కలువకొలను
సదానంద

పసిపిల్లల హృదయాలలో ఎన్నో కథలను ముద్రించిన తాతయ్య కలువకొలను
సదానంద .

సాహితీ ప్రాశస్త్యానికి నిలువుటద్దం కలువకొలను సదానంద. ప్రముఖ బాల సాహిత్య రచయిత. బాలసాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ వారి మొట్టమొదటి బాలసాహిత్య పురస్కార్‌ అవార్డు అందుకున్న వ్యక్తి.

సదానంద చిత్తూరు జిల్లా పాకాల లో 1939 ఫిబ్రవరి22 న జన్మించారు. తల్లి నాగమ్మ, తండ్రి కృష్ణయ్య .

ఎస్‌.ఎస్‌. ఎల్‌.సి చేసి టి.ఎస్‌.ఎల్‌.సి చదివారు. వృత్తిరీత్యా 36 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి 1997లో పదవీ విరమణ పొంది పాకాల లోనే స్థిర పడ్డారు.

నండూరి రామమొహన రావు
సంపాదకత్వంలో వెలువడే
బాల జ్యొతి లో కలువకొలను సదానంద రచయిత కథలు రాశారు.

ఈనాడు ఆదివారం సంచిక లో ఈయన నవల పై ఇలా సమీక్షా చేశారు.
వట్టి చేతులు హస్య వ్యంగ్య నవల లో చావు ప్రదానంశంగా రాశారు. నవ్వుల చురకలు!
ఇద్దరు యమభటులు భూలోకానికి వచ్చారు. ఆ ఇద్దరిలో సీరియస్‌గా తన పని తాను చేసుకుపోయే భల్లూకముష్టి బాధ్యత ఓ పిసినిగొట్టు ప్రాణాన్ని తీసుకెళ్లడం.

కోతిచేష్టల మర్కటముష్టి డ్యూటీ ఒక కోడిపిల్ల ప్రాణాన్ని తీసుకెళ్లడం. వాళ్లు తీసుకెళ్లాల్సిన రెండు ప్రాణాల చుట్టూ ఉండే మనుషులూ వారి స్వభావాలూ అనుబంధాలూ ఆర్థిక పరిస్థితుల గురించి మర్కటముష్టికి వచ్చే సందేహాలన్నీ తీరుస్తూ పని ఎలా చేయాలో నేర్పిస్తుంటాడు .

భల్లూకముష్టి. ఆ క్రమంలో ఆ యమకింకరులిద్దరూ భూలోకవాసుల గురించి మాట్లాడుకునే మాటల్లో విన్పించే హాస్యం నవ్విస్తుంది, వ్యంగ్యం ఆలోచింపజేస్తుంది. పిసినిగొట్టు తండ్రి కారణంగా అతడి కొడుకు వెండిరూపాయి కాపురం ఏమైందీ, చివరికి అతడేం చేశాడూ అన్నది కథ.

మధ్యలో సందర్భానికి తగిన తత్వాన్ని బోధించే గేయాలతో ఆసక్తిగా సాగిపోతుంది- చావు ప్రధానాంశంగా రాసిన ఈ హాస్య, వ్యంగ్య నవల ఇది.

మదనపల్లె కు చెందినటి.ఎస్.ఎ. కృష్ణమూర్తి
సదానంద కథల గురించి ఇలా వివరించారు.

*వికృతవాణి : అనుమానం ప్రాణసంకటం అన్నారు పెద్దలు. నిరాశా నిస్పృహలను ఎక్కువగా అనుభవిస్తున్న వారిలో అయితే ఈ అనుమాన పిశాచాలు మరింత ఎక్కువగా పట్టి పీడిస్తున్నాయి అనుక్షణం, అడుగడుగునా అనుమానాలతో భయాలతో కాలం గడిపిన ఓ నష్ట జాతకుడు కథ వికృతవాణి. మనిషి యొక్క మానసిక క్షేశాల తాలూకు భయాలు ఆలోచనలు ఎలా వుంటాయో చూపిన కథ.

పేదవాడి లేదా దిగువ మధ్యతరగతి
జీవనానికి సంబంధించిన చక్కటి ఎత్తుగడతో ప్రారంభమయ్యే ఈ కథ ముగింపు వరకూ పాఠకుడ్ని తనవెంట శరవేగంగా లాక్కుపోతుంది. అవసరం అయిన చోట మాత్రమే మాండలికం ఉపయోగింప బడడం ఈ కథకు ఎంతో వన్నె తెచ్చింది.

*ఉప్పు లేని కూడు : యవ్వనవతి, రూపవతి, సర్వాభరణ భూషిత, సర్వాలంకార శోబిత అయిన స్త్రీ నడి నిశిరాత్రి నగర విధులలో అయినా కాలిబాటల్లో అయినా సారీ నిర్భయంగా నడవ గలిగిన నాడే నిజమైన స్వాతంత్ర్యం అన్నాడు గాంధీజీ. ఆయన్నలా పంపెయ్యగానే “ఆడదానికి, అందునా అందమైన దానికి అర్ధరాత్రి వీధులు, కాలిదార్లూ, పట్టి తిరిగే పనేమిటి”? అన్నారు ఆనక వచ్చిన వాళ్ళు!

అంతటితో ఆగారా? “ఎ క్లాసు నుండీ జడ్ క్లాసు” వరకూ వ్యభిచార గృహాలను ప్రోత్సహిస్తూ ‘స్త్రీ’కి కావాల్సినంత స్వేచ్చనివ్వడానికి ప్రయత్నించారు. మరికొంత మంది ఔత్సాహికులు వేశ్యావృత్తి చట్టబద్ధం చేసేయాలంటూ నొక్కి వక్కాణిస్తున్నాయి.

ఓ చిన్న గ్రామంలో వ్యభిచార గృహాన్ని పెట్టి పోషిస్తూ లబ్దిపొందే ఓచోటా నాయకుడి కథ ఉప్పు లేని కూడు.

సదానందగారు బాల బాలికలకు అందించిన గ్రంథాలలో ఆణిముత్యం
“శివానందలహరి” దాదాపు ముప్పయి ఎనిమిది సంవత్సరాల క్రితం తమచే సత్కథలుగా పరిష్కరింపబడి వివిధ పత్రికలలో ప్రచురితమైన ముప్పయి ఒక్క పౌరాణిక గాథలను కూర్చి, బాపుగారి పంచరంగుల ముఖచిత్రంతో, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహకారంతో 1983 ఆగష్టు మాసంలో వెలువరించిన గ్రంథమిది.

రామాయణ, భారత, భాగవతాలతో పాటుగా తప్పక పిల్లలకు చదివి విన్పించవలసిన అపూర్వ, అమూల్య, అద్భుత గ్రంథమిది. బాలబాలికల మానసిక వికాసానికి, క్రమశిక్షణకు, భక్తిభావాల పెంపుదలకు పునాదులు వెయ్యగల గ్రంథం
అయినందున ప్రతి ఇంటా భగవద్గీత వలె పూజా మందిరంలో ఉంచుకోదగ్గ
గ్రంథమిది.

సదానంద మొదటి రచన తన 18 ఏటనే ప్రచురితమైంది.
తన 25 ఏట రాసిన పిల్లలనవల బాల రంజనిలో సీరియల్‌గా వచ్చింది. 1964లో మొదటి కథా సంపుటి ‘సాంబయ్య గుర్రం’ ప్రచురితమైంది. అదే సంవత్సరం ‘చల్లనితల్లి’, 1966లో నీతికథామంజరి, 1967లో విందుభోజనం, 1983లో శివానందలహరి ఇలా… మొత్తం 8 కథా సంపుటాలు ప్రచురించారు.

1965లో బాలల కోసం ‘బంగారు నడిచినబాట’ నవల ప్రచురించారు. ఈ నవలకు 1966లో ఉత్తమ బాల సాహిత్య గ్రంధంగా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ వారి అవార్డు లభించింది.
రచయిత గానే కాదు, చిత్ర కారుడిగా, కార్టూనిస్టు గా కూడా తెలుగు ప్రజలకు వీరు పరిచయస్తులు

చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి, బాలరంజని, బొమ్మరిల్లు, బాలభారతి, బుజ్జాయిలాంటి బాలల మాస పత్రికలలో, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి వంటి వార, మాస పత్రికలలోని పిల్లల శీర్షికలలో వీరి రచనలు ప్రచురితమయ్యాయి. ఈనాడు దినపత్రిక ‘హాయ్‌బుజ్జి’ పేజీలో వీరికథలు ఎక్కువగా గమనించవచ్చు.

సదానంద బాలలకోసం ఇప్పటి వరకు 200కు పైగా కథలు, 2 నవలలు, 100 కి పైగా గేయాలు, కొన్ని గేయకథలు రాశారు. 8 కథా సంపుటాలు ప్రచురించారు. వీరి “నవ్వే పెదవులు – ఏడ్చేకళ్ళు” కథా సంపుటానికి 1976లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. తెలుగు కథాసాహిత్యంలో వంద ఆణిమ్యుత్యాలు పేరుతో వెలువడిన కథా సంకలనంలో వీరి కథ “తాత దిగిపోయిన బండి”కి స్థానం లభించింది.

సదానంద ఉపా ధ్యాయుడైనా జీవితాంతం సాహిత్యార్చన చేసిన వ్యక్తి.
సమకాలీన సమాజ దుర్నీతిని ఆయన రచనలు ప్రతిబింబిస్తాయి. మానవత్వం గురించి మంచి సమాజం గురించి ఎలుగెత్తిన సదానంద రచనలు చిరకాలం నిలుస్తాయి.‘పరాగభూమి’ కథా సంపుటిలోని 20కథల్లో సమస్త ప్రపంచం దాగుంది.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు… ఇది సాహిత్య రంగంలో విశేష రచనలకు కేంద్ర ప్రభుత్వం అందించే అవార్డు. ప్రతీ ఏటా భారతీయ భాషల్లో వెలువడే పుస్తకాలకు ఈ పురస్కారాన్ని ప్రకటిస్తారు. నవల, కథ, కవిత్వం, విమర్శ వంటి అంశాలలో ఈ పురస్కారాన్ని కేంద్రం అందిస్తుంది.

2010 లో అడవితల్లి నవల బాల సాహిత్య పురస్కారం అందుకొంది. నవల రచయిత కలువకొలను సదానంద కు ఈ పురస్కారం అందించారు.

పెన్నేటి ప్రచురణలు, కడప వారు సదానంద పిల్లల నవల ‘అడవితల్లి’ 2007లో ప్రచురించారు. మహాభారతంలోని కొన్ని పద్యాల ఆధారంగా అల్లిన నవల. మొదట ఈ నవల ‘బాలరంజని’ పిల్లల మాసపత్రికలో ప్రచురితమై బాలలను అలరించింది.

కేంద్ర ప్రభుత్వం నుంచి1992 లో ఉత్తమ ఉపాధ్యాయుడు గా సత్కారాన్ని పొందారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండీ సాహిత్య పరమైన పెక్కు అవార్డులు పొందారు .

బెంగుళూరు ‘చర్చ’ వారు ‘చర్చ-2012’ పురస్కారాన్ని ఈ నిరంతర కృషీవలునికి 15-4-2012 నాడు తిరుపతిలో అందజేశారు.

రాచపాళ్యం చంద్రశేఖర్ రెడ్డి నివాళులు అర్పిస్తూ ఇలా అన్నారు.
కలువకొలను సదానంద గారి మరణం ప్రజాసాహిత్యవికాసానికి వెలితే.సౌమ్యుడు ,గంభీరుడు అయిన మౌలిక రచయిత సదానంద.ఆయన నవలాకథా రచయిత.గందరగోళం అనేనవలను కొడవటిగంటి కుటుంబరావు మంచి విప్లవనవల అని మెచ్చుకున్నారు. ఆయన మరణంపట్ల ఆం.ప్ర.అరసం సంతాపం ప్రకటిస్తున్నది.

శాంతి నారాయణ అంజలి ఘటిస్తూ ఇలా అన్నారు.
పనికిమాలిన భుజకీర్తుల కోసం ప్రాకులాడకుండా తనదైన మార్గంలో ప్రశాంతంగా కలాన్ని నడిపిస్తూ ఉత్తమ సాహిత్యాన్ని మనకందించిన గొప్ప రచయిత కలువకొలను సదానంద గారు.
వారి మరణం రాయలసీమ సాహిత్యానికి తీరని లోటన్నారు.

బాల సాహిత్య పురస్కారంగ్రహీత, కేంద్ర ప్రభుత్వం చేత ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు అందుకొన్న కలువకొలను సదానంద 2020ఆగస్టు 25న పాకాలలో కన్నుమూశారు.

రచన:– చందమూరి నరసింహారెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s