Rajani

కఠోర శ్రమ, అలుపెరగని అవిశ్రాంత పోరాటం, ఆత్మవిశ్వాసం ఆమెను ఓ క్రీడాకారిణిగా తయారు చేశాయి. ప్రపంచ కప్, కామన్వెల్త్ గేమ్స్ మరియు ఏషియన్ గేమ్స్ ,రియో ఒలంపిక్స్ గేమ్స్ లో భారతదేశం హాకీ టీం లో పాల్గొన్న ఏకైక దక్షిణభారతదేశపు మహిళ ఆమె…

2020 లో జరిగే టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ కు ఈమె ఎంపికయ్యింది. ఈమె జీవితాన్ని ఓసారి పరికించి చూస్తే ఎక్కడో ఓ మారుమూల గ్రామం నుండి జీవితాన్ని ప్రారంభించి పేదరికాన్ని ఎదిరించి ఒలంపిక్స్ లో
పాల్గొనే స్థాయికి ఎదిగింది.
భారత మహిళ హాకీ జట్టులో ఈమె గోల్ కీపర్. చిత్తూరు జిల్లావాసి రజని ఎతిమరుపు.

హాకీలో శిక్షణ కోసం కురచ దుస్తులు వేసుకుని వెళుతుంటే ఎగతాళి చేశారు. హేళన చేసినవారి నుంచే అభినందనలు అందుకొంది. మారుమూల కొండల మధ్యలో ఉన్న ఆ గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి అందరి మన్ననలు అందుకుంది.

హాకీ జాతీయ జట్టుగోల్‌కీపర్‌ రజని1990జూన్ 9న చిత్తూరుజిల్లా యెర్రావారిపాలెం మండలం మారుమూల అటవీ సరిహద్దుల్లో ఉన్న యనమలవారిపల్లె గ్రామం లో జన్మించారు.తండ్రి ఎతిమరపు రమణాచారి వడ్రంగి తల్లి తులసమ్మ కూలిపని. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఒక మగబిడ్డ.రజనిరెండో అమ్మాయి.

ఐదో తరగతి వరకు పచ్చారవారిపల్లె ప్రాథమిక పాఠశాలలో 6వతరగతి నుంచి 10వ తరగతి వరకు నెరబైలులో , తిరుపతిలో డిగ్రీ వరకు చదివింది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆరు కిలోమీటర్ల దూరం నడిచి నెరబైలు బడికి వెళ్లేది.

హైస్కూల్‌లో పీఈటీ మాస్టర్‌ వెంకట రాజు పిల్లలకు బాగా ఆటలు నేర్పేవారు.రజని హాకీ క్రీడకు అంకురార్పణ అక్కడే జరిగింది. హాకీలో మెళకువలు నేర్పారు. ఆయన సారథ్యంలోనే శిక్షణ తీసుకొంది. ప్యాంట్, టీషర్టు ధరించి కోచింగ్ వెళ్తుంటే ఆటపట్టించారు. పట్టుదలతో హాకీపై మనసు లగ్నం చేసి కఠోర సాధనతో ఉన్నత స్థాయికి చేరింది.హేళన చేసిన వారే నేడు అభినందనలు కురుపిస్తున్నారు.

క్రీడాకారిణికి ఊపిరి పోయడానికి అప్పులు చేసి, కోచింగ్‌ క్యాంపులకు పంపి, తల్లిదండ్రులు కష్టాలు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భవిష్యత్తు ఉంది. అనుకున్నది సాధించు అని తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహం వృధా కాలేదు.
జాతీయ స్థాయి జట్టుకు ఎంపికైంది.అనేక ఒడుదుడుకులు ఎదుర్కొ ని, మన దేశం నుంచి ఒలింపిక్‌ హాకీ జట్టుకు గోల్‌కీపర్‌గా ఎంపికయింది. ఆపల్లె ప్రపంచ క్రీడా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.

రజనీ ప్రస్థానం హాకీ ప్రస్థానం ఇలా మొదలైంది. 2004లో ఆరో తరగతిలో పుత్తూరులో జరిగిన జోనల్స్‌లో రన్నర్‌గా నిలిచింది

2005లో తిరుపతిలో జరిగిన ఇంటర్‌ జోనల్స్‌లో ప్రాతినిథ్యం లభించింది. రాష్ట్ర క్రీడాసాధికార సంస్థ (శాప్) 2005లో తిరుపతిలో నిర్వహించిన హాకీ కోచింగ్ క్యాంప్ కు తీసుకున్నారు. రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జాతీయ క్రీడా పోటీల్లో సత్తా చూపింది.

అదే ఏడాది పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌ లో జరిగిన మ్యాచ్ లో పాల్గొంది. 2006 ఢిల్లీలో 2007లో కోయంబత్తూరు, జబల్‌పూర్‌ లో 2008లో రూర్కెలాలో జాతీయ పోటీల్లో జట్టులో పాల్లొంది.

2009లో మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్‌ లో స్థానం లభించింది. 2009లో ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగిన పోటీల్లో మంచి ప్రతిభ కనబరచడంతో సీనియర్స్ జటులో చోటు లభించింది. అంచెలంచెల విజయాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దొరికింది.

2010లో చైనా, న్యూజిలాండ్, కొరియా, అర్జెంటీనాలో ఆడింది. 2011లో ఆస్ట్రేలియా పోటీల్లో పాల్గొంది. అప్పుడు జట్టు కు సిల్వర్‌ మెడల్‌ దక్కింది.
2012 జనవరిలో ఢిల్లీలో జరిగిన హాకీలో చాంపియన్‌గా నిలిచింది.

2013లో నెదర్‌లాండ్, జర్మనీ, మలేషియా జరిగిన మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం లభించింది.2013 అక్టోబర్ లో జపాన్ లో జరిగిన తృతీయ ఆసియా మహిళల హాకీ చాంపియన్ షిప్ పోటీల్లో ‘బెస్ట్ గోల్ కీపర్’ అవార్డు అందుకుంది.
మహిళా హాకీ జట్టు ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. ఈ పోటీల్లో పాల్గొన్న భారత జట్టుకుగోల్ కీపర్ రజనీయే.

2014లో అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొంది. అప్పుడు జట్టుకు స్వర్ణపతకం లభించింది. విజయవంతంగా సాగిపోతున్న ఆమే కెరీర్ కు 2014 లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా ఆ సంవత్సరం జాతీయ జట్టులో చోటు దక్కలేదు .వరుసగా అయిదు టోర్నమెంట్లు సెలక్ట్ కాలేదు.

ఆటకూ, జట్టుకూ దూరమైపోయి,గాయాల నుంచి కోలుకుంటున్న దశలో అనేకసార్లు భావోద్వేగాలకు గురైంది. జట్టులో మళ్ళీ స్థానం సంపాదించాలనే సంకల్పంతో ఏడాదికి పైగా కృషి చేసింది. 2016 లో మళ్ళీ జాతీయ హాకీ లో చోటు దక్కింది.

ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్ భారత మహిళా హాకీ జట్టు క్వాలిఫై అయింది.2016 ఒలింపిక్స్ హాకీ పోటీలలో మన రాష్ట్రం నుండి పాల్గొన్న ఏకైక తెలుగు మహిళ.
ఈమె 2016, నవంబరు5న సింగపూరు లో నిర్వహించిన ఆసియా మహిళల హాకీ ఛాంపియన్ షిప్పు పోటీలలో తొలిసారిగా విజేతగా నిల్చిన భారత జట్టులో, గోల్ కీపరుగా తన ప్రతిభ ప్రదర్శించి, ఛైనా జట్టుకే పెద్ద అడ్డుగోడగా నిలిచి, మన జట్టుకి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది.

2017 లో జపాన్ లో జరిగిన ఆసియా హాకీ ఛాంపియన్ షిప్ పోటీల్లో చైనాపై ఘన విజయం సాధించిన భారత మహిళల జట్టులో ఆమె గోల్ కీపర్.ఆ జట్టులో ఏకైక తెలుగమ్మాయిఈమే.
2020 లో జరిగే టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ కు ఈమె ఎంపికయ్యింది. 18 దేశాల్లో జరిగిన హాకీ పోటీలకు దేశం నుంచి ప్రాతినిథ్యం వహించింది.

2019 లో టోక్యోలో జరిగిన ఒలంపిక్ ఈవెంట్ లో బంగారు పతకం సాధించింది. 2019 నవంబర్ లో భువనేశ్వర్ లో జరిగిన ఎఫ్ ఐ హెచ్ హాకీ ఒలంపిక్స్ క్వాలిఫైర్స్ లో విజేతగా నిలిచింది .2019 జూన్ లో హిరోషిమా లో జరిగిన ఎఫ్ ఐ హెచ్ సిరీస్ ఫైనల్లో గోల్డ్ మెడల్ సాధించింది .2019 లో కొరియాలో జరిగిన రిపబ్లిక్ ఆఫ్ కొరియా టూర్ లో ప్రథమ స్థానాన్ని పొందింది. 2019 ఏప్రిల్లో మలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది .2019 ఫిబ్రవరిలో స్పెయిన్ టూర్ లో జరిగిన మ్యాచుల్లో పాల్గొని విజేతగా నిలిచింది. 2018లోజకర్తా ,ఇండోనేషియా ఏషియన్ గేమ్స్ లో సిల్వర్ మెడల్ సాధించింది. 2017 లో జపాన్ లో జరిగిన ఏషియన్ కప్ లో గోల్డ్ మెడల్ సాధించింది .2016లో సింగపూర్ లో జరిగిన ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ లో గోల్డ్ మెడల్ సాధించింది. 2013లో మలేషియా లో జరిగిన ఏషియన్ కప్ లో బ్రౌన్జ్ మెడల్ సాధించింది. 2013లో ఏషియన్ చాంపియన్ ట్రోఫీ లో సిల్వర్ మెడల్ కూడా సాధించింది. 2010లో ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ లో బ్రౌన్జ్ మెడల్ సాధించింది .

2019 లో జరిగిన సీనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది. 2018 లో జార్ఖండ్ లో సీనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది. 2014లో మధ్యప్రదేశ్ లో జరిగిన సీనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది .2012లో మధ్యప్రదేశ్ లో జరిగిన సీనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది.

ఆమె ఓ ఇంటర్వ్యూ లో ఇలా తెలిపారు. నాలామారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారుల్ని ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనే విధంగా తయారు చేయాలన్నదే నా లక్ష్యం. దీనికోసం చిత్తూరు జిల్లా ను హాకీ హబ్ గా మార్చాలన్నది నా కల .

గ్రామీణ క్రీడాకారిణులకు మెరుగైన వసతులు కల్పించి వారికి అవకాశాలు దక్కేలా చూడాలని భావిస్తున్నాను.. తిరుపతిలోని శాప్ శిక్షణ కేంద్రంలో రాటుతేలడం వల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను అటువంటి వసతులు ఇప్పుడు లేవు. నేను రియో ఒలింపిక్స్ లో పాల్గొని తిరిగి వచ్చే వరకు ప్రభుత్వం నుంచి నాకు ఎటువంటి ప్రోత్సాహం అందలేదు

రియో పోటీల అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25 లక్షల నగదు బహుమతి గ్రూప్-2 ఉద్యోగం ప్రకటించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించిన ఆ బహుమతి నా కుటుంబానికి ఆర్థికంగా ఉపశమనం లభించింది. పోటీలనంతరం ఇచ్చే బహుమతులు కంటే క్రీడాకారుణులుగా ఎదిగే క్రమంలో అందే ప్రోత్సాహాలే మాకు ఎక్కువ ఉపయోగపడతాయన్నారు.

సౌకర్యాల ఊసే లేని కుగ్రామం నుంచి మొదలైన ఆమె ప్రస్థానం అంతర్జాతీయ స్థాయికి చేరింది.అవమానాలు చేసినవారికి తన ఆటతోనే బదులిచ్చింది. తన ప్రతిభ తో ఓ కుగ్రామానికి ప్రపంచ క్రీడా పటంలో చోటు లభించేలా చేసింది.

రచన:- చందమూరి నరసింహారెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s