రామిరెడ్డి

జీవిత ప్రయాణం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతొందో ఎవరు చెప్పలేరు. కొందరు ఇంటిపేరుతో వాసికెక్కితే మరికొందరు కలం పేరుతో, ఇంకొందరు ఊరిపేరుతో ఇలా ఏదో ఒక పేరుతో ప్రముఖ స్థానం సంపాదించుకొంటారు.అసలు పేరు చెపితే ఎవరో తెలీదంటారు. అలా సినీ పేరు ముందు చెబితే కానీ ఆయనను చాలా మంది గుర్తు పట్టలేరు. మొదటి సినిమా తోనే ఆయన సంచలన ప్రతి నాయకులు గా గుర్తింపు పొందారు.స్పాట్ పెడతా అనే ఆయన డైలాగ్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ డైలాగ్ చెప్పిన తీరు ఆయన నటనకు ఓ మలుపు తెచ్చింది . ఆయన ఏవరో కాదు అంకుశం రామిరెడ్డి జర్నలిజం నుంచి సినీరంగంలో ప్రవేశించి అనతికాలంలోనే అనేక సినిమాల్లో నటించారు. బహుబాష ల్లో మాట్లాడేవారు.

గంగసాని రామిరెడ్డిచిత్తూరు జిల్లా, వాయల్పాడు మండలం ఓబుళంవారిపల్లె లో జన్మించారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి జర్నలిజం కోర్సులో పోస్టుగ్రాడ్యుయేషన్‌ డిప్లొమా చేశారు . రామిరెడ్డి హిందీ, ఉర్దూ దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. అనంతరం సినిమాల్లో ప్రవేశించారు. రామిరెడ్డి మంచి బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుడు. గంగసాని రామిరెడ్డి భారతదేశపు ప్రముఖ నటుడు. ఇతడు ప్రతినాయక పాత్రలకు ప్రసిద్ధి. దాదాపు అన్ని భారతీయ భాషలలో నటించాడు. తెలుగులో అంకుశం చిత్రం ద్వారా నట జీవితాన్ని ప్రారంభించిన రామిరెడ్డి, అ చిత్రం ఘనవిజయం సాధించడంతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మళయాల, భోజ్పురి భాషలలో ప్రతినాయకుడిగా దాదాపు 250 చిత్రాలలో నటించాడు. సినిమాల్లోకి రాకముందు మున్సిఫ్ పత్రికలో విలేకరిగా పనిచేశారు.

1990 లో అంకుశం సినిమా తో సినీ రంగ ప్రవేశం చేశారు. అంకుశం సెప్టెంబరు 28, 1990 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై సంచలన విజయం సాధించిన తెలుగు సినిమా. రాజశేఖర్, జీవిత ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం ద్వారా ప్రతినాయకుడు రామిరెడ్డి సినీ రంగ ప్రవేశం చేశాడు.‘అంకుశం’ చిత్రం డాక్టర్‌ రాజశేఖర్‌కి యాంగ్రీ యంగ్‌ మాన్‌ ఇమేజ్‌ తీసుకు వస్తే…అందులో విలన్ పాత్ర లో ప్రేక్షకుల్ని అబ్బురపరిచి అనతికాలంలోనే ‘అంకుశం’ రామిరెడ్డిగా పేరు గడించారు.

కరడు కట్టిన విలన్‌గానే కాకుండా కామెడీ పాత్రల్లోనూ తన ప్రతిభ చాటుకున్నారు. ”అమ్మోరు, గాయం, ఒసే రాములమ్మ, జగదేకవీరుడు- అతిలోకసుందరి, హిట్లర్‌, అంజి, అనగనగా ఒక రోజు, క్షణక్షణం, పెద్దరికం” లాంటి ఎన్నో హిట్‌ చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, భోజ్‌పురి, హిందీభాషా చిత్రాల్లో ఆయన నటించారు.1990లో కన్నడ సినీ రంగంలో ప్రవేశించి ‘ అభిమన్యు ’ సినిమా చేసారు. అదే సంవత్సరం తెలుగులో సంచలనం సృష్టించిన రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రేదేవి నటించిన‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ చిత్రంలో అబ్బులు పాత్రలో మెరిశారు. కాస్త కామెడీ టచ్‌ ఉన్న విలన్‌ పాత్ర ఇది. తెలుగు ‘అంకుశం’ హిందీలో ‘ప్రతిబంద్‌’గా రీమేక్‌ అయినప్పుడు… అక్కడ కూడా గ్యాంగ్‌స్టర్‌ ‘స్పాట్‌ నానా’ పాత్రని జనరంజకంగా పోషించారు.1991లో మలయాళం లో ‘అభిమన్యు’, తమిళ్‌లో ‘నాడు అతయ్‌ నాడు’ లో నటించారు. అంకుశం’ హిందీ రీమేక్ “ప్రతిబంద్’ లో నటించిన రామిరెడ్డి మంచి గుర్తింపు రావడంతో రాజు కుమార్, రజనీకాంత్, వినోద్ ఖన్నా, ధర్మేంద్ర, సంజయదత్, అక్షయ్ కుమార్ వంటి హీరోలతో నటించే అవకాశం ఆయనకు లభించింది.

‘క్షణక్షణం’లో ఇన్‌స్పెక్టర్‌ యాదవ్‌ పాత్రల్లో నటించారు. 1992లో తెలుగులో ‘420’ ‘బలరామ కృష్ణులు’, ‘పెద్దరికం’, మలయాళంలో ‘మహాన్‌’ చిత్రాల్లో నటించారు. 1993లో మళ్ళీ ‘గాయం’, హిందీలో ‘వక్త్‌ హమారీ హై’ చిత్రాల్లో కీలకభూమికలు పోషించారు. 1994లో తెలుగులో ‘అల్లరి ప్రేమికుడు’, హిందీలో ‘ఇలాన్‌’, ‘దిల్‌ వాలే’, ‘ఖుద్దార్‌’ సినిమాల్లో నటించారు. 1995లో తెలుగులో వచ్చిన అమ్మోరు సినిమా లో క్షుద్ర మాంత్రికుడు గా నటిస్తాడు ఈ చిత్రం ద్వారా రామిరెడ్డి మరో మెట్టు ఎదిగారు. అదే సంవత్సరం హిందీలో ‘అంగరక్షక్‌’, ‘ఆందోళన్‌’, ‘హాకీకత్‌’, ‘వీర్‌’ చిత్రాల్లో నటించారు. 1996లో హిందీలో ‘అంగారా’, ‘రంగ్‌ బాజ్‌’ చిత్రాల్లో నటించారు. 1997లో ‘అనగనగా ఒక రోజు’, ‘హిట్లర్‌’ చిత్రాల్లో నటించారు. అదే సంవత్సరం హిందీలో ‘జీవన్‌ యుద్ద్‌’, ‘కాలియా’, ‘లోహ’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు.

వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ అంచెలంచెలుగా ఆయన ఎదిగారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా బాగా గుర్తింపు పొందారు. తొలి సినిమాకే నంది అవార్డు తెచ్చు కోవడంతో పాటు మరో తొమ్మిది అవా ర్డులు పొందడం కూడా అరుదైన విషయం. తను నటునిగా మారడానికి, పేరు తెచ్చుకోవడానికి కారకులైన నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, దర్శకుడు కోడి రామ కృష్ణ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వారి పట్ల కృతజ్ఞతా భావాన్ని వెల్లడించే వారు.

పాత్రలు మారినా ప్రతి సినిమాలోనూ రామిరెడ్డి గెటప్ ఎప్పుడూ ఒక్కటే.విలన్ కి కొత్త నిర్వచనం చెప్పిన రామిరెడ్డి సక్సెస్ కు బట్టతల, గడ్డం కారణం’ అనే వారు నవ్వుతూ, విగ్గు లేకుండా ఇన్ని సినిమాల్లో నటించిన ఘనత బహుశా రామిరెడ్డి దేనేమో.’స్పాట్ పెడతా అంటూ ‘అంకుశం’ చిత్రంతో నటుడైన రామిరెడ్డి ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ స్పాట్ క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా అమ్మోరు’, ‘అంకుశం’ వంటి చిత్రాల్లోని పాత్రలు ఆయన తప్ప వేరొకరు చేసినా అంత నప్పవేమో అనే స్థాయిలో ఆయన నటన ఉంది. ‘మృగరాజు’, ‘రాఘవేంద్ర’, ‘సాంబు’, ‘విలన్‌’, ‘అంజి’, ‘శేషాద్రి నాయుడు’, ‘పెళ్ళాం పిచ్చోడు’, ‘శ్లోకం’, ‘అతనొక్కడే’, ‘నాయకుడు’, ‘భామాకలాపం’, ‘సామాన్యుడు’, ‘అదే నువ్వు’, ‘జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా’, ‘దమ్మున్నోడు’, ‘సందడి’, ‘అనగనగా ఓ అరణ్యం’ చిత్రాల్లో నటించారు.

ఆయన చివరి చిత్రం మర్మం . తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, భోజ్‌పురి, హిందీభాషా చిత్రాల్లో ఆయన నటించారు. నటనలో ఆయన జీవించే వారు. ఓ సారి ఆయనకు విచిత్రమైన సంఘటన ఎదురైంది. నటన అని మరిపించినందుకు దెబ్బలు తిన్నారు. ఒసేయ్ రాములమ్మ
సినిమా విడుదలైన తర్వాత మద్రాసు లోని టీ నగర్ లో విజయ కుమారి థియేటర్లో సినిమా చూడటానికి రామిరెడ్డి వెళ్లారు .ఇది గమనించి అక్కడికి వచ్చిన ప్రేక్షకులు ముక్కుపచ్చలారని రాములమ్మ జీవితాన్ని నాశనం చేసి అంత దారుణంగా రేప్ చేస్తావా అంటూ ఉద్వేగంగా విలన్ గా నటించిన రామిరెడ్డి పై చేయి చేసుకున్నారు. ప్రేక్షకులను ఆ రేంజిలో ప్రభావితం చేసాడు అంటే విలన్ గా రామిరెడ్డి నటన ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఒసేయ్ రాములమ్మ సినిమాలో దొర పాత్రలో నటించి ఎన్నో అవార్డులు రివార్డులు ప్రశంసలు సైతం అందుకున్నారు.అంకుశం రామిరెడ్డి సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో మూత్రపిండాల వ్యాధి కి చికిత్స పొందుతూ 2011 ఏప్రిల్‌ 14న మరణించారు ,
మరణించేనాటికి ఆయన వయసు 52 సంవత్సరాలు. రామిరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

సేకరణ :– చందమూరి నరసింహారెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s