
పొట్టేలు కన్నతల్లి గొర్రే,గొర్రే
దున్నపోతు కన్నతల్లి బర్రే, బర్రే
ముందు పళ్ళు ఉడిపోతే తొర్రే, తొర్రే
తొర్రినోట్లో అంబలేస్తే జుర్రే, జుర్రే
ఇంగ్లీషు భాషా! ఎంతో తమాషా!
సాల్టంటే ఉప్పు – ఫాల్టంటే తప్పు
క్రో అంటే కాకి, కాక్ అంటే పుంజు
ఇంగ్లీషు భాష – ఎంతో తమాషా
తమాషైన భాషా నేర్వాలని ఆశ
“పిల్లీ పిల్లీ ఎక్కడికి ?
ఎలుకల వేటకు వెళుతున్నా !
బల్లీ బల్లీ ఎక్కడికి ?
పురుగుల వేటకు వెళుతున్నా!
నల్లీ నల్లీ ఎక్కడికి
మనుషుల వేటకు వెళుతున్నా !” సృజనాత్మక చదువుతో, బాల సాహిత్యంతో సంబంధం ఉన్న వారికి జై సీతారాం పాటలు తెలియకుండా ఉండవు. చదువు చెప్పడమంటే, పిల్లల్ని కొట్టడమనే అర్థం ఉన్న రోజుల్లోనే ప్రాథమిక ఉపాధ్యాయుడుగా ఆట, పాటలతో కూడిన
చదువును ప్రవేశపెట్టిన సంస్కరణావాది.
జైసీతారాం అనంతపురం జిల్లా రొద్దంమండలం ‘కోగిర’ అనే గ్రామంలో 1924 నవంబర్ 14న ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు. వారి ఊరిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేశారు.కుటుంబ పరిస్థితుల కారణంగా మేకల కాపరిగా పనిచేశాడు. ఆనాటి ప్రాథమిక విద్యలోని శతక వాజ్ఞ్మయ ప్రభావం వలన ఆయనకు ఆ వయసులోనే ఆటవెలది, తేటగీతల అల్లిక అలవాటై తోటి వారికి వినిపించేవారట. చదువుకోవాలనే కోరిక
తీవ్రమై పెనుకొండకు పారిపోయి, అష్టకష్టాలు పడి 8వ తరగతి చదివి హయ్యర్ గ్రేడ్ టీచరుగా వృత్తిని చేపట్టారు.
పిల్లలకెపుడూ వేడుకా, వినోదం కావాలి. అందుకు అభినయంతో కూడిన పాటలు కావాలి. భాషే మానసిక వికాసానికి మూలమనినమ్మి, పాటలు రాయడమూ, పాడడమూ ఆయన ప్రవృత్తిగా స్వీకరించారు.
‘కవిత్వమంటే ఛందస్సు కాదు. ఢమ ఢమార్భా టాల మోత కాదు, సర్కస్ ఫీట్లు అసలే కాదు, మెరుపులా మెరసి, గాలిలా తాకి ఒక్క క్షణంలో హృదయాల్ని గిలిగింతలు పెట్టే చమత్కారమే కవిత్వం’ అంటూ జై సీతారాం నిత్యం వాడుకలోని
చిట్టి, చిట్టి పదాలతో ఎన్నో కవితా చమత్కారాలు చేశారు. ఆ వందలాది బాలగేయాలు రుషివ్యాలి ద్వారా ‘వెన్నెల విందు’, బాలసాహిత్య అకాడమీ ద్వారా ‘బాలల జండా’, టింబక్టు ప్రచురణ ద్వారా ‘మేం పిల్లలం’గా ‘బాలల జండా,టింబక్టు ప్రచురణ ద్వారా ‘మేం పిల్లలం’గా ప్రచురణ పొందాయి.
పిల్లలకు భాష నేర్పడం కోసం ఆయన నిత్యం పరిశోధకులుగా, ‘సున్నా వాచకం’ ’10 అక్షరాలతో
తెలుగులిపి’ లాంటి ప్రయోగాలెన్నో చేశారు. పాఠాలను పాటలుగా మార్చి, పిల్లలకు చదువంటే కష్టం కాకుండా ఇష్టపడేలా చేసేవారు. జై సీతారాం పిల్లల పాటలు తప్ప ప్రపంచం తెలియని అమాయక, అలౌకిక చక్రవర్తి ఏమీ కాదు. ‘నిట్టూర్పులు’, ‘మధాంధ భారతం’, ‘సమతా చతుశ్శతి’, ‘రమ్ సీసాలు’ లాంటి ఛందోబద్ధ రచనలతో సాహిత్యాభిమానులను ఎంతో అలరించి, అభినవ వేమనగా కీర్తి గడించారు.
సీతా రమ్ సీసా
………………….
అనుకూలవతికాని అర్ధాంగివలె భాష
నాభావములవెంట నడిచి రాదు.
ఐకమత్యములేని అన్నదమ్ములబోలె
పద్యపాదము లొక్కబాటజనవు.
గోముగా బెంచిన కొడుకు గూతుండ్రట్లు
మారాము యతి ప్రాస మాట వినవు.
కొత్తకోడలిమీద అత్తపెత్తనమట్లు
వ్యాకరణమ్ము నన్ వంకబెట్టు.
భూతచరితలు అవ్వలుతాతలాయె.
భావినూహింప పౌత్రియో పౌత్రుడగునొ.
వర్తమానము కాసంత వసతి నీదు.
ఈ పరిస్థితులలో కైతనెట్లు వ్రాతు.
పుట్టు పేదరికం, కుల పెత్తందారీతనం, అధికార జులుం ఆయనను వెంటాడాయి. ఆయన తన కలంతో ‘అక్షర సైన్యం’ నిర్మించుకొని ‘కచటతపలను రేపి గర్జింపచేస్తాను, గజడదబలను ఊపి గాండ్రింపజేస్తాను’ అంటూ ముందు నిలబడి
కవితా ప్రస్థానం గావించారు. జై సీతారాం హృదయం బీదలపట్ల, స్త్రీలపట్ల, శ్రమజీవులు, దేశంపట్ల ఆర్ధంగా స్పందించింది. ‘చెమట నీది, చేయి నీది –
చేతిలోని చేవ నీది, చేవ కొలదీ చేసిన – నీ చేని పంట ఏదిరా !’ మడక నీది,మాను నీది – కాడిమేడి నీదిరా, కాడిమేడి పండించిన కడుపు కూడు ఏమాయెరా
?’ అంటూ రైతన్న బాధలను కవితాగానం చేశారు.
” నలుబదేడు వయస్సు మీరిన,నా కుమార్తె స్వతంత్ర భారతి ఏమి లోపమో ! ఎవరి శాపమో ! ఇంకా సమర్తాడలేదు’ అని సార్ధకం కాని, సఫలీకృతం కాని స్వాతంత్ర్యానికి పెదవి విరిచారు. ‘మానవ
వేషాలు ధరించి – మగ వేషాల్లో మృగాలు ఎన్నో’ కట్టుకునేందుకు హీరోవాడు, కట్నం కుదరక విలనవుతాడు’ అంటూ కట్నాల వికృత స్వరూపా లపై, సామాజిక రుగ్మతలపై కలం కత్తి దూశారు. ఎమర్జెన్సీలో జైలు శిక్ష అనుభవిచారు. ఆ జైల్లో
కూడా ‘అరసం’, ‘విరసం’ దిగంబర కవులతో జరిగిన సాహిత్య గోష్టులతో తన కలానికి పదును పెంచుకున్నారు. రాయలసీమ భాషకు ఊపిరిపోస్తూ ప్రాంతీయ యాసలను కృత్రిమం కాకుండా, అనంతపురం జిల్లా మాండలికానికి ఒక గుభాళింపు తెచ్చారు. 1983లో
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక య్యారు. జై సీతారాంకు సత్కారాలన్నా,బిరుదు లన్నా ఏవగింపు.
అనంతపురం సాహితీ ప్రియులు, అభిమానులు ఆయననుఒప్పించి ‘కవి కోకిల’ బిరుదివ్వబోయారు. ‘కవి కోకిల’ బదులు ‘కవికాకి’ బిరుదిమ్మన్నారు. కోకిల ఎప్పుడో వసంత కాలంలో గానీ కూయదు. అదీ లేత
మామిడి చివుళ్ళు నమిలితేగాని దానికి గొంతు పెగలదు, మిగతా కాలాల్లో దాని సడీ, చప్పుడు ఉండదు. కాకి అలాకాదే ! సర్వకాల, సర్వావస్థలల్లో జన జీవితంతో అంటి పెట్టుకుని ఉంటుంది. తెల్లవారుజామున కోడికూత తరువాత మనల్ని
మేలుకొలిపే వైతాళిక పక్షి కాకే. అందుకే జై సీతారాం ‘కవికాకి’ అనే బిరుదును కోరుకున్నారు. నేపథ్యంలో ‘ఏడ్వను! బ్రాకెట్టులో బ్రతుకును. అరసున్నాగా అసలే జీవించను!’ అంటూ అక్షర శపథం చేశారు. ‘నాదే ఒక కొత్త గొంతు! నాదే ఒకవింత వంత! నాదే ఒకనాటి – నేటి – రేపటి పంథా!’ అనే ధీమాను వ్యక్తం చేస్తూ మరో ప్రపంచాన్ని వెతుక్కుంటూ 2000 సంవత్సరం అక్టోబర్ 9వ తేదీన ‘కవికాకి’ లోని కాకి దిగంతాలు దాటి ఎగిరిపోయినా, కవిగా ఆయన
చిరస్మరణీయుడు. ఆ కావు, కావులు మాత్రం సాహితీ ప్రియులను అలరిస్తూనే ఉంటాయి.

MATHS ASSISTANT, ZPHS CHOWLUR HINDUPUR MANDAL ANANTHAPURAM