
ప్రాణత్యాగానికి ప్రతీకగా బ్రిటీష్ ప్రభుత్వం గుత్తి పట్టణం లొ సర్ థామస్ మన్రో సత్రం ఎదురుగా హంపన్న సమాధితో పాటు ఒక స్మారక స్తూపాన్ని నిర్మించింది.
బ్రిటిష్ సిపాయిల కామ దాహానికి బలైపోతున్న మహిళల శీలాన్ని కాపాడేందుకు ఎదురునిలిచి సిపాయిల తుపాకి గుళ్లకు ప్రాణాలు వదిలి గూళపాళెం హంపన్న 1893లో అమరుడయ్యారు. వీర హంపన్న

1893వ సంవత్సరం అక్టోబర్ 4న బ్రిటీష్ సిపాయిల దండు ఒకటి బళ్లారి నుండి సికింద్రాబాదుకి వెళుతూ గుంతకల్లులో విడిది చేసింది. ఆ రోజుల్లో మిలిటరీ దండు విడిది చేసిందంటే మహిళలు ఇల్లు ఒదిలి బయటకు వెళ్ళేందుకు సాహసించేవారు కాదు. ప్రాణ భీతితో భయకంపితులయ్యేవారు. గుంతకల్లులో విడిది చేసిన సైన్యంలోని ఇద్దరు సిపాయిలు సాయంత్రం గ్రామ శివారులో షికారుకు వెళుతూ జొన్న చేనులో గడ్డి కోసుకుంటున్న ఇద్దరు మహిళలను చూశారు.
ఆ ఇద్దరిమీద లైంగికంగా దాడిచేసేందుకు ప్రయత్నించారు. సిపాయిలు తమ వైపు రావడం గమనించిన మహిళలు భయంతో అక్కడి నుంచి పరుగు తీశారు. అయితే సిపాయిలు మాత్రం వారిని వదలక వెంబడించారు. అదే సమయంలో అక్కడి రైల్వే గేట్ కీపర్ గా ఉన్న గూళపాళెం హంపన్న ఆర్తనాదాల తో పరిగెడుతున్న మహిళలను చూశాడు. హంపన్న వెంటనే వారివద్దకు వెళ్లి తన గదిలోకి వెళ్లమని చెప్పాడు. అనంతరం హంపన్న సిపాయిలకు అడ్డుగా నిలిచాడు. అడ్డు తొలగమని సిపాయిలు హంపన్నకు అర్థం కాని భాషలో ఆదేశించారు. ఆయన బెదరలేదు.
దీంతో ఆంగ్లేయ సిపాయిలు ఆగ్రహించి హంపన్నను తుపాకితో కాల్చారు. తుపాకి పేలుడు శబ్దం విన్న రైల్వే పోలీసులు అక్కడికి పరుగులు తీశారు. దీంతో సిపాయిలు పారిపోయారు.
తుపాకీ గుళ్లకు నేలకొరిగిన హంపన్నను ప్రాణాలతో బ్రతికించాలని వెంటనే గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి.
హంపన్న ధైర్య సాహసానికి, మానవత్వానికి మహిళల మాన ప్రాణాలు కాపాడేందుకు ప్రాణాలు పోగొట్టుకున్న అమరవీరుడికి గుర్తుగా గుత్తిలోనే ఒక స్థూపం నిర్మించారు.

ఆ స్థూపం దిగువ భాగాన ‘‘ యూరోపియన్ సిపాయిల బారి నుంచి ఇద్దరు మహిళలను రక్షించబోయి సిపాయిల తుపాకీ గుళ్లకు బలైన హంపన్న పార్థీవ దేహం ఇక్కడ పాతి ఉంది. ఇతను మరణించి యూరోపియన్, భారత దేశస్తుల మెప్పు పొందాడు’’ అని ఆంగ్ల భాషలో రాసి ఉంది. బ్రిటీష్ పాలకులు గుత్తి దుర్గాన్ని సందర్శించినప్పుడల్లా హంపన్న స్మారక స్థూపానికి, ఘనంగా రాజ లాంఛనాలతో నివాళులు అర్పించేవారు.

__రచన: పిళ్లా కుమారస్వామి,9490122229