
రాచపాళెం చంద్రశేఖరరెడ్డి చిత్తూరు జిల్లా కుంట్రపాకంలో మంగమ్మ, రామిరెడ్డి దంపతులకు 16.10.1948న జన్మించారు. ప్రాథమిక విద్య కుంట్రపాకంలోను, తర్వాత తిరుపతి, కె.వి. పురంలోను హైస్కూలు
విద్యపూర్తి చేశారు. తిరుపతిలో బి.ఏ.,ఎం.ఏ., పిహెచ్.డి.పూర్తి చేశారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ
ప్రొఫెసర్గా 30.10.2008న పదవీ విరమణ చేశారు.
సాహిత్య విమర్శను బాధ్యతగా నిర్వర్తిస్తున్న రాయలసీమ విమర్శకులల్లో రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ముఖ్యులు. ఎంత కఠినమైనదైనా సత్యాన్ని చెప్పడంలో నిర్భయంగా వ్యవహరించడం రాచపాళెం శైలీ స్వభావం. అవధానులకు పెట్టని కోటైనా రాయలసీమలో జన్మించి, అవధానాలు బూర్జువా సంస్కృతికి చెందిన అవశేషాలని చెప్పారు. విమర్శకులలో చాలా అరుదుగా కనిపించే అకడమిక్ క్రమశిక్షణకు ఈయన పెట్టింది పేరు. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి విమర్శ వైఖరి ఎంతో సరళంగా, శాస్త్రీయంగా సాగుతున్నట్టే కనిపించినా, అది
సామాజిక సైద్ధాంతిక వెలుగులో పరిపుష్టిని సాధించింది.
గత మూడు నాలుగు శతాబ్దాల తెలుగు సాహిత్య విమర్శ చరిత్రను పరిశీలిస్తే చాలా కొద్దిమంది మాత్రమే విమర్శవైపు రావటం కనిపిస్తుంది. రాచపాళెం ఐదు దశాబ్దాలు పైగా విమర్శ రంగంలో వుంటూ విస్తృతంగానే విమర్శ రాశారు. రాచపాళెం రాసింది, రాసేది మార్క్సిస్టు సాహిత్య విమర్శ. మార్క్సిస్టు విమర్శ అనగానే మనకు వెంటనే స్ఫురించేది ఒక రచనకు వుండే సామాజిక నేపథ్యం, ఆ నేపథ్యపు కారణాలు మొదలైన వాటికి సంబంధించిన వివరాలు. సమాజానికి సాహిత్యానికి మధ్య వుండే సంబంధాన్ని విశ్లేషించే క్రమంలో మౌలికంగా ఆలోచన, అది వెలువడిన సామాజిక సందర్భాన్ని, సమాజంలో వున్న వైరుధ్యాలను ఎంతవరకు ప్రతిఫలంచేసిందనే విశ్లేషణ, రచన కంటే కూడా రచన వెలుపల వుండే
సామాజిక కారణాలు రచనను విశ్లేషించే క్రమంలో కీలకం కావటం చాలా తరచుగా మార్క్సిస్టు సాహిత్య విమర్శలో, విమర్శకులలో మనకు ఎదురయ్యే విషయం. ఈ ధోరణిని అనుసరిస్తూ అధిగమిస్తూ రాచపాళెం విమర్శ కొనసాగింది. సౌమ్యత, బ్యాలెన్స్ అటిట్యూడ్ ఆయనను. మార్క్సిస్టు టెక్నిక్ విమర్శకులలో విలక్షణ విమర్శకుడిగా నిలబెట్టింది. చర్చ పేరుతో వెలువడిన ఆయన వ్యాస సంపుటిలోని ప్రతీ వ్యాసం విషయాన్ని ఋజువు చేస్తుంది. అదే క్రమంలో, అంతే శక్తి వంతంగా విశ్లేషణాత్మక వ్యాసాలతో కూడిన మరొక వ్యాస సంపుటి మరో చర్చ. ఇరవైఐదు వ్యాసాలున్న ఈ సంపుటిలోప్రాచీన సాహిత్యం నుంచి ఇప్పుడు విమర్శ రాస్తున్న గౌరీశంకర్ వరకు వున్న అనేక ధోరణుల, వ్యక్తుల ఉద్యమాల గురించి వాటి తాత్త్విక అవగాహనల గురించి, అవి రూపొందటానికి కారణమైన సామాజిక స్థితిగతుల గురించి అనేక విశ్లేషణాత్మక
వ్యాసాలు వున్నాయి.
సామాజిక శాస్త్ర కేంద్రకంగా సాగే సాహిత్య విమర్శ, వృక్షాన్ని నిర్దిష్టంగా చెపితే మార్క్సిస్టు సాహిత్య విమర్శ దేశీయమైన సాహిత్య విమర్శా ప్రతిపాదనలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోగా దాన్ని తీవ్రంగా నిరాకరించింది. ఫలితంగా దేశీయ పునాది ఆమోదయోగ్యంగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో వల్లంపాటిలాంటి వాళ్ళు తమ సౌమ్యత వల్ల ఎక్కడో అచేతనంలోనయినా దేశీయ సాహిత్య ప్రతిపాదనల పట్ల వున్న ప్రేమవల్ల భారతీయ అలంకారశాస్త్రంలో పైరూ వుంది. కలుపూ వుంది. అన్నారు. అయితే ఆయనే విమర్శకులు కలుపుతో పాటు పైరును కూడా పెరికి పారేయడం తగదన్నారు. ఈ విషయంలో ఒక మార్క్సిస్ట్ గా వల్లంపాటి పట్ల చాలా నిర్మొహమాటంగా రాచపాళెం ఆలోచించారు.
ప్రాచీన సాహిత్యం పట్ల రాచపాళెంకు చాలా స్పష్టమైన వైఖరి వుంది. ఆవైఖరిలో ఎటువంటి రాజీ లేదు. మామూలు విషయాల్లో ఎంతో సౌమ్యంగా రాసే రాచపాళెం ఈ రాజీ లేని కారణంగా మరో సందర్భంలో (చూ. రాచపాళెం వ్యాసం సాహిత్య విమర్శలో వర్గ సంఘర్షణ) రచయిత సృజన శక్తిని నిషేధించి రొడ్డ కొట్టుడుతనాన్ని శాశ్వతం చేసిన అలంకార
శాస్త్రాలను విమర్శిస్తే తప్పేమిటని, అసలు మన అలంకార శాస్త్రాలు ప్రాచీన సాహిత్యాన్ని కూడా అర్థం చేసుకోవడానికి
కూడా సరిపోవని, ప్రాచీన సాహిత్యంలో మానవ సంబంధాలను అర్థం చేసుకోవడానికి కూడా అలంకార శాస్త్రం సరిపోదని చాలా నిర్దిష్టంగా ప్రకటించారు రాచపాళెం.
చర్చ వ్యాస సంపుటికి ఈ మరోచర్చ వ్యాస సంపుటి మలికొనసాగింపుగా అన్పిస్తుంది. ఈ క్రమాన్ని రాచపాళెంపుస్తకాల్లో ఇలా తన సాహిత్య విమర్శను నిరంతరంగా కొన
కొందరు కొన్ని కావ్యాలలోను, మన నవలలు, కథానికలు సాగిస్తున్నారు. తద్వారా తెలుగు సాహిత్య విమర్శ శక్తి మరింత పెంపొందించడంలో ఈయన కృషి పాత్ర గణించ దగినది.
“అతి తక్కువ మంది పాఠకులు మాత్రమే ఇష్టపడే టెక్నిక్ ను ఆశ్రయించే రచయితది పండిత శిల్పమని, అలాంటి రచయితలు శిల్పాన్ని, వస్తువును మింగేసే మిత్తవగా మారుస్తారని” అంటారు రాచపాళెం. కేవలం ప్రయోగం కోసం తమ ఇంగ్లీషు పుస్తక పాండిత్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం రాసిన
మిస్టిక్ రచనలు చేసే రచయితలను పరిగణనలోకి తీసుకొని, వారు పాఠకుల స్థాయిని దృష్టిలో వుంచుకొని రాయా లన్నారు.
కథానిక శిల్పంలో అత్యంత ప్రధానమైన అంశం రచయిత కంఠస్వరం అని రాచపాళెం గుర్తించారు.”కథన రీతికి సంబంధించి కథలు రెండు రకాలుగా వుంటాయి. ఒకటి మహా వృక్షాన్ని చూపించి విత్తనాన్ని ఊహించుకోమని చెప్పేవి రెండు విత్తనాన్ని చూపించి మహావృక్షాన్ని ఊహించుకోమని చెప్పేవి అని రాచపాళెం సులభంగా కథకులను విభజించారు. విమర్శ కుడికి అసంఖ్యాకంగా వున్న రచనలను స్థూలంగా వింగ డించుకోకపోతే పరిశీలన, అధ్యయన క్రమంలో అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కోవలసి వుంటుంది. కాబట్టి ప్రాథమిక దశలో విమర్శ పద్దతుల్ని విమర్శకుడి లక్షణాలను చాలావరకు పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా పరిశోధక విద్యార్థులు ఉపాధ్యాయులుఆచరించదగిన అకడమిక్ విమర్శకు వుండాల్సిన లక్షణాలన్ని ఈయన కథాంశంలో కనబడతాయి.కథాంశం అనే కథా విమర్శ గ్రంధాన్ని సంబద్ధత, సంభావ్యతా అన్న సూత్రాల ప్రాతిపదికగా కథలను విశ్లేషించే పద్ధతికి ఒక నమూనా విమర్శగా మలిచారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలలో అసమానత్వం సమస్యలన్నింటిని అపరిష్కృతంగానే ఉంచుతుంది. మానవ సంబంధాలలో ఆ ప్రతిఫలనాలు నిరంతర ఘర్షణకు దారితీస్తాయి. చదువు, కరువు,దళిత సమస్యలు అలాంటి కోవకు చెందినవే. కాబట్టి శక్తిని సామాజిక ఉద్యమాల సందర్భం నుంచి కథను అధ్యయనం చేయటం చరిత్రను పునర్నిర్మించటానికి కాదు. విమర్శ నాత్మకంగా అర్థం చేసుకోవటానికి కూడా ఉపయోగ పడగలవని రాయలసీమ, ఉత్తరాంధ్ర సాహిత్యంపైన రాచపాళెం రాసిన వ్యాసాలు నిరూపిస్తాయి.
నన్నయ ఒరవడి అనే లఘువిమర్శ గ్రంథంలోని ఆవిష్కరణలు రాచపాళెం అధ్యయన పద్ధతిని బహిర్గత పరుస్తుంది. నన్నయ వర్ణించిన కృతిపతి రాజరాజనరేంద్రుని
సభావర్ణనను ఒరవడిగా పాటించిన శ్రీనాథుడు, పింగళి సూరన లాంటి గొప్ప కవులు స్వీకరించారని చెప్పారు. పాఠకులకుఆసక్తి కలిగించే విధంగా కావ్యావతారికలలో చివర చెప్పిన “తత్కథా ప్రారంభం బెట్టిదనిన” అని నన్నయ చెప్పిన అంశాన్ని ఆ తర్వాతి కవులు పాటించారని పోతన భాగవతంలో, మారన మార్కండేయ పురాణంలో అనుకరించటాన్ని సోదాహరణంగా వివరించారు.
ప్రాచీనాంధ్ర కవుల సాహిత్య అభిప్రాయాలు- అభిరుచులు గ్రంథంలో ఆధునిక సాహిత్యకారులు, విమర్శకులు ప్రాచీన సాహిత్యాన్ని స్థల కాలస్పృహ లేకుండా చిన్నచూపు చూడటం, దుయ్యబట్టడం, ఒక ధోరణిగా కొనసాగుతున్న సందర్భంలో ఈ విమర్శ గ్రంథం నిర్వహించిన పాత్ర సముచితమైనది. మన ప్రాచీన కవులు ఏదో ఒక ఆలంకారిక సిద్ధాంతానికి నిబద్ధులై రాసినట్టుగా తోచదు. ఈ గ్రంథంలోని నన్నయ కవిత్వంలో కనబడిన సామాజిక దృష్టి కాలక్రమేణ శ్రీ కృష్ణదేవరాయల తరువాత ఎలా సాహిత్య ప్రయోజం కాకుండా పోయిందో ఉదాహరణ పూర్వకంగా నిరూపించారు.
శిల్ప ప్రభావతి అనే తన సిద్ధాంత గ్రంథంలో “ప్రభావతీ ప్రద్యుమ్నం”కావ్యంలోని శిల్పాన్ని ఆవిష్కరించడానికి కథా శిల్పమని, కథన శిల్పమని, రసశిల్పమని. పాత్ర చిత్రణా శిల్పమని, వర్ణణాలంకార శిల్పమని, శైలీ శిల్పమని,తులనాత్మక శిల్పమని రాచపాళెం చేసిన విభజన కావ్య పరిశోధనలో వినూత్నమైనది. కథాశిల్పంలో ప్రభావతీ ప్రద్యుమ్న కావ్య కథకు మూలాన్ని అన్వేషించి ప్రబంధ రచనకు పింగళి సూరన చేసిన మార్పులను సంతరించిన కూర్పులను హేతుబద్దంగా నిరూపించారు.
రచయిత నిబద్ధత, సమాజ పరిణామం సాహితీ
సాక్షం, కన్యాశుల్కం లో విద్యా వ్యవస్థ, గురువుల్ని నిలదీసిన శిష్యులు మొదలైన వ్యాసాలలో చాలా తరచుగా గురజాడ
సాహిత్యంలో నుంచి చాలా ఉదాహరణలు ఇచ్చారు. వాటిని చదివితే రాచపాళెంకు గురజాడ పట్ల ఉన్న మక్కువే కాదు, సాధికారికత కూడా చాలా ప్రస్ఫుటంగానే వ్యక్తమౌతుంది.
గురజాడ కథా సాహిత్యంపై గురజాడ, దీపధారి వంటి రచనలు చేశారు.అనుభూతి వాద ధోరణిలో వచ్చిన కావ్యాలను, ఆధునిక జీవితాన్ని వర్ణించిన కావ్యాలను తన భౌతికవాద దృక్పథంతో విమర్శ శిల్పాన్ని కొనసాగించారు. . తన నవలా విమర్శ లో దళిత బహుజన శ్రామిక చైతన్యాన్ని ఆహ్వానించాడు. ఈ సమాజం సంస్కరించ బడటానికి మార్క్సిజం అత్యవసరమని భావించే విమర్శకులల్లో రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ఒకరు . ఆధునిక కవిత్వంపైన ఆయన రాసిన వ్యాసాలు
ఆధునికాంధ్ర కవిత్వం ఉద్యమాలు సందర్భాలు
ప్రతిఫలనం అనే విమర్శ వ్యాస సంకలనం మార్క్సిస్ట్ సిద్ధాంత ప్రాతి పదికగా శ్రీశ్రీ దగ్గరినుంచి అఫ్సర్ వరకు చాలా మంది
కవుల రచనలను తనదైన ధోరణిలో వ్యాఖ్యానించారు.
జాషువా స్వప్నసందేశం, దరి-దాపు తులనాత్మక సాహిత్యవ్యాసాలు వంటి విమర్శ రచనలు చేశారు.

_ రచన: కిన్నెర శ్రీదేవి
(సేకరణ: పిళ్లా కుమారస్వామి,9490122229)