
మారుమూల కుగ్రామంలో మొలకెత్తిన కార్టూనిస్ట్ ఆయన… సృజనాత్మక, హాస్యభరిత సినీ దర్శకులు . కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని గ్రామం నుండి రంగుల ప్రపంచమైన సినిమా రంగం చేరుకొనేందుకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఆయన పేరు గాంధీ. అసలు పేరు మనోహర్ రెడ్డి.
1968 జనవరి 15 న అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం బందారుచెట్ల పల్లి గ్రామంలో మనోహర్ రెడ్డి అలియాస్ గాంధీ జన్మించారు. తండ్రి మురికి నాటి ఓబుల్ రెడ్డి ,తల్లి సరోజమ్మ. వీరిది వ్యవసాయ కుటుంబం.
ఐదో తరగతి దాకా పోరెడ్డివారి పల్లిలో చదివాడు. ఉన్నత పాఠశాల విద్య నంబులపూలకుంట ఉన్నత పాఠశాలలోను తర్వాత ఇంటర్మీడియట్ కదిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివారు .1989 లో బి.ఏ డిగ్రీ అనంతపురం సాయిబాబా నేషనల్ కళాశాల నందు పూర్తి చేశారు.
వీరి సోదరులు లేపాక్షి రెడ్డి మంచి కార్టూనిస్ట్ .ఆయన నుంచి స్ఫూర్తి పొందారు.
ఇంటర్మిడియట్ చదివే రోజులలో అడపాదడపా కార్టూన్లు వేసేవాడు. మిత్రులతో కలిసి అల్లరి చిల్లరగా తిరిగేవారు. ఇలా తిరుగుతున్న గాంధీని మిత్రుడు ఉబ్బర ప్రసాద్ రెడ్డి ప్రోత్సాహం అందించి పూర్తి స్థాయిలో కార్టూనిస్టుగా చేశారు. కార్టూన్లు గీయడానికి అయ్యే ఖర్చు ప్రసాదరెడ్డి భరించేవాడు. అప్పటినుండి కార్టూన్లు వేయించి వాటిని ప్రసాద్ రెడ్డే అనేక పత్రికలకు పంపేవారు. అప్పట్లో ఒక్కో కార్టూన్ కు 10 రూ పాయలు మాత్రమే ఇచ్చేవారు. ఇలా కార్టూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించారు .
మనోహర్ రెడ్డి డిగ్రీ చదివే రోజులలో నవలలు , పుస్తకాలు బాగా చదివేవాడు .యండమూరి వీరేంద్రనాథ్ నవల డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అనే పుస్తకాన్ని చదివినప్పుడు ఆ నవలలో వున్న గాంధీ పాత్ర నచ్చింది.అప్పుడే తన పేరు గాంధీ గా మార్చుకున్నాడు .
30 ఏండ్లుగా కార్టూన్స్ వేస్తూ వున్నాడు . ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి , ఆంధ్రప్రభ, స్వాతి ,విపుల ఉదయం ,మయూరి చిత్రభూమి ఇలా అనేక తెలుగు పత్రికలలో ఈయన వేసిన కార్టూన్లు ప్రచురితమయ్యాయి. సినీ కార్టూన్లు వేయడంలో ఆయనది అందె వేసిన చేయి. ఇప్పటికే కొన్ని వేల కార్టూన్లు వేశారు.
ముఖ్యంగా అప్పుల జీవితం మీద సినిమాల మీద కార్టూన్లు ఎక్కువగావేసి ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. తెలుగులో చాలా మంది ప్రముఖ కార్టూనిస్ట్ లు ఈయన కార్టూన్లు ను అభినందిస్తూ కితాబిచ్చారు.
డిగ్రీ చదువు పూర్తీ చేశాక 1990 లో ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ చేరుకొన్నారు. మయూరి, చిత్రభూమి అనే పత్రికల్లో లే అవుట్ ఆర్టిస్ట్ గా చేరారు. అక్కడ ఓ ఏడాది పనిచేశాక సినిమా వైపు దృష్టి పడింది. జీవితం ఇక్కడే మలుపు తిరిగింది. చిత్రభూమి లో పనిచేసే ఏ.రాంబాబు అనే సినీ జర్నలిస్ట్ సాయంతో సినిమారంగంలో ప్రవేశించారు.
బ్రహ్మానందం హీరోగా పెట్టి “ సరసాల సోగ్గాడు” అనే సినిమా చేయబోతున్న నూతన దర్శకుడు సత్యప్రసాద్ దగ్గరకు రాంబాబు తీసుకెళ్ళి గాంధీ ని
పరిచయం చేశారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేసుకున్నారు. ఇలా సినీ ప్రస్థానం మొదలైంది.
ఆ సినిమా తర్వాత ‘సుప్రభాతం’ అనే పత్రికలో పనిచేసున్న ‘దిక్చూచి’ రామిరెడ్డి ద్యారా ప్రముఖ రచయిత బ్నిం పరిచయం అయ్యారు. బ్నిం తీసుకెళ్ళి బాపుగారికి పరిచయం చేశారు.
బాపు దగ్గర సహాయ దర్శకుడు గా మిస్టర్ పెళ్ళాం, పెళ్లికొడుకు, రాంబంటు తో పాటు ఈ టీవీ భాగవతం కు పనిచేసే అద్భుతమైన అవకాశం వచ్చింది.
ఆ తర్వాత దర్శకుడు ‘వంశీ’ వద్ద ఈటీవీ లో ప్రసారమయ్యే ‘లేడీ డిటెక్టివ్ ‘సీరియల్ కు సహాయ దర్శకులుగా పని చేశారు. జంధ్యాల వద్ద ఈటీవీ లో ప్రసారమయ్యే ‘పోపుల పెట్టె ‘సీరియల్ కూడా సహాయ దర్శకులుగా పని చేశారు.
దర్శకులు కె.రాఘవేంద్రరావు ఎఫ్ డి సి చైర్మన్ గా పనిచేస్తున్న కాలంలో ఆయన వద్ద స్టోరీ బోర్డు ఆర్టిస్ట్ గా ‘జన్మ భూమి’ కి సంబంధించిన షార్ట్ ఫిల్మ్స్ కార్యక్రమం లో భాగంగా యస్. యస్. రాజమౌళి ,వరముళ్ళపూడి ,ఏలేటి చంద్ర శేఖర్ తో కల్సి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు.
2004 లో ఎస్.పి.ఆర్. క్రియేషన్స్ పతాకం లో నిర్మాతలు ఎం. శ్రీనివాస్, కె. ప్రతాప్ రెడ్డి, పివి రమణ ఆద్వర్యంలో కథ ,మాటలు,
దర్శకుడు గా గాంధీ
“సారీ నాకు పెళ్లైంది” అనే మొదటి సినిమా చేశారు.
ఈ సినిమా 2004, మార్చి 05న విడుదలైంది . గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రఘు, రుతిక, లహరి, కొండవలస లక్ష్మణరావు, రఘు బాబు, కృష్ణ భగవాన్, శ్రీనివాస రెడ్డి, శివారెడ్డి, జీవా ముఖ్యపాత్రలలో నటించగా, కుమార్ సంగీతంఅందించారు.
దీని తర్వాత “ప్లీజ్ నాకు పెళ్లైంది “సినిమా చేశారు. 2005 ఆగస్టు 19 న విడుదలైంది. ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు డి ప్రభాకర్ నిర్మాత రఘు ,రాజీవ్ కనకాల శృతి నటించారు. కథ మాటలు దర్శకత్వం గాంధీ వహించారు.

ఏం బాబు లడ్డు కావాలా సినిమా కామిడి రొమాంటిక్ ఎంటర్టైనర్ . 2012అక్టోబర్ 21 న విడుదలైంది. ఇందులో శివాజి, అదితి అగర్వాల్, రచన మౌర్య, ఎమ్ ఎస్ నారాయణ, ఎ వి ఎస్, సత్యం రాజేష్, చిత్రం శీను తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు.
ఈ సినిమాకి దర్శకత్వం గాంధీ మనోహర్ నిర్వహించారు . నిర్మాత జనార్దన్. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ శ్రీలేఖ స్వరాలు సమకుర్చారు. ఈ సినిమాలో తనపేరు ను గాంధీ మనోహర్ గా మార్చుకొన్నారు.
ఆశ దోశ అప్పడం సినిమా కామిడి రొమాంటిక్ ఎంటర్టైనర్ . 2013 జూలై 19న విడుదలైంది.
ఇందులో శివాజి, సోనా చోప్రా , విజయ్ సాయి, కృష్ణుడు, చిత్రం శీను తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గాంధీ మనోహర్ నిర్వహించారు. సి డి నాగేంద్ర .ఈ చిత్రానికి నిర్మాత సంగీత దర్శకుడు రఘురామ్ .
ప్రస్తుతం ఓ సినిమా చేసే పని లో ఉన్నారు.

2019 లో తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్టూన్ పోటీల్లో తలిశెట్టి రామారావు అవార్డ్ అందుకున్నారు.
వీరి కార్టూన్లు కొన్ని
‘ రొమాంటిక్ జోక్స్ ‘ పేరుతో కార్టూన్ పుస్తకంగా వచ్చింది
రాయలసీమ నుంచి వెళ్లిన ఓ దర్శకుడు, కార్టూనిస్ట్ ఆయన. సినీ ఆరంభ దశలో నిర్మాతలు , నిర్మాణసంస్థలు, నటీ నటులు చాలా మంది రాయలసీమ వారు ఉండేవారు. ఇటివల కాలంలో సినీరంగంలో సీమ వాసులు తగ్గిపోతున్నారు. ఈరంగంలొని సీమ సాహిత్య ప్రియులనుప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
గాంధీ మనోహర్ 1999 డిసెంబర్ 10న గాండ్లపెంట మండలం తాళ్ల కాలువ కి చెందిన చిర్రపు ప్రశాంతి దేవి ని వివాహం చేసుకున్నారు . ఈమె న్యాయవాది .వీరికి ఒక కూతురు పేరు ప్రణతి. మీరు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు.
