తర్వాత చదువు మానేసి వ్యవసాయం చూసుకుంటూ ఉండేవారు. తండ్రి అనారోగ్యంతో మరణించడంతో నర్సి రెడ్డికి జూనియర్ సహాయకునిగా 2003లో హంద్రీనీవా సుజల స్రవంతి కార్యాలయంలో నియామకం జరిగింది. ఆ తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయంలో దూర విద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశారు.
వ్యవసాయం లో ఉన్న ఆటుపోట్లను, అందులో కష్టాలలో తను చూసిన నర్సిరెడ్డి తన చిన్నతనం నుండి ఆసక్తి ఉన్న సాహిత్య రంగం లోకి ప్రవేశించాడు.

2010లో తను రాసిన “ఊరు పక్కన ఏరు” కవిత ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. అది పలువురి ప్రశంసలు పొందింది. దాంతో ఉత్సాహంగా నిరంతరంగా కవితలు రాయడం మొదలుపెట్టాడు. వాటికి వివిధ సంస్థలు పురస్కారాలు బహుమతులు వచ్చాయి. తర్వాత ఆ కవితలన్నింటినీ “మన్నే మాతరం” పేరుతో ఒక కవితా సంపుటిని వెలువరించారు. అదే సందర్భంలో వ్యవసాయం రైతుకు సంబంధించి ఒక దీర్ఘ కవిత “వొరుప్పోటు”కూడా వెలువరించారు .
2014 నుంచి కథలు రాయడం కూడా ప్రారంభించారు .దాదాపు 20 కథలు రాశారు. వాటిని కూడా ఒక సంపుటిగా వెలువరించేందుకు ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు.
కవిత్వం,కథలే కాకుండా నటనాకౌశలంలో కూడా నర్సిరెడ్డికుంది. 2012లో జరిగిన ప్రపంచ మహాసభల సందర్భంగా ఏకపాత్రాభినయం లో పాల్గొని ప్రశంసలు పొందారు. శ్రీకృష్ణ దేవరాయ పట్టాభిషేక ఉత్సవాలు వివిధ క్షేత్రాలలో కూడా ఆయన ప్రదర్శనలు ఇచ్చారు. 2013లో నీటిపారుదల శాఖ హైదరాబాదు జలసౌధలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీల్లో సినీనటులు సంపత్ రాజు, సమ్మెట గాంధీ న్యాయనిర్ణేతగా వ్యవహరించి ఆయనకు బంగారు పతకాన్ని బహూకరించారు. యాముల నర్సింహారెడ్డి సాహితీరంగంలో తన ప్రతిభ ద్వారా అనేక పురస్కారాలు పొందారు.గుంటూరు వారి ఆంధ్రప్రదేశ్ గోల్డ్ కింగ్ పురస్కారం ,2013 లో స్పందన అనంత కవుల వేదిక వారి పురస్కారం ,2014లో జి ఆర్ ఫౌండేషన్ పురస్కారం, రంజని కుందుర్తి పురస్కారం, కర్నూలు కళా స్రవంతి సాహితీ పురస్కారం ,నెల్లూరు వారి సృజన సాహితీ పురస్కారం, 2015 ,2016 ఎక్స్ రే పురస్కారం, శ్రీకాకుళం జనజాగృతి సాహితీ పురస్కారం, సాహితీ కిరణం మాసపత్రిక ఉగాది పురస్కారం, మల్లెతీగ ఆత్మీయ పురస్కారం ఇలా అనేక పురస్కారాలు పొందారు.వివిధ సంస్థలు నిర్వహించిన పోటీల్లో కూడా బహుమతులు కూడా సాధించారు.

ప్రజల తరఫున నిలబడిన కవి సమాజంలో జరిగే సంక్షుభిత
సమయాల్ని ఉరకే చూస్తూ కూర్చోడు. పరిస్థితులు మారాలని,సమాజంలో
జరిగ్ సంక్షోభాన్ని మార్చాలని తను కోరుకుంటాడు. ముఖ్యంగా
రాయలసీమ కవికి కనిపించేదంతా కరువునేలే.అందు వల్లనే కరువు కబంధ హస్తాలలో
నలిగిపోతున్న రైతులపట్ల నిజాయితీగా తన గొంతును సవరించుకొని
మన్నేమాతరం కవితా సంపుటిని వెలువరించాడు యాములపల్లి నర్సిరెడ్డి.
చాలా మంది సాహితీ విమర్శకులు గుర్తించినట్లు రాయలసీమలో
మంచి బలమైన కవిత్వం ఒక తాత్విక ధారగా వెలువడలేదు. కథలంత
బలంగా కవిత్వం తనదైన ముద్రను ఇంకా వేయాల్సి ఉంది. ఈ దిశగా
నరిసిరెడ్డి తన ‘మన్నేమాతరం’ కవితా సంపుటిని వెలువరించాడు. ఇందులో
ఉన్న 66 కవితల్లో, 18 కవితలు మట్టి చుట్టూ అల్లుకున్నవే. చేనేత కార్మికుల పై, పారిశుధ్య కార్మికులపై, ఇతర అసంఘటిత జీవితాలను కూడా తన కవితా వస్తువులుగా
స్వీకరించి కవిత్వం రాశాడు.
కవి పూర్తిగా రైతు పక్షపాతి. మట్టితో బంధాన్ని స్వతహాగా కలిగివున్నాడు. వృత్తిరీత్యా నీళ్ళతో బంధాన్ని పెంచుకున్నాడు. పల్లె పచ్చదనాల కోసం పరితపిస్తూ, పల్లె మళ్లీ మొలకెత్తాలని బలంగా కోరుకున్నాడు.
సహజ సమృద్ధికి చిరునామాగా నిలిచిన నాగలి యోధున్ని సమాజానికి జీవకణంగా గుర్తించాడు కవి నరిసిరెడ్డి.
అందుకే కృషీవలున్ని ఎంతో గొప్పగా ఉన్నతీకరించాడిలా.
“అందరూ చదవదగ్గ పుస్తకమౌతాడు
ప్రపంచంలో ఎక్కడైనా తన జెండా ఎగురవేయగల సైన్యమౌతాడు” (నాదొక జీవకణం)
తుఫాను లొస్తే ప్రజలెంతగా నష్టపోయారో తెలుసుకోవడానికి అధికారులు, ముఖ్యమంత్రులు, ప్రధానులు ఏరియల్
సర్వే చేస్తుంటారు. తక్షణ సాయమందిస్తుంటారు. ప్రచార ఆర్భాటం ఎక్కువగా కనిపిస్తుంది. మేమాపని చేస్తాం, ఇవి చేస్తాం అంటుంటారు. కొన్ని వందల కోట్లు కేటాయిస్తారు కూడా. అదే కరువస్తే ?
‘ఎవరూ హెలికాప్టరెక్కి / ఏరియల్ సర్వే చేయనవసరం లేదు / అధికారుల్ని ఊరూరికి పంపించి / నష్టశాతం
లెక్కకట్టే పని లేదు | పది రూపాయల టికెట్టు పెట్టి కిటికి దగ్గర తొంగి చూస్తే చాలు” కరువు ఎక్కడ చూచినా
తాండవిస్తుంటుందంటాడు నరిసిరెడ్డి. అలా చూచినపుడు పల్లె ఎలా వుంటుందో కూడా చెపుతాడు.
‘అప్పు కుప్ప కయ్యాల కొంపైంది
చేతివృత్తులు గోతినపడి జాతులు నాశనమై
కలగ పెరిగి తాలు గింజ లేసిన తెల్లజొన్న కంకిలా
పల్లె కుప్ప కూలుటకు దగ్గరైంది
ముగింపు దశలో మూలుగుతోంది ‘ (ముగింపు దశ)
కన్నీరు పెడుతున్న పల్లె సీమను మన ముందు ఆవిష్కరిస్తాడు. యాములపల్లి నరిసిరెడ్డి.
కవెప్పుడూ ఆశాజీవిగా ఉంటాడు. ఉండాలి కూడా. ఆశరైతుకు నేస్తం. ఎన్ని ఎడారులు రైతు జీవితంలోకి
వచ్చినా ఒక ఒయాసిస్సు సేదతీరుస్తుందన్న విశ్వాసం ఉంటుంది. అందుకే పల్లె కళను చూడాలనుందన్న ఆశాభావాన్ని
వ్యక్తంచేశాడిలా, ‘ఆడపిల్లకు ఏటేటా పుట్టింటి వారిచ్చే పసుపు కుంకాల్లా / పల్లె కడుపున నీళ్లు మిలమిల్లాడుతుంటే
చూడాలనుంది.’ ఈ కోరిక తీర్చడానికేమో 2017 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా గత ఇరవై ఏళ్ళలో కురవనంతగా
అక్టోబర్ నెలలోనే కురిసింది. వాగులు, వంకలు పారాయి. కుంటలు, చెరువులు నిండాయి. పల్లె నుంచి పారిపోయిన
పచ్చదనం కోసం అలమటిస్తున్న కవి ఆశతో ‘బొతుకులింగ సాలని సెచ్చిన / సేద్యగాని శవాన్ని మోసుకు పోయేతవుడైనా
వాన ఒత్తుందని’ తన ‘వాన ఒత్తుంది’ కవితలో వ్యక్తీకరిస్తాడు. అయితే రైతు బతుకు పచ్చగా వుండాలంటే ఏదో ఒకసారి వాన కురిసినా చాలదు. పొలమంతా తడి బారాలంటే రెండువందల టిఎంసిల నీరు సీమలోకి ప్రవహించాలి. ఆ నీళ్లను రైతులు, కష్టజీవులు నిలదీసి సాధించుకున్న రోజునే ఈ కల సాకారమవుతుంది.
రాయలసీమలో రైతాంగం తరువాత చేనేత పై ఆధారపడ్డ కుటుంబాలెక్కువ. ప్రపంచీకరణలో వ్యవసాయంతో
పాటు చితికిపోతున్న రంగం చేనేత రంగం. పల్లెల్లో చేనేత కార్మికుల వెతలను కళ్లారా చూచిన వారు కనుకనే ” మా
ఊరిప్పుడు’ మగ్గపు మోతలు వినిపించక / మతిపోయి శృతితప్పిన రాగమైంది’ అంటూ తన గుండెకోత కవితలో తెగిపడిపోతున్న పడుగు పేకల దారపు బతుకుల్ని చిత్రీకరించాడు. ఇదంతా తన మన్నే మాతరం లో వ్యక్తీకరిస్తే, వొరుప్పోటు లో రైతు దీన గాథను కవితా గానం చేశాడు.
వొరుప్పోటు ఒక దీర్ఘ కవిత. వొరుపు అంటే కరువు. పోటు అంటే దెబ్బ. కరువు దెబ్బను అనంతరం జిల్లా మాండలికంలో “వొరుప్పోటు” అన్నాడు.ఈ కావ్యంలో అనంతపురం జిల్లా వేరుశనగ రైతులు కరువు దెబ్బకు పాలకుల నిర్లక్ష్యానికి నీళ్లు లేని దైన్య స్థితి గురించి ఇక్కడి యాసలో ఒడుపుగా పట్టుకుని మన ముందుంచాడు నర్సిరెడ్డి.
వ్యవసాయంలో మునిగితేలిన వాడవడం చేత తన అనుభవాలే కవితా గమనాన్ని నిర్ణయించాయి.అంతిమ హెచ్చరిక కూడా అనుభవంతో చెప్పిందే.” రాయలసీమలో సేద్యం కుటుంబాలకు అపాయకరం /చిక్కుకున్నారో చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం” అంటాడు తన చివరి హెచ్చరికగా.
ముంగారు వానలు మే చివరి వారంలో జూన్ మొదటి వారంలో నూ తొలకరి కంటే ముందు కురుస్తాయి.” ముంగారంటే మాకు ఉగాది/ ఏడాదంతా సాఫీగా సాగే/ జీవనయానానికి బలమైన పునాది” అంటాడు నర్సిరెడ్డి. చిరు ధాన్యాలు పండించడం ముందునుంచి ఉంది. ఆ పంటలే రైతుల జీవనాధారం. వాటిని పండిస్తే ఒక ఆనందం. ఎందుకంటే ఇంటికి తినడానికి కావాల్సినవి దొరికేవి. అయితే అవి రైతులు అభివృద్ధి పరచేవి కావు. అయినా వాటిని చూసి మురిసే వాడు రైతు. ఇది దాదాపు 40 ఏళ్ల కిందటి మాట. అందుకే “కంది, పెసర, అలసంద,అనుమ/సజ్జ, జొన్న మున్నగు అక్కా చెల్లెళ్ళాంటి అక్కిళ్ళతో చేరి మొలచిన మొలకలు/ భూమి తల్లికి వింజామరలై వూగుతూ/ కేరింతలు కొడుతున్నట్లుండేవి”అంటూ ఆనాటి ఆనంద క్షణాలను మకర సంక్రాంతి వెలుగుతో పోల్చాడు నర్సిరెడ్డి.
మధ్యలో ఇవి లాభదాయకమైన పంట కాదని ఇక్కడ ఎర్రనేలలకు తక్కువ వర్షపాతానికి పండే వాణిజ్య పంట చెనిక్కాయ పంట మాత్రమే లాభదాయకమని శాస్త్రవేత్తలు చెప్పారు. దాంతో చిన్న గుత్తికాయ వదిలి జెయల్ చెనిక్కాయలతోఅధిక దిగుబడి వస్తుందని ప్రచారమైంది.” కంది, పెసర”అంతర పంటగా వేయడం మొదలైంది.వానలు పుష్కలంగా కురిసేవి అప్పట్లో. “పెళ్లి పందిట్లో పడ్డ తలంబ్రాలు, అక్షింతల్లా/ ఎటుచూసినా చెని క్కాయలు” ఉండేవి. రైతుల కళ్ళల్లో ధీమా ఉండేది.
చేలల్లో రాత్రిపూట చెనిక్కాయలు పీక్కొని “చిన్న మంటల మీదో చారెడు నిప్పులమీదో కాల్చుతున్నా…. ఆ పసందే… వేరు!” అనంటాడు నర్సిరెడ్డి. ఇదంతా గతకాలపు వసంత జ్ఞాపకాలు. మరి నేడో….?
చెనిక్కాయలు బాగా పండిన కాలంలో నూనె మిల్లులు ప్రతి మండలంలో ఉండేవి. దీన్నే “చేతికందొచ్చిన పెద్దకొడుకున్నట్లు వాటి ఆసరాతో మండలానికో నూనెలు లేచింది” అంటూ ఆనాటి పరిస్థితి మన ముందుంచాడు కవి.
కానీ ఎల్లకాలం మనది కాదు. కాలం మారింది ఎవరో పేరు ప్రేరేపించారన్నట్టు ప్రకృతి పగ వాళ్ల సరసన చేరింది. ముంగారు వానలు లేవు.తొలకరి లేదు. వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి. పర్యావరణాన్ని విధ్వంసానికి ఇదొక మచ్చుతునక. రైతుకు పెట్టుబడి చినిగి చాటంతయింది. ప్రభుత్వాలు తుఫాన్లొస్తే చేసిన హడావుడి కరువొసస్తే ఉండదు.ఏదో కంటితుడుపు చర్యలు ఉంటాయి.”ఇన్సూరెన్స్ లు…… ఇన్పుట్ సబ్సిడీలు/ ఆకలి నకనకల్లో గుటికెడు నీళ్లు పోసినట్లు/కంటితుడుపు చర్యల్లా/ రాజకీయ జూదం అవికూడా “అంటూ రాజకీయ పద్మవ్యూహంలో రైతును ఇరికించారని చెప్తాడు నర్సిరెడ్డి.
అంతేకాదు .”వారాల తరబడి ఆఫీసుల చుట్టూ/ గరుసుట్లు తిప్పుకొని/పుచ్చులు,నాచులు, రాయిరప్పలతో/పంపిణీ తంతు అయిందప్పి అనిపిస్తారు” అంటూ రైతులను ఏ స్థితికి నెట్టేశారో చెబుతాడు.
రైతులు ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి క్యూలో నిలబడి అధికారుల చీదరింపు లకు ఛీత్కారాలకు తలొగ్గి దొరికిన చెనిక్కాయ వలిచి విత్తనాలను చేలో విత్తుతారు. వానల కోసం చాతకపక్షిలాఎదురు చూస్తారు. షరామామూలే.మబ్బులు కమ్ముకుంటాయి. రైతు కళ్లల్లో ఆనందం మెరవక ముందే ఆ మొయిళ్ళు మోసం చేస్తూ ఎక్కడికో వెళ్లిపోతాయి పుల్ల చినుకులు రాల్చి. తీరా అంతోఇంతో వాన పడితే కుళ్లు తెగులు పడుతుంది. ఎన్ని మోనోక్రోటోఫాసులు వాడినా ఎర్రగొంగలి చావదు.అదేమో తాగితే మాత్రం రైతు ప్రాణం పోతుంది. 2003లో జరిగిన రైతుల ఆత్మహత్యలు పాలకులకళ్ళల్లో పడలేదు. పైగా ఆ మరణాలు కరువుకాటుకు కాదన్నారు. అదొక సామాజిక హత్య.కరువు విధ్వంసంపై పాలకుల నిర్లక్ష్యానికి రైతు చేసిన ఆఖరి నిరసన సంతకం.
వ్యవసాయం గిట్టుబాటు కాదని భూములు వదలుకోవడం మంచిదని ఆనాడు ఆనాటి ప్రభుత్వం సలహా ఇచ్చింది. ఈ జిల్లాకు హంద్రీనీవా ద్వారా తాగునీరు ఇస్తాంగానీ సాగునీరు ఇవ్వలేమని చెప్పింది. పైగా గాలి మరల కోసం భూములివ్వమని చెప్పింది. కార్పొరేట్ కు ధారాదత్తం చేయమని సలహా ఇచ్చింది.చెక్ డ్యాం లతో రైతు బాగుపడ తాడంది. ప్రపంచీకరణ విధానాలు, ప్రపంచ బ్యాంకు ఆదేశాలు అమలు పరిచింది. అన్ని రకాల దాడులతో రైతు చితికి పోయాడు.అతని ఆక్రందన గాలిలో కలిసిపోయింది. దీనినే నర్సిరెడ్డి ” కొట్టొద్దు తిట్టొద్దు వ్యవసాయం చేయించు/వాడే చేస్తాడన్నట్టు ప్రవర్తించింది “అని చెప్తాడు నర్సిరెడ్డి.
‌అనంతపురం జిల్లాలో జీవ నదులు లేవు. ఆరుగాలం కష్టపడినా దొరికేది అంతంత మాత్రమే. తాగు నీరు లేని గ్రామాలు ఎన్నో. సాయిబాబా వాటర్ స్కీంతో కొన్ని గ్రామాల్లో ప్రజలు గొంతు తడుపు కుంటున్నారు. పాలకులు చేసిందేమీ లేదు. తుంగభద్ర నుంచి రావాల్సిన 32 టీఎంసీలు రావు. కేవలం 20 టీఎంసీలు మాత్రమే వస్తాయి. పాలకులు అడగరు. హంద్రీ-నీవా సుజల స్రవంతిని అమలు చేస్తామని ఇటీవల కొత్త ప్రభుత్వం చెబుతోంది. దాన్ని అన్ని చెరువులకు అనుసంధానం చేస్తానని చెప్పింది.కానీ ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు అన్ని డ్యాములు నిండిపోయాయి.కానీ ఒక టీఎంసీ నీరు కూడా ఆ కాలువ ద్వారా రావడం లేదు. మరో సమాంతర కాలువ ఇస్తామంటున్నారు. ఎప్పుడు వస్తుందో మరి. ఈలోపల కరోనా వైరస్ చుట్టుముట్టింది. ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బ తింటోంది. వాగ్దానాలు అమల వుతాయో లేదో? అదొక ప్రశ్నార్థకమైంది.
అందువల్లనే నర్సిరెడ్డి ఇలా ప్రశ్నిస్తున్నాడు.” వేరు కుళ్ళు, మొవ్వ కుళ్ళు,కాండం కుళ్ళు లా/ కుళ్ళిన మీ …. బుద్ధుల పై ఏ జీవామృతాన్ని పిచికారి చేయాలి?”
నిరాశ,నిస్పృహ చుట్టుముట్టిన తరుణంలో నర్సిరెడ్డి బరువెక్కిన హృదయంతో ఇలా చెబుతాడు. “లేపాక్షి బసవన్నంత బరువైన /తిమ్మమ్మ మర్రిమానుకు ఉన్నన్ని ఊడలు దిగిన/ గగనమంతా అనంత దీనగాథ ఇది”
ఈ దీనగాథ కు ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి ఇప్పుడు తలెత్తుతున్న రైతాంగ ఉద్యమాలు పాలకుల్ని నిలదీసి ఈ జిల్లాకు నీళ్లతో పాటు వ్యవసాయాధారిత పరిశ్రమలు వచ్చేటట్లు చేయాలి. అప్పుడే అంత విజయగాథలు ఇక్కడి కవులు ఆలపించిన గలరు. ఆ రోజు వస్తుందని ఆశిద్దాం. ఆనాడు రైతు విజయం కావ్యాన్ని నర్సిరెడ్డి ఆలపిస్తారని ఆశిద్దాం.

Pillaa kumaraswaamy,9490122229

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s