YSR

తెలుగు తల్లి’రాజ’తిలకం మేరు నగధీరుడు

సువర్ణాంధ్రలో నవ్యాధ్యాయ సృష్టికర్త. రాయలసీమలో రాజకీయ మేధోగుణ సంపన్నుడిగా అంచలంచెలుగా ఎదిగిన మేరు నగధీరుడు డాక్టర్ వై.యస్ .రాజశేఖరరెడ్డి !
తెలుగింటి రాజసం. ఆంధ్రావని వైభవానికి దర్పణం..ఆయన విశ్వరూపు రేఖావిన్యాసం!ప్రత్యర్ధులను సైతం చిరునవ్వు తో గెలిచి..
అధినాయకత్వానికే వెన్నుదన్నుగా నిలిచి..జాతీయ రాజకీయాలపైనే చెరగని ముద్ర వేసిన ఘనత సొంతం చేసుకున్న రైతన్న ముద్దు బిడ్డ..పులివెందుల పులి బిడ్డ
వై.యస్. రాజశేఖరరెడ్డి! ఇంటిల్లిపాదికీ సమవర్తిగా..సేద్య సీమలో రైతుబిడ్డగా ..పేదల గుండెల్లో రాజన్నగా..రాయలసీమకే రాజమకుటమై..తెలుగు గడ్డకే దివ్యతేజమై రాజకీయాలను శాసించి..పాలించిన ఘనత సీమబిడ్డకే సొంతం. అదే రాజన్న రాజసం.

కోట్లాది ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని చిరస్థాయి గా నిలిచిన నేత శ్రీ వై.యస్ రాజశేఖరరెడ్డి . పేద ప్రజల గుండె చప్పుడు శ్రీ వై.యస్.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొన్న ఏన్నో పథకాలు ప్రవేశపెట్టిన నాయకుడు.

సమస్యల పరిష్కారం కోసం పోరాటమే ఊపిరి గా ఉద్యమాలు సాగించిన అలుపెరగని పోరాట యోధుడు వై.యస్.
వై.యస్ గురించి వివరించడానికి పదాలు లేవు, అక్షరాలు పేర్చలేము.
వై.యస్ రాజకీయ జీవితం పూలబాటేమీ కాదు. యోధాను యోధులతో ఢీ కొంటూ తన ప్రయాణం సాగించి విజయం సాదించిన
మేరు నగధీరుడు.

యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి
1949 జూలై 8 న వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించాడు. తల్లి జయమ్మ , తండ్రి రాజారెడ్డి. ఆయన మిలటరీ లో కొంత కాలం పనిచేశారు. తర్వాత ఆయన బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేశారు. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు పులివెందుల లో చదివారు. 7వ తరగతి నుండి పాఠశాల చదువంతా బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో చేరాడు. బి.యస్సీ మొదటి సంవత్సరం మాత్రం విజయవాడ లయోలా చదివారు. రెండవ ఏడాది వదిలేసి యం.బి.బి.యస్ చేరారు.1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్యవిద్యలో పట్టా పుచ్చుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల (యెస్.వి.ఆర్.ఆర్), తిరుపతి నుంచి హౌస్‌సర్జన్ పట్టా పొందాడు. అనంతరం జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేశాడు. తరువాత 1973లో పులివెందులలో తండ్రి వై.ఎస్.రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. పులివెందుల లో ఒక్క రూపాయికే వైద్యం అందించి రూపాయి డాక్టర్ గా పేదల హృదయాలలో పేరుగడించారు.

వై.యస్ రాజశేఖరరెడ్డి తన ప్రాథమిక విద్య సమయంలో వెంకటప్పయ్య అనే గురువు వద్ద పెరిగారు. ఆయన తన గురువు జ్ఞాపకార్థం పులివెందుల లో వెంకటప్పయ్య మెమోరియల్ స్కూల్ నిర్మించారు. ఎప్పుడో చిన్నపుడు చదువు చెప్పిన గురువు ను గుర్తు పెట్టుకొని ఆయన పేరుతో స్కూల్ స్థాపించి , ఆ స్కూల్ ప్రాంగణంలోనే ఆయనకు విగ్రహం కట్టించి , ఒక్క రూపాయి కూడా ఫీజు వసూలు చెయ్యకుండా , కార్పోరేట్ స్కూల్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తూ, చక్కటి ఆహ్లాద కర వాతావరణం లో కులం,మతం,ప్రాంతం, పార్టీలు అనే బేధాలు లేకుండా పేద వారు అయితే చాలు అడ్మిషన్ ఇచ్చి కొన్ని లక్షల మందికి విద్య దానం చేయాలనే మంచి ఉద్దేశ్యంతో నిర్మించిన స్కూలే శ్రీ వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ,ఈ స్కూల్ ను నిర్మించింది వైస్సార్ గారు. నేటికీ విజయవంతగా స్కూల్ ను వై.యస్. కుటుంబ సభ్యులు నడుపుతున్నారు. వై.యస్.గురు భక్తి కి ఇదో తార్కాణం.

★రాజకీయ జీవితం★

గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవృత్తినిఅభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థిసంఘానికి అధ్యక్షుడిగావ్యవహరించాడు.విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి యస్.వి.ఆర్.ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్‌సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులోఅడుగు పెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు.

1975లొ తిరుపతిలొ జరిగిన యువజన కాంగ్రేస్ రాష్ట్రస్థాయి సభకు సంజయ్ గాంధీ వొచ్చారు.ఆసందర్భంలోనే అనేకమంది యువకులు కాంగ్రేస్ లో చేరారు. ఈసభలోనే వై.యస్ కాంగ్రేస్ లో చేరారు. కడప జిల్లా యూత్ కాంగ్రేస్ కార్యదర్శిగాకూడాపనిచేశారు.

పులివెందుల నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రేస్ కంచుకోట. పెంచికల బసిరెడ్డి మూడుసార్లు MLA గెలిచి మంత్రిగా పనిచేశారు. 1973లో జలగం వెంగళరావ్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న బసిరెడ్డి వెంగళరావుకు వ్యతిరేకంగా అసమ్మతివర్గంలో చేరిపోయారు. కడప జిల్లా మీదకూడ పట్టుకలిగి ఉండేవారు.

బసిరెడ్డిని స్థానికంగా దెబ్బకొట్టటానికి వెంగళరావు వర్గం వెదుకుతుండగా రత్నసభాపతి(రాజంపేట ఎమ్మెల్యే),కుందారామయ్య ( జమ్మలమడుగు ఎమ్మెల్యే )లకు వై.యస్ కనిపించారు.1977 లోక్ సభ ఎన్నికల్లొ బసిరెడ్డి జనతాపార్టీ అభ్యర్ధి ఊటుకూరు రామిరెడ్డి (మైసురారెడ్డి మేనమామ)కు మద్దతు ఇచ్చాడు.బసిరెడ్డి జనతాపార్టిలో చేరటంతొ పులివెందుల కాంగ్రేస్ కు వై.యస్ రాజశేఖరరెడ్డి నాయకుడయ్యాడు.ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది ఈ మొదటి ఎన్నికలే.రత్నసభాపతి ,కుందా రామయ్య లే మూల కారకులు.

వై.యస్ పై1977లో ఒక హత్యాప్రయత్నం జరిగింది. రాజా రెడ్డి, వై.యస్ హైద్రాబాదు లో సెక్రటేరియట్ నుంచి బయటకు వస్తుండగా ప్రత్యర్ధులు తుపాకితో కాల్పులుజరిపారు. హత్యాప్రయత్నం నుంచి తప్పించుకున్నారు.

రాజారెడ్డి ప్లానింగు తో 1978 ఎన్నికలకు దాదాపు సంవత్సరం ముందు నుంచే కాంగ్రేస్ అభ్యర్ధిగా వై.యస్ ప్రచారం మొదలుపెట్టారు. అనేక గ్రామాలలో పెద్దలు ఆయన కు సహకరిస్తామని మాటిచ్చారు.

1978 జనవరి లో అంటే ఎన్నికలు మరో 50 రోజుల్లుండగా కాంగ్రేస్ పార్టీ చీలి ఇందిరా కాంగ్రేస్ పార్టీ ఏర్పడింది. వై.యస్ ఇందిరా కాంగ్రేస్ టికెటును నిరాకరించి బ్రహ్మానందరెడ్డి నాయకత్వం లొని కాంగ్రేస్ తరుపున పోటికి దిగారు.డి.యన్.రెడ్డి జనతాపార్టీ తరుపున పోటిచేశారు. ఇందిరా కాంగ్రేస్ కు అభ్యర్ధి కూడ దొరకని పరిస్థితిలో అప్పటి కడప పార్లమెంట్ సభ్యులు కందుల ఓబులరెడ్డి తన బంధువైన డాక్టర్ బండి సోమిరెడ్డిని కడప ఎన్నికల సభలో ఇందిరాకు పరిచయం చేసి అక్కడే టిక్కెట్ ఇప్పించారు.

ఇందిరా కాంగ్రేస్ అభ్యర్ధి సోమిరెడ్డి మొదట అంటే 1976-1977లో వై.యస్ కు మద్దతు ఇచ్చి అనేక గ్రామాల్లొ వై.యస్ ను పరిచయం కూడ చేశారు.సోమిరెడ్డిగారి సొంత మామ కూడ ముందుగా వై.యస్ కు మాటిచ్చానని అల్లుడు సోమిరెడ్డికి కాకుండ వై.యస్ కే ఎన్నికల్లో మద్దతుఇచ్చారు.అనేకమంది ఇలా ముందుగా ఇచ్చిన మాట ప్రకారం మద్దతు ఇవ్వటం వలనే వై.యస్ గెలిచారు. ఇలా మొదటి ఎన్నికల్లో ఆవు దూడ గుర్తు పై ఎన్నికైయ్యారు .

1978లో చెన్నారెడ్డి ప్రభుత్వంలో పార్లమెంట్ సెక్రేటరిగా పనిచేశారు.1980లో అంజయ్య మంత్రివర్గంలో వై.యస్ తొలిసారి మంత్రి అయ్యారు. మిత్రులు కాసు కృష్ణారెడ్డి, పి.జనార్దన్ రెడ్డి , చంద్రబాబు, అప్పుడే మంత్రులైయ్యారు.

వై.యస్ ధీటైన నాయకత్వ లక్షణాలు కారణంగా1984లో అంటే 35 సంవత్సరాల చిన్న వయస్సులోనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని చేశాయి. అప్పటి నుంచి రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగారు. తనను నమ్మిన అనేక మంది మిత్రులను శాసన సభ్యులు గా పార్లమెంట్ సభ్యులు గా మంత్రులు గాచెయ్యగలిగారు.

1984 ఎన్నికల్లో కడప పార్లమెంట్ సభ్యులు గా కాంగ్రేస్ తరుపున పోటీ చేసిన కందుల ఓబులరెడ్డి ఓడిపోయారు.
1984 ఎన్నికల్లో తెలుగుదేశం తరుపున పోటిచేసిన డి.యన్ రెడ్డి చేతిలో కందుల ఓటమి చెందటంతో వై.యస్ సహకరించక పోవటం వలనే ఓడిపోయానని కక్ష్యపెంచుకున్నారు.

1984లో వై.యస్ పి.సి.సి.అధ్యక్షుడుగా ఎన్నిక కాకుండా శతవిధాల ప్రయత్నం చేసి చివరికి కాంగ్రేస్ కు రాజీనామా చేశారు.

వై.యస్ పులివెందుల శాసన సభ్యులు గా 1978,1983,1985,1999,2004,2009 ఎన్నికల్లో గెలిచారు. కడప పార్లమెంట్ సభ్యులు గా 1989,1991, 1996, 1998 ఎన్నికల్లో గెలిచారు. పులివెందుల నుంచి రెండు సార్లు హ్యాట్రిక్ ఏమ్మల్యే
కడప నుంచి హ్యాట్రిక్ యం.పి.

వై.యస్ ఓటమెరగని నాయకుడు.వరుసుగా 10 ఎన్నికల్లో గెలిచారు. నియోజకవర్గంమారకుండా, వరుసుగా ప్రతి ఎన్నికలొ పోటీచేసి గెలిచిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో లేరు.దేశంలొ కూడ ఇలాంటి రికార్డు లేదేమొ.

వై.యస్ రాజకీయ జీవితంలొ అతిక్లిష్టమైన ఎన్నిక 1996 లోక్ సభ ఎన్నికలు. చంద్రబాబుముఖ్యమంత్రిగా,మంత్రి వీరారెడ్డి,మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి, తులసిరెడ్డి ప్రత్యక్ష్యంగా,కాంగ్రేస్ లో ఉన్న మైసురా రెడ్డి పరోక్షంగాను పనిచేశారు. జిల్లా పోలీసు అధికారి అధికారపార్టీ కి అనుకూలంగా పనిచేయడం వల్ల వై.యస్ కు చమటలు పట్టించారని చివరికి 5445 ఓట్లతేడాతో ఎట్టకేలకు గెలిచారు.

రాష్ట్ర శాసనసభ ప్రతిపక్షనేతగానూ, రెండు సార్లు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడిగానూ పనిచేశాడు. 1980 నుంచి 1983 దాకా గ్రామీణాభివృద్ధి, వైద్యశాఖ, విద్యాశాఖ మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించాడు. తెలుగు దేశం నేత నారా చంద్రబాబు నాయుడు మొదటగా కాంగ్రెస్ లో ఉన్నపుడు ఇరువురూ మంచి మిత్రులు. 1985 నుంచి 1998 వరకు పార్టీలో వై.ఎస్. నిత్య అసమ్మతివాదిగా పేరుపడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. 1989-94 మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి రెండు సార్లు పనిచేశాడు. తొలిసారి 1983 నుంచి 1985 వరకు మరియు రెండో పర్యాయం 1998 నుంచి 2000 వరకు ఆ పదవిలో ఉన్నాడు. 1999 నుంచి 2004 వరకు 11 వ శాసనసభలో ప్రతిపక్షనేతగానూ వ్యవహరించాడు.

2003 వేసవికాలంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించాడు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్.కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది.

2004 మే లో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికస్థానాలు సాధించడంతో అదివరకే పార్టీలో పేరుసంపాదించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయటం, జలయజ్ఞంలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలు పైనే చేశాడు.

2009 ఏప్రిల్లో జరిగిన 13వ శాసనసభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించడానికి కృషిచేసి వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాడు.


పాదయాత్ర
1986లో వైయస్ పాదయాత్ర
నిరంతర కరువు పీడిత రాయలసీమ జిల్లాలకు సేద్యపు నీటి సౌకర్యం పెంపొందించడం కోసం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 45 వేల క్యూసెక్కులకు పెంచాలని 1986లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి లేపాక్షి నుండి పోతిరెడ్డిపాడు వరకు దాదాపు 400 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆయనే 2003లో చేవెళ్ల నుండి ఇచ్ఛాపురం వరకు మండు వేసవిలో సుమారు 1500 కిలోమీటర్ల మేర ప్రజాప్రస్ధాన యాత్ర చేశారు. ఈ పాదయాత్ర రైతాంగంలో నెలకొన్న నిరాశ నిస్పృహలను తొలగించి వారిలో ఆత్మవిశ్వాసం కలిగించింది.

డా. వై.యస్ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక శ్రీశైలం కనిష్ఠ నీటిమట్టం 854 అడుగులు ఉండేలా 107 జి.ఓను 28-9- 2004లో తీసుకొచ్చాడు. ఈ జి.ఓ కు వ్యతికరకంగా అప్పట్లో విజయవాడలో ఉద్యమాలు చేసారు. 854 అడుగులకు తక్కువ లోను కింది వారు నీళ్ళు పొందవచ్చనడంతో అది ముగిసింది. పోతిరెడ్డిపాడు వద్ద నీళ్ళు పొందేందుకు వేరేమార్గం లేకపోయింది. జలయజ్ఞంలో భాగంగా డా వై .యస్ రాజశేఖరరెడ్డి జి.ఓ170, 13-9-2005లో తీసుకొచ్చారు. వరద కాలంలో 101 టి.యం.సీలు పొందే లాగా 40,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పోతిరెడ్డిపాడు ను విస్తరించారు. కె. సి కెనాల్ 10 టి.యం.సీల కోసం జి.ఓ 233 ద్వారా మరో నాలుగు వేల క్యూసెక్కులకు పెంచి మొత్తం 111టి.యంసీలు పొందేలా 44,000 క్యూసెక్కులకు పోతిరెడ్డిపాడును విస్తరించాడు

కృష్ణా డెల్టా రైతుల చిరకాల కోరిక అయిన పులిచింతల ప్రాజెక్టు కి 2004 లొ వై.యస్ శంకుస్థాపన చేసారు ,ఆయన హయాము లొ 90% పనులు పూర్తి కాగా , 10% పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి.

కృష్ణా డెల్టాకు వరద వచ్చినప్పుడు రైతు పడుతున్న కష్టాలు చూసి 2008 జూన్ 6 న 4,573 కొట్ల తొ డెల్టా ఆదునీకరణ పనులు ప్రారంభించారు .

నూజివీడు లో పులివెందుల లో రాజీవ్ గాంధి యునివర్సిటి ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజి (ఐ.ఐ.ఐ.టి) ప్రారంభించారు వై.యస్.

నాగాయలంక మండలం , భావ దేవర పల్లి లో రాష్ట్రం లోనే తొలి ఫీషరీస్ పాల్ టెక్నిక్ కళాశాలను వై.యస్ ప్రారంభించారు్

ప్రతిష్టాత్మకమైన జాతీయ విద్యాసంస్థ అర్చిటెక్చర్ కాలేజీ ని విజయవాడకి తెచ్చారు.

15.10 కోట్లతో నూతిపాడు ఎత్తిపొతల పతకాన్ని పూర్తి చెసి 30000 ఎకరాలకు సాగునీరు అందించారు

నూజివీడులో 12 కోట్లతో ఉద్యానవన పంటల చీడపీడల నియంత్రనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

మండలి వెంకటకృష్ణ రావు వారధి – పెనుముడి – పులిగడ్డ కృష్ణా నదిపైన బ్రిడ్జి 2004 లో అధికారం లోకి వచ్చాక మొదలుపెట్టి 2006 లో ప్రారంభం ద్వారా దాదాపు 40లంక గ్రామాలకు మెరుగైన రవాణా సదుపాయం.

సంక్షేమ పథకాలు అంటే గుర్తుకొచ్చేది ఆయనే. బడుగు బలహీన వర్గాలకు గూడునిచ్చి (ఇందిరమ్మ ఇళ్లు), ఫించనుతో వారికి ఆకలి తీర్చాడు. ఆరోగ్యశ్రీతో ఎందరికో పునర్జమ్మ అందించాడు. ప్రజల హితం కోరిన వైఎస్ రాజశేఖరరెడ్డి మహానేత అయ్యారు. చెదరని చిరునవ్వుతో ప్రతి పేదవాడిని పలకరించే నేత రాజన్న.

తాను ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి ఎంతో నిజాయతీగా, నిబద్ధతతో కృషి చేసిన వ్యక్తి వైఎస్సార్. పేద ప్రజలకు కార్పోరేట్ వైద్యం కల అనుకుంటే.. దాన్ని సైతం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి వారి కలను నిజం చేశారు.

ఉన్నత చదువులు కొనలేమని భావించిన సరస్వతీ పుత్రులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వరం కల్పించిన ఘనుడు వైఎస్సార్. నిరుపేద ముస్లిం యువతకు విద్యా ఉద్యోగావకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. పండుటాకులకు పింఛను ఇచ్చి వారి ఆకలి తీర్చారు. తినే అన్నం మెతుకుల్లో, ఆయన కట్టించిన ఇందిరమ్మ ఇళ్లలోనూ, తమకు పునర్జన్మ ప్రసాదించిన రాజశేఖరుడిని తలుచుకుని నేటికీ కన్నీళ్లు పెడుతున్నారు.

జనం కష్టసుఖాలను తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి చలించిపోయారు. దేశానికి వెన్నెముక వ్యవసాయమేనని బలంగా విశ్వసించి సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతూ జలయజ్ఞం ఆరంభించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు అండగా నిలిచారు. రైతు రుణాలు మాఫీ చేసి లక్షల రైతు కుటుంబాల్లో వెలుగులు నింపారు.

రైతులకు ఉచిత విద్యుత్, 108 (అంబులెన్స్ సర్వీసులు), ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటు సహా ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఎన్నో ప్రాజెక్టులు క‌ట్ట‌డ‌మే కాదు, మ‌రెన్నో ప‌రిశ్ర‌మ‌లను రాష్ట్రానికి తెచ్చి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అభివృద్ధిలో ప‌రుగులు పెట్టించిన నాయ‌కుడు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వై.య‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి .

★ఆత్మీయత అనుబంధం★

కేవీపీ రామచంద్రరావు గారితో పాటుగా వై.యస్ రాజశేఖరరెడ్డి గారికి ప్రాణ స్నేహితులెవరైనా ఉన్నారంటే స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారే.జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వరసలు పెట్టి పిలుచుకునేంతటి అనుబంధముంది.

కన్నా లక్ష్మీనారాయణ ,
దాసరి నారాయణ రావు ,
బొత్సా సత్యనారాయణ ,
వట్టి వసంత కుమార్ ,
జక్కంపూడి రామ్మోహన్ రావు
పళ్లం రాజు ,
సాయి ప్రతాప్ ,
దానం నాగేందర్ ,
మండలి బుద్ద ప్రసాద్ ,
సామినేని ఉదయబాను,
వల్లభనేని బాలసౌరి
వై.ఎస్ రాజశేఖరరెడ్డి గారి హయాంలో తమకంటూ ప్రత్యేకంగా పేరు ప్రతిష్టలు,గౌరవమర్యాదలు,కీర్తిని సంపాదించుకున్న కాపు సామజికవర్గానికి చెందిన నేతలు.

ఇక వంగవీటి రంగా గారితో రాజశేఖరరెడ్డి గారికున్న అనుబంధం ప్రతి ఒక్కరికి తెలియంది కాదు.1983లో వంగవీటి మోహన రంగా గారికి నాటి పీసీసీ చీఫ్ కోన ప్రభాకరరావు గారు పార్టీ సభ్యత్వం ఇవ్వడానికి సైతం నిరాకరిస్తే తనలాంటి స్వభావం,ఆలోచనలు నూటికి నూరు శాతం కలిగి ఉన్న వ్యక్తిగా రంగా గారిని భావించి రాజశేఖరరెడ్డి గారు పీసీసీ చీఫ్ అయిన వెంటనే వచ్చిన 1985 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకొని విజయవాడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేసి అసెంబ్లీలో తన సహచరునిగా కూర్చోబెట్టుకున్నారు.వంగవీటి మోహన రంగా గారు మరణించినప్పుడు ఆయన పార్థివదేహం పక్కనే ఉండి ఒక మిత్రుడిని కోల్పోయానన్న భావోద్వేగంలో కళ్లనీళ్లు పెట్టుకున్నారు.

సెప్టెంబర్ 2, 2009 న చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం గం.9.35 నిమిషాలకు హెలికాప్టరు‌తో సంబంధాలు తెగిపోయాయి. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్ళు లభించాయి. వై.ఎస్.తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలోమరణించారు.
తమ అభిమాన నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రంలో చాలామంది
మరణించారు.
వీరిలో చాలా మంది గుండె ఆగి మరణించగా కొద్ది మంది ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రమాదస్థలమైన రుద్రకొండ కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు – వెలుగోడుకు సమీపంలోని నల్లమల అడవుల్లో ఉంది.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాగా ఇంకొకరు కుమార్తె షర్మిలారెడ్డి.

వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి. వీరికి ఇద్దరు సంతానం. హర్షారెడ్డి, వర్షారెడ్డి. షర్మిల, అనిల్‌కుమార్‌ దంపతుల సంతానం రాజారెడ్డి, అంజలీరెడ్డి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ్ముడు వైఎస్‌ వివేకానందరెడ్డి. ఈయన 1999, 2004 ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1989 1994 ఎన్నికల్లో పులివెందుల నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయనను ఇటీవలే ప్రత్యర్థులు హత్య చేసిన విషయం తెలిసిందే.

పేదల ముఖాల్లో చిరునవ్వు కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన నాయ‌కుడు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వై.య‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి

వై.యస్ గురించి పలువురు నాయకుల అభిప్రాయం.

ప్రజాశ్రేయస్సు కోసం అహరహం పాటుపడి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన గొప్పనేత వైఎస్‌. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఆయన సహకారం, ఆలోచనలపై ఆధారపడేవాడిని. ప్రజల నుంచి పుట్టుకొచ్చిన నేత. రాష్ట్ర అభివృద్ధి కోసం తపించేవారు. పేదల కోసం వైఎస్‌ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు భవిష్యత్తులో కూడా నేతలందరికీ స్ఫూర్తినిస్తాయి. తన రాజకీయ జీవితంలో చేపట్టిన ప్రతి పదవికీ వన్నె తెచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను రెండుసార్లు గెలిపించిన ఘనత ఆయనదే.
– మన్మోహన్‌సింగ్, మాజీ ప్రధానమంత్రి

పేదల నాయకుడు
ప్రజాకర్షణగలిగిన పేదల నాయకుడు వైఎస్‌. తన తుది శ్వాస వరకూ పేదలు, అట్టడుగు వర్గాల వారి కోసం పోరాడిన నేత. అంకిత భావంతో కృషి చేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు.
– మీరా కుమార్, లోక్‌సభ మాజీ స్పీకర్‌

సంక్షేమంతో అందరికీ చేరువయ్యారు..
వైఎస్‌ రాజశేఖరరెడ్డి నేడు రాజకీయాల్లో ఉన్న అనేకమంది నాయకులకు ఆదర్శప్రాయుడు. చక్కటి పరిపాలనా జ్ఞానం, కార్యాచరణ సామర్థ్యం ఆయన సొంతం. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసిన అనేకానేక పథకాలు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తాయి. నిరుపేదలకు సాయంచేసే విషయంలో తానే అన్నీ అనే రీతిలో ముందుంటారు. పేద రైతులు, చేనేత కార్మికులు, కార్మిక వర్గాలు సహా అన్ని వర్గాల అభ్యున్నతికి పథకాలు రూపొందించి అమలు చేయడం ద్వారా ప్రతి ఒక్కరికీ దగ్గరయ్యారు.
– ఎం. కరుణానిధి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి

మాటకు కట్టుబడి ఉండే మంచి మనిషి
నిర్ణయాలు తీసుకోవడంలో తనకు తానే సాటి. రాజకీయాలలో ఎందరో నేతలుంటారు కానీ వైఎస్‌ది విలక్షణ శైలి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే మనిషి. తన వద్దకు సాయం కోసం వచ్చిన వ్యక్తిది ఏ వర్గం, ఏ పార్టీ, ఏ ప్రాంతం అని ఆలోచించకుండా ఓకే ఓకే… అనడం ఆయన తత్వం. ఆయన స్మృతి ప్రజల హృదయాలలో ఎల్లకాలం నిలిచిపోతుంది.
– రోశయ్య, మాజీ ముఖ్యమంత్రి

జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన నాయకుడు
పాతికేళ్ల రాజకీయ జీవితం మొత్తాన్ని ప్రజలకే అంకితం చేసిన గొప్ప నాయకుడు వైఎస్‌. ముఖ్యమంత్రిగా ఆరేళ్లలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు.
–ఎల్‌కే అద్వానీ, బీజేపీ అగ్రనేత

అందరికీ ఆమోదయోగ్య పాలకుడు
మైనారిటీలకు ఎంతో సేవ చేసిన నాయకుడు. మాట నిలబెట్టుకునే మనిషి. ఆవేశం, ప్రణాళికతో కూడిన వ్యూహాత్మక నాయకుడు. ముస్లింల పేదరికం పట్ల ఆయన చాలా ఆందోళన కనబరిచేవారు. విద్యా, ఉపాధి రంగాల్లో ముస్లింలకు రిజర్వేషన్‌ కల్పించారు. పాతబస్తీ అభివృద్ధికి రెండువేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. అందులో ఆరేడువందల కోట్లు మురుగు నీటి సమస్య పరిష్కారానికి ఇచ్చారు.
– అసదుద్దీన్‌ ఒవైసీ, పార్లమెంటు సభ్యుడు

ఇలా వై.యస్ గురించి ఏంత చెప్పినా తక్కువే అవుతుంది.
కుయ్… కుయ్…. అనే కూత వినగానే ప్రతి ఒక్కరి మదిలో మెదిలేది డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డే అని చెప్పడం అతిశయోక్తికాదు.

ఫీజు రియంబర్స్ మెంట్ అంటే గుర్తుకొచ్చేది వై.యస్. ఆర్

రైతుకు ఉచిత విద్యుత్ అనగానే మెదిలే నాయకుడు రాజశేఖరుడే

ఇలాంటి మహానేత కు
నమః సుమాంజలి ఘటిస్తూ

సేకరణ:-చందమూరి నరసింహారెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s