విద్వాన్ విశ్వం

అనంతపురం జిల్లా తరిమెల గ్రామానికి చెందిన రామయ్య, లక్ష్మమ్మ దంపతుల సంతానం విశ్వం. విద్వాన్ పట్టా పొందిన విద్వాన్ విశ్వం ప్రజలందరికీ సుపరిచితులు. 1915 అక్టోబరు 21న జన్మించిన విశ్వం వివిధ రంగాలలో రాణించారు. స్వాతంత్ర్య సమరయోధునిగా ప్రజాభిమానం చూరగొన్నారు. సాహితీవేత్తగా సాహితీపరుల హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు. విద్వాన్ విశ్వం వివిధ పత్రికల్లో సంపాదకులు గా పనిచేశారు. మీజాన్, ప్రజాశక్తి, అభ్యుదయ పత్రికల్లో పనిచేశారు. భారతి సాహిత్య పత్రికలో గ్రంథ సమీక్ష శీర్షిక నిర్వహించారు. ఆంధ్రప్రభ వారపత్రికలో 1952 నుండి సంపాదకులుగా పనిచేశారు.. మాణిక్యవీణ శీర్షిక ద్వారా పాఠక హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. విరికన్నె పద్యకావ్యాన్ని రచించారు. చెహోవ్, రోమారోల, గోర్కీల రచనలను తెనిగించారు. కల్హనుని రాజతరంగిణి, కథాసరిత్సాగరం 12 సంపుటాలను తెలుగులోకి అనువదించారు.

విశ్వం విరచించిన పెన్నేటి పాట రాయల సీమ జీవన స్రవంతిని అక్షరబద్ధం చేసిన సజీవ దృశ్యకావ్యం. ఇదే ఆయనను సాహితీ లోకంలో చిరస్మరణీయునిగా చేసింది.
పాలకుల నిర్లక్ష్యం కొంత, ప్రకృతి చిన్నచూపు కొంత. హైటెక్ మాయలు మరికొంత. వెరసి రాయలసీమ కష్టాల బాటలో నడుస్తోంది. అభివృద్ధికి నోచక వెనుకబడి పోయింది. మేఘుని కరుణా కటాక్షాలకై ఎదురుతెన్నుల చూస్తూ జీవనం సాగిస్తున్నారు మట్టిని నమ్మిన రైతులు. బావులు ఎండిపోతున్నాయి. నానాటికి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోర్లు వేసేందుకు అప్పులు తెచ్చి వందలాది అడుగుల లోతు వరకు బోరు వేసి నీళ్ళు పడక అప్పుల్లో పీకల దాకా కూరుకు పోతున్నారు. అపర భగీరథునిలా విశ్వ ప్రయత్నం చేస్తూ రాయలసీమ రైతన్న తన్నుతాను భూమిలో పాతుకుంటున్నాడు.
రాయలసీమ ఫ్యాక్షన్ సీమ. ఇదీ ప్రచారంలో వున్న తీరు. వాస్తవం దీనికి భిన్నం. ఏ కొద్ది మందో ఫ్యాక్షన్ పడగనీడలో వున్నారు. బాంబుల సంస్కృతే
వారి సంస్కృతిగా, జీవిత పరమావధిగా, అధికార కాంక్షగా వుంది. కాని విశాల ప్రజాబాహుళ్యం జీవన పోరాటంలో అలసిసొలసి నిదిరిస్తున్నవారే. కక్ష్యలు, కార్పణ్యాలకు దూరంగా ఉన్నవారే. ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నవారే.

అచట నొకనాడు పండెముత్యాల చాలు/అటనొకుపుడు నిండె కావ్యాల జాలు/
అచటనౌకపుడు కురిసె భాష్యాల జల్లు / విరిసెనట నాడు వేయంచు విచ్చుకత్తి.
అంటూ రాయలసీమను విద్వాన్ విశ్వం కీర్తిస్తాడు. నిజమే రాయలసీమల రతనాలసీమ, తెలంగాణ కోటి రతనాల వీణ. ఇది గత కాలపు వైభవం. గతమంతా నడిచె కాస్తాకూస్తో వైభవంతో వర్తమానమంతా కన్నీళ్ళతో, కావ్యాలతో, భాష్యాల తో. రతనాల రాసుల అంగళ్ళతో అలరాలిన రాయలసీమ నేడు లేదు. గతమెలా వున్నా వాస్తవ ప్రపంచాన్ని, భవిష్యత్ చిత్రపటాన్ని దర్శించేవాడు కవి. ప్రజా పక్షమున్న కవి దీన్ని సరిగ్గా, ఖచ్చితంగా పట్టుకుంటాడు.
‘నా గీతంలో / లోకం ప్రతిఫలించి / గుండెలలో ఘూర్ణిల్లగా జాతిజనులు పాడుకొనే మంత్రంగా కావాలని’ కోరుకునే కవి విద్వాన్ విశ్వం. అందుకే రాయలసీమ ప్రజల కన్నీటి పాటను పెన్నేటిపాటగా సాహితీ పాఠకలోకానికి అందించాడు. ఆయన దర్శించిన ఛిద్రమైన బతుకు చిత్రం నేటికీ అదృశ్యం కాలేదు. మరింతగా అధ్వాన్నమయింది
ప్రపంచీకరణ పడగ నీడలో.అందుకే పెన్నేటిపాట కావ్యం నేటికీ సజీవ రచనగా నిలిచింది.
ఇది గతించిన కథ వినిపింతునింక | నేటి రాయలసీమ కన్నీటిపాట కోటి గొంతులు కిన్నెర మీటుకొనుచు / కోటి గుండెల కంజరికొట్టుకొనుచు … అంటూ రాయలసీమ సంక్షోభ జీవితాన్ని పెన్నేటి పాటగా మలిచాడు విద్వాన్ విశ్వం. రాయలసీమ జీవనధార పెన్నేరు. ఆ పెన్నానది ఎందుకు ఎండి పోయింది ? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఎండిపోయింది?
రాయలసీమలోనే గాక రాష్ట్రంలోనే అది పెద్దదైన అనంతపురం జిల్లా ఎందుకు ఎడారిగా మారుతోంది? ఇవన్నీ ఆనాడే విశ్వం మదిని తొలచిన ప్రశ్నలు. అందుకే ఆయన ఇలా ప్రశ్నిస్తాడు.
అదే పెన్న ! అనే పెన్న ! నిదానించినడు !/ విదారించు నెదన్, వట్టి ఎడారి తమ్ముడు !!
ఏదీనీరు ? ఏదీ హోరు ? ఏదీ నీటి జాలు ?/ ఇదే నీరు! ఇదే హోరు! ఇదే ఇసుక వాలు!!
ఇంత మంచి పెన్నతల్లి ఎందుకెండిపోయెనో ? /ఇంత మంచి కన్నతల్లి ఎందుకిట్ల మారెనో ?
ఈ యధార్థ జీవన వ్యధార్ధ దృశ్యం పాలకులు మారినా ఏ మాత్రం మారలేదు.
ఈ నేపథ్యంలో నుంచి 1956లో రాసిన పెన్నేటిపాట నేటికీ సజీవ రచనే. పెన్నేటి పాటలో వర్ణించిన కన్నీటి గాథ నేటికీ రాయలసీమ ఎల్లెడలా కన్పిస్తుంది. పల్లెల్లో కళ తప్పిన పెళ్ళిళ్లు, ఆనందం లోపించిన పండుగలు నేడు సాధారణ దృశ్యాలు.
కటిక కారము, సంగటి, ఎండు రొట్టె ముక్కలు, మిరప తొక్కుతో కడుపు నింపుకొంటున్న కూలీలు, రైతులు కోకొల్లలు. వలస వెళ్లిన జీవితాలకు దర్పణం నేటి నిర్మానుష్యపు గ్రామసీమలు.
ఎన్ని బడబాగ్నులా చిన్నయెడద / రగులుచున్నవో ?
ఎన్ని కార్చిచ్చులున్న యవియొ ?
ఎన్ని సంవర్త ఝుంఝుల కెదురునిలిచి / వాడి వత్తయిపోయిన వాని బ్రతుకు !
చితికిన బతుకుల, చీకటి పల్లెల యథార్థ వ్యథార్థ జీవన దృశ్యం పెన్నేటి పాట. వస్తువు రూపాల సమన్వయం ఉన్న ఆధునిక కావ్యం పెన్నేటిపాట. పెన్నేటి పాటకు ప్రాణం సంక్షోభ ప్రజా జీవితమే.
సాహిత్యానికి, రాజకీయానికి అవినాభావ సంబంధం ఉంది. సమాజంలో పులి, మేక న్యాయం వుంటుంది. దీనిలో ఏది ఆధిపత్యంలో వుంటే దానివైపే ప్రభుత్వం వుంటుంది. అప్పుడు ప్రభుత్వ వర్గ స్వభావాన్ని బట్టి సాహిత్యానికి ఆదరణ వుంటుంది. అందుకే నాటి ఆంగ్లేయ ప్రభుత్వం యుద్ధవ్యతిరేక రచనలు చేశాడన్న కారణంగా విశ్వంకు ఏడాది జైలు శిక్ష విధించింది. సాహిత్య రంగంలోనే కాక, రాజకీయ రంగంలో కూడా చాలా కృషి చేశారు. తరిమెల నాగిరెడ్డి, నీలంసంజీవరెడ్డి ప్రభృత్తుల సహచర్యంతో ఆయన స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు.
1938 నుండి 45 వరకు అనంతపురం జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రజా పక్షపాతి, మానవతావాది విశ్వం 1987లో అక్టోబరు 19న కన్నుమూశారు. వారిని స్మరించుకోవటమంటే మన వర్తమాన జీవితాన్ని మరొక్కసారి మళ్లీ గతంతో పోల్చుకోవటమే, భవిష్యత్ కర్తవ్యాన్ని మనం
ఆవిష్కరించటమే. ఆయన కవితలో చెప్పాలంటే…
వడివడిగా నడు ! నడు!! క
న్పడు నేదోపల్లె యొకటి
విడుగుచుండె తిమిరమదే
తొడుగుచుండెనరుణకాంతి.

_ రచన: పిళ్ళా విజయ్,9490122229

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s